KKR vs RR: ధోనీ, కోహ్లీ చేసిందే నేను చేశా..మ్యాచ్ గెలిపించడానికి అదే నాకు స్ఫూర్తి: బట్లర్

KKR vs RR: ధోనీ, కోహ్లీ చేసిందే నేను చేశా..మ్యాచ్ గెలిపించడానికి అదే నాకు స్ఫూర్తి: బట్లర్

జోస్ బట్లర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ ఇంగ్లాండ్ ఆటగాడు ఇప్పటికే తానై తాను నిరూపించుకుని బెస్ట్ బ్యాటర్లలో ఒకడిగా నిలిచాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో ముఖ్యంగా టీ20 క్రికెట్ లో బట్లర్ తనకంటూ ఒక సపరేట్ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. తాజాగా నిన్న (ఏప్రిల్ 16) ఐపీఎల్ లో కేకేఆర్ పై సెంచరీ చేసి ఒంటి చేత్తో రాజస్థాన్ రాయల్స్ కు విజయాన్ని అందించాడు. 60 బాల్స్‌‌‌‌లో 9 ఫోర్లు, 6 ఫోర్లతో 107 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇలాంటి ఇన్నింగ్స్ లు ఆడటం బట్లర్ కు కొత్త కాకపోయినా ఛేజింగ్ లో ఇంత పరిణితిగా బ్యాటింగ్ చేయడం బట్లర్ కు బహుశా ఇదే తొలిసారి.
 
పవర్ ప్లే లో వచ్చి మంచి ఆరంభాలను ఇవ్వడం.. భారీ ఇన్నింగ్స్ లు ఆడి మ్యాచ్ ను గెలిపించడం.. ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. అయితