భద్రాచలం/జూలూరుపాడు/కామేపల్లి/వైరా/భద్రాద్రికొత్తగూడెం/కూసుమంచి/ములకలపల్లి, వెలుగు: గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులు, కారోబార్, బిల్ కలెక్టర్లను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనాన్ని పెంచాలని డిమాండ్చేస్తూ ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లోని జీపీ కార్మికులు గురువారం సమ్మెకు దిగారు. మండల కేంద్రాల్లోని ఎంపీడీఓ ఆఫీసుల ముందు బైఠాయించి నిరసన దీక్ష చేపట్టారు. భద్రాచలం పంచాయతీ ఆఫీస్ ముందు చేపట్టిన దీక్షలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మచారి పాల్గొని మాట్లాడారు. పంచాయతీ కార్మికులది ఆకలి పోరాటం అన్నారు. గ్రామాల్లోని ప్రజలు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
జూలూరుపాడు మండల కేంద్రంలో నిర్వహించిన సమ్మెలో ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ ఏదులాపురం గోపాలరావు పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పంచాయతీ కార్మికులను నిర్లక్ష్యం చేస్తోందన్నారు. కామేపల్లి ఎంపీడీఓ ఆఫీస్ ముందు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్యాణం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. పీఆర్సీలో నిర్ణయించిన మినిమం బేసిక్(రూ.19 వేలు)ను జీపీ కార్మికులకు చెల్లించాలని కోరారు. కారోబార్, బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలని డిమాండ్ చేశారు. 8 గంటల పని విధానం, వారాంతపు సెలవులు, పండుగ సెలవులు అమలు చేయాలన్నారు. ప్రమాదవశాత్తు జీపీ కార్మికుడు మరణిస్తే వారి కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలోని జీపీ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని సీఐటీయూ ములకలపల్లి మండల కన్వీనర్ నిమ్మల మధు డిమాండ్చేశారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ ఆఫీస్ ముందు నిర్వహించిన నిరసన దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ప్రత్యేక బడ్జెట్ కేటాయించి జీఓ నంబర్60 ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. తక్కువ వేతనం ఇచ్చి వెట్టి చాకిరి చేయించుకోవడం కరెక్ట్కాదన్నారు. కారోబార్, బిల్ కలెక్టర్లకు రూ.22,500, కార్మికులకు రూ.19,500 ఇవ్వాలని కోరారు. కూసుమంచి మండల కేంద్రంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఐఎఫ్టీయూ లీడర్లు బజ్జురి వెంకటరామిరెడ్డి, ఇరుగు వెంకన్న, సీపీఐ లీడర్మల్లేశ్ పాల్గొని మద్దతు తెలిపారు. అంతకు ముందు జీపీ కార్మికులు మానవహారం నిర్వహించారు. కొత్తగూడెం బస్టాండ్సెంటర్లో చేపట్టిన నిరసన దీక్షలో కార్మిక సంఘాల జేఏసీ నాయకులు గుత్తుల సత్యనారాయణ, వాసిరెడ్డి మురళి, డి.వీరన్న. అమర్, సురేశ్, కిషోర్, మంజుల, కనకలక్ష్మి, సలీంమియా, వెంకన్న, ఆదిలక్ష్మి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మెను కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. వైరా ఎంపీడీఓ ఆఫీస్ ముందు వివిధ గ్రామాలకు చెందిన జీపీ కార్మికులు నిరసన దీక్ష చేపట్టారు. కనీస వేతనం రూ.20 వేలు ప్రకటించాలని డిమాండ్ చేశారు.