- మూడు నెలల్లో ప్రాసెస్ పూర్తి చేయాలని సర్కార్ ఆదేశాలు
- జగిత్యాల జిల్లాలో 39,554 దరఖాస్తులు
- క్షేత్రస్థాయిలో పరిశీలించనున్న రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ శాఖల అధికారులు
- అసైన్డ్ భూములును గుర్తించే పనిలో ఆఫీసర్లు
జగిత్యాల, వెలుగు : ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్(ఎల్‌ఆర్‌ఎస్)పై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల వెరిఫికేషన్‌కు ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. మూడు నెలల్లో వెరిఫికేషన్ పూర్తి చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ శాఖల ఆఫీసర్లు జాయింట్ సర్వేకు రెడీ అవుతున్నారు. జగిత్యాల జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు 39,554 రాగా క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు.
అసైన్డ్, ఇరిగేషన్ భూములపై ఫోకస్
అక్రమ ప్లాట్లు , లే అవుట్లను క్రమబద్ధీకరించేందుకు గత సర్కార్ ఎల్‌ఆర్‌ఎస్ స్కీమ్‌ను తీసుకొచ్చింది. దీంతో వేలాది మంది ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనిలో ఆసైన్డ్ భూములు ఆధికంగా ఉన్నట్లు సమాచారం. దీంతో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ సర్కార్ రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ డిపార్మెంట్లకు సంబంధించిన ఆఫీసర్లకు సర్వే బాధ్యతలు అప్పగించారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి సర్వే నంబర్ల ఆధారంగా ఆయా గ్రామాలు, మున్సిపాలిటీల్లో జీపీఎస్ ద్వారా వివరాలు నమోదు చేస్తారు.
మున్సిపాలిటీల్లో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లతోపాటు ఇరిగేషన్ ఏఈ, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ క్షేత్రస్థాయిలో వివరాలు నమోదు చేయనున్నారు. అలాగే ఇరిగేషన్ కు సంబంధించి బఫర్ జోన్, నాలా, చెరువు భూములతోపాటు హెరిటేజ్ బిల్డింగ్, డిఫెన్స్ భూములకు సంబంధం లేని వాటినే అప్రూవ్ చేయాలనే ఆదేశాలు వచ్చాయి. మూడు డిపార్ట్మెంట్లు ఆమోదించాకే ఎల్-1 లాగిన్ నుంచి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లకు (ఎల్- 2 లాగిన్) కు దరఖాస్తు పంపిస్తారు. అక్కడి నుంచి ఎల్- 3 లాగిన్ మున్సిపల్ కమిషనర్ కు వెళ్తుంది. సంబంధిత ఫీజు చెల్లించిన అనంతరం కమిషనర్ ఆమోదంతో ఎల్ఆర్ఎస్ పత్రం జారీ చేయనున్నారు.
39,554 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు
జగిత్యాల జిల్లా లో 39,554 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఐదు మున్సిపాలిటీల్లో 26, 593 రాగా, వివిధ గ్రామాల నుంచి 12,961 వచ్చాయి. జగిత్యాల మున్సిపాలిటీలో 8,003 దరఖాస్తులు, మెట్‌పల్లిలో 6538, కోరుట్లలో 9,143, రాయికల్‌లో 1,898 ధరఖాస్తులు, ధర్మపురిలో 1,011 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో జగిత్యాల లో 186, కోరుట్లలో 167 రిజెక్ట్ అయ్యాయి. అప్రూవల్ అయినవాటిలో జగిత్యాలలో 37, మెట్ పల్లి లో 45, కోరుట్లలో 6 దరఖాస్తులు ఉన్నాయి.
ఫేక్ ఎన్వోసీలకు చెక్
ప్రభుత్వం పంపిణీ చేసిన అసైన్డ్ భూముల్లో అక్రమంగా ప్లాట్లు వెలిశాయి. 1956 కంటే ముందు ప్రభుత్వం అసైన్డ్ చేసిన భూములకు ఫేక్ ఎన్ఓసీలు జారీ చేశారు. దీంతో కొందరు ఈ భూముల్లో రియల్ ఎస్టేట్ పేరుతో దందా మొదలెట్టారు. మరికొన్ని భూములను కబ్జా చేస్తున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. గతంలో రెవెన్యూ ఆఫీసర్లు ఇచ్చిన ఎన్వోసీలను గుర్తించడం కష్టంగా మారింది. తాజాగా మూడు శాఖల జాయింట్ సర్వేతో ఈ అక్రమాలకు చెక్ పడనుంది.
ఎల్ఆర్ఎస్‌నుసద్వినియోగం చేసుకోవాలి
దరఖాస్తుదారులు ఎల్ఆర్ఎస్ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ శాఖల సమన్వయంతో ఫీల్డ్ సర్వే చేసేందుకు రెడీ అవుతున్నాం. దీంతో ఎల్‌ఆర్‌ఎస్ వెరిఫికేషన్ స్పీడప్ కానుంది. అసైన్డ్, ఇరిగేషన్ భూముల్లో వెలిసిన ప్లాట్లు, వెంచర్లను రిజెక్ట్ చేస్తున్నాం.
- డీటీసీపీవో శ్రీనివాస్, జగిత్యాల