కేంద్రం తీరు సరిగా లేదంటూ ఫైర్
అవే అభ్యంతరాలు వ్యక్తం చేసిన తెలంగాణ
హైదరాబాద్, వెలుగు: ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండా పోలవరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఎలా ఇచ్చారని కేంద్ర జలశక్తి శాఖను ఒడిశా నిలదీసింది. ఒక్కో ప్రాజెక్టుకు ఒక్కోలా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో కేంద్ర జలశక్తి శాఖ సెక్రటరీ పంకజ్ కుమార్ గురువారం ఒడిశా, చత్తీస్‌గఢ్, తెలంగాణ, ఏపీ ఇరిగేషన్ సెక్రటరీలతో వెబ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టుకు 2005లో 36 లక్షల డిశ్చార్జి కెపాసిటీకి పర్మిషన్ ఇచ్చారని, కానీ ఏపీ ప్రభుత్వం 50 లక్షల క్యూసెక్కుల డిశ్చార్జీ కెపాసిటీతో ప్రాజెక్టు నిర్మిస్తోందని ఒడిశా తెలిపింది. అయితే ప్రాజెక్టు గేట్ల ద్వారా 50 లక్షల క్యూసెక్కుల నీళ్లు కిందికి వెళ్లే పరిస్థితి లేదన్నారు. దీనిపై స్టడీ చేయాలని కోరింది. తాము ఐఐటీ రూర్కీతో స్టడీ చేయిస్తే పోలవరం వద్ద 58 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశముందని లెక్కగట్టినట్టు తెలిపింది. తమ భూభాగంలో 30 కి.మీ.ల పొడవునా 15 మీటర్ల ఎత్తులో కరకట్టలు నిర్మిస్తామని ఏపీ చెప్తోందని, ఇందుకు ఎంత మట్టి కావాలి, అది ఎక్కడి నుంచి తెస్తారో చెప్పాలంది. ఎంత భూమిని సేకరించాల్సి వస్తుందనే దానిపై ఏమైనా అంచనా ఉందా అని ప్రశ్నించింది. ప్రాజెక్టు డిజైన్ మార్పుతో అత్యధిక ప్రభావం తమపై పడుతుంటే ఏ సర్వేలోనూ తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోలేదని, వాటిని తాము ఎలా ఆమోదిస్తామని అడిగింది.
అక్టోబరులో జాయింట్ సర్వే
ఒడిశా లేవనెత్తిన అభ్యంతరాలపై స్పందించిన పంకజ్‌కుమార్.. సీడబ్ల్యూసీ, ఏపీ అధికారులు అక్టోబర్ రెండో వారంలో ఒడిశాకు వస్తారని, వారితో కలిసి జాయింట్ సర్వే, ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని సూచించారు. ఈ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలన్నారు. మూడు నెలల్లోగా ఇది పూర్తయ్యే అంశం కాదని, టైం బాండ్ లేకుండా జాయింట్ సర్వే చేయాలని ఒడిశా అధికారులు కోరారు. తెలంగాణ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్ మాట్లాడుతూ, ఒడిశా లేవనెత్తిన అభ్యంతరాలన్నీ తమ రాష్ట్రానికి వర్తిస్తాయన్నారు. ఇటీవల వచ్చిన వరదలతో భద్రాచలం ప్రాంతాల ముంపుపై ఇప్పటికే తాము కేంద్రానికి లేఖ రాశామని, ఆ లేఖలో పలు అంశాలు లేవనెత్తామని గుర్తు చేశారు. పోలవరంలో పూర్తి స్థాయి నీటిని నిల్వ చేస్తే భద్రాచలానికి ఎగువన ఉన్న వాగులు, నదులు గోదావరిలో కలువకుండా నీళ్లు వెనక్కి ఎగదన్ని ఎక్కువ మొత్తంలో భూములు ముంపునకు గురవుతాయని తెలిపారు. పోలవరం డిజైన్‌ను 36 లక్షల డిశ్చార్జ్కెపాసిటీ నుంచి 50 లక్షల క్యూసెక్కులకు పెంచడంతో బ్యాక్ వాటర్‌పై జాయింట్ సర్వే చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. దీనితో అనేక టెక్నికల్ అంశాలు ముడిపడి ఉన్నందున అక్టోబర్ 7న నాలుగు రాష్ట్రాల టెక్నికల్ ఆఫీసర్లు సమావేశమై వాటిపై చర్చించాలని పంకజ్ కుమార్ సూచించారు. ఈ కమిటీ రిపోర్ట్ ఆధారంగా తదుపరి చర్యలు చేపడతామన్నారు.