చిరునవ్వులతో బతకాలి... చిరంజీవిలా బతకాలి..అందరూ ప్రతి రోజు సరదాగా జోక్ లు వేస్తూ నవ్వండి.. నవ్వించండి.. ప్రతి రోజూ జోక్లతో నవ్వడం వలన ఆరోగ్యంగా ఉండొచ్చు. నవ్వడం వలన మన శరీరంలో ఉండే రోగాలన్నీ మాయమై, మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఎన్ని బాధలు ఉన్నా ఓ చిరునవ్వుతో చిన్న పలకరింపు దొరికితే చాలా ఆ ఆనందం మరో విధంగా ఉంటుంది. అందుకే నవ్వు గురించి ఎందరో కవులు, రచయితలు చాలా గొప్పగా వర్ణించారు. జులై 1 అంతర్జాతీయ జోక్ ల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. . .
పక్కన ఎవరూ లేకుండా.. సినిమాల్లో కామెడీ సీన్లు చూసినా.... మంచి జోక్ చదివినా ... మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుందే తప్ప పగలబడి నవ్వలేరు. సినిమాలు లేదా స్కిట్ లో పేల్చే జోకుల వల్ల పుట్టే నవ్వు కంటే.. నిజ జీవితంలో ఏదైనా చూసినప్పుడు వచ్చే నవ్వుకు పదును చాలా ఎక్కువ. రియల్ లైఫ్ అంటే.. బస్సులోనో... బస్టాండ్లోనో... క్లాస్రూంలోనో.. ఆఫీసులోనో అకస్మాత్తుగా ఎవరైనా జోక్ వేస్తే కడుపుబ్బ నవ్వుతారు.
పక్కవాళ్ల మీద జోకులు వేస్తే నవ్వరు. ఇక వాళ్ల మీద వాళ్లే జోకులు వేసుకుని నవ్వుకుని, నవ్వించే వాళ్లు .. చాలా తక్కువ మంది ఉంటారు. వీళ్లకి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. తమ మీద ఇతరులు పేల్చే జోకుల్ని తట్టుకోలేని వాళు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో బాధపడుతున్నట్టు లెక్క. వీళ్లకు సెన్సాఫ్ హ్యూమర్ తక్కువ. సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువగా ఉన్న ఉద్యోగులే ఎక్కువ సామర్థ్యంతో పని చేయలగుతారని చాలా స్టడీల్లో బయటపడింది.
మనం హాస్య ప్రియులం
పురాతన కాలం నుంచి కూడా మన దేశంలో జోకులకు ప్రముఖ స్థానం ఉంది. రాజుల పాలనా కాలంలో విదూషకులు ఉండేవాళ్లు. జోకులు వేసి.. హాస్యాన్ని పండించడమే వాళ్ల అసలు పని. కావ్యాల్లో నవ రసాలు పండించాలని.. అందులో హాస్యానికి పెద్ద పీటవేసేవారు. రాజును నవ్వించి బహుమతులు పొందిన కవులు కూడా ఉన్నారు. బీర్బల్, తెనాలి రామకృష్ణ వంటి వాళ్ల కథలు గిలిగింతలు పెడతాయి. జానపద గీతాల్లోనూ, పురాణాల్లోను, నాటకాల్లోనూ హాస్యరసం పుష్కలం. ఇప్పుడు చూసుకుంటే... కార్టూన్లు, కామెడీ సినిమాల నుంచి కొత్తగా వస్తున్న కామెడీ స్కిట్ల వరకు అన్నింటిలో హాస్యరసమే పొంగేది. వాటన్నింటికీ జోకులే పునాది.
