జాయింట్ సర్వే చేసి చర్యలు తీసుకోవాలి

  • సమన్వయ కమిటీ మీటింగ్​లో మంత్రి పువ్వాడ
  • పాల్గొన్న ఎంపీలు నామా, వద్దిరాజ్ రవి చంద్ర

ఖమ్మం కార్పొరేషన్​, వెలుగు : అటవీ హక్కు పత్రాలు పొందని అర్హులైన గిరిజన, గిరిజనేతర రైతులకు  న్యాయం చేసేందుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు. కలెక్టరేట్​లోని ప్రజ్ఞ మీటింగ్​ హాల్​లో పోడు భూముల సమస్య పరిష్కారానికి శుక్రవారం జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 1,57,531 ఎకరాల అటవీ ప్రాంతం (14.61 శాతం) ఉన్నట్లు తెలిపారు. ఐటీడీఏ, రెవెన్యూ, అటవీ శాఖలు సర్వే చేసి.. అటవీ, రెవిన్యూ భూముల సమస్యలు ఉంటే పరిష్కరించాలన్నారు. పోడు భూముల హక్కుల కోసం జిల్లాలో 18295 దరఖాస్తులు వచ్చాయని, ఆ దరఖాస్తులను గ్రామ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి, 2005 కు ముందు నుంచి పోడు సాగుచేస్తున్న గిరిజనుల, 75 సంవత్సరాల నుండి పోడు భూములను సాగు చేస్తున్న గిరిజనేతరుల వివరాలను సేకరించి, తీర్మానాలను, రిజిస్టర్లను నమోదు చేయాలని సూచించారు.  శాటిలైట్ మ్యాపుల ప్రకారం సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించి, పక్కాగా వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేయాలని చెప్పారు. అసలైన పోడురైతులకు పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, వారికి రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు అందిస్తామని తెలిపారు. ఆ తర్వాత అటవీ భూములు ఆక్రమణలు జరుగకుండా, అటవీ రక్షణ చట్టం అమలుపై ప్రజలకు అవగాహన కలిగించాలని మంత్రి తెలిపారు. అర్హులైన ప్రతి దరఖాస్తుదారునికి న్యాయం చేయాలన్నారు. 

ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ .. పోడు సమస్య పరిష్కారానికి జాయింట్ సర్వే చేసి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ పోడు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మార్గదర్శకాలతో ఉత్తర్వులు జారీచేసిందని అన్నారు. ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ.. పోడు సమస్యల పరిష్కారానికి సంబంధించి పూర్తి స్పష్టత ఉండాలని, సాంకేతిక సమస్యలు ఉండకూడదని అన్నారు. కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ 2008 నుంచి 2022 వరకు ఆర్​ఓఎఫ్​ఆర్​ కింద 13276 దరఖాస్తులు వచ్చాయని రెవిన్యూ, అటవీ శాఖల సంయుక్త సర్వేతో 6143 దరఖాస్తులను ఆమోదించి, 17,861 ఎకరాలకు పట్టాలు అందజేసినట్లు తెలిపారు. వీరికి రైతుబంధు ఇస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క , సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, జడ్పీ చైర్మన్ లింగాల కమలరాజ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్, భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రూ, అడిషనల్​ కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్. మధుసూదన్, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్ పాల్గొన్నారు.