నవ్వులు కురిపించడంలో ఆడవాళ్లదే పైచేయి. ఆడవాళ్లు మగవాళ్లకంటే ఎక్కువసార్లు నవ్వుతారట. ప్రేమించిన అమ్మాయిని నవ్వించడానికి అబ్బాయిలు చాలా కష్టాలు పడతారంట. అబ్బాయిలను నవ్వించడం అబ్బాయిలకు పెద్ద కష్టం కాదట! 62 శాతం హాస్యరసంలో ముంచెత్తే మగవాళ్లను అమ్మాయిలు ఇష్టపడితే, తన హాస్యంలో కనీసం 65శాతానికి స్పందించే అమ్మాయిలను... అబ్బాయిలు కోరుకుంటారని అధ్యయనాలు అంటున్నాయి. అడల్ట్ జోకులు పురుషులకు చక్కిలిగింతలు పెడితే, మహిళలు మాత్రం మంచి హాస్యరసం ఉన్న జోకులకే ఓటేస్తారని మరో అధ్యయనంలో తేలింది.
మనిషికి ఇప్పుడు వస్తున్న జబ్బుల్లో 70శాతం ఒత్తిడితో సంబంధం ఉన్నవే. రక్తపోటు, గుండెజబ్బులు, డిప్రెషన్, ఇన్సోమియా, మైగ్రేన్, ఆతృత, అలర్జీ, పెప్టిక్ అల్సర్..వంటి వాటికన్నింటికీ మూల కారణం ఒత్తిడే! ఈ ఒత్తిడికి టానిక్, ట్యాబ్లెట్ నవ్వే! ఒత్తిడికి గురైనప్పుడు అడ్రినలిన్ అధికంగా విడుదలవుతుంది. నవ్వినప్పుడు మాత్రం అది తగ్గుతుంది. తమలో తాము ముడుచుకుపోయేవాళ్లతో పోలిస్తే.. మంచిగా నవ్వుకునేవాళ్లకు గుండె జబ్బుల సమస్యలు తక్కువ. కాబట్టి రోజు కొంచెం నవ్వును సేవిస్తే చాలు... ఎన్నో జబ్బులు రాకుండా జాగ్రత్త పడొచ్చు.
నవ్వడం వలన కలిగే ప్రయోజనాలు
- నవ్వుతూ బతికేవారి ఆయుప్రమాణాలు మెరుగవుతాయి.
- కోపాన్ని తగ్గిస్తుంది. ఒత్తిడి, ఆందోళనను దూరం చేస్తుంది.
- నవ్వుతో కండరాలు రిలాక్స్ అవుతాయి.
- నవ్వడం వలన శరీరం మొత్తం రిలాక్స్ అవుతుంది.
- నవ్వడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఎక్సర్సైజ్ చేయకున్నా ఏం కాదు. కానీ, నవ్వడానికి కూడా బద్ధకంగా ఫీల్ అయితే.. శరీరం కృశించిపోతుంది. నవ్వని వాళ్ల మొఖంలో వెలుగు ఉండదు. నవ్వని వాళ్ల చెంపలు బిగుతుగా తయారై.. ఉన్న వయసు కంటే ఎక్కువ వయసు వాళ్లలాగా కనిపిస్తారు. మనసారా నవ్వే వాళ్లు ఆకర్షణీయంగా ఉంటారు. అందరికీ నచ్చుతారు. కోపంగా, అసంతృప్తిగా ఉన్న వాళ్ల వైపు చూసి చిన్న నవ్వు విసిరితే చాలు...వాళ్లు కూడా నవ్వుతారు. రిలీఫ్ గా ఫీలవుతారు. ఎవరైనా జోకులు వేస్తే విసుక్కోకుండా.. ఎగతాళిగా నవ్వుకోకుండా.. మీరూ ఆ నవ్వులలో భాగం అవ్వండి. నవ్వు ఒక మందు. నవ్వు ఒక ఆయుధం! జీవితానికి ఆశ, ఆత్మవిశ్వాసం అవసరం.. వాటిని ఇచ్చే శక్తి హాస్యానికి ఉంది. కాబట్టి రోజూ.. ఫ్రెండ్స్.. ఫ్యామిలీతో కలిసి జోకులు పేల్చుకోండి. నవ్వులు పంచుకోండి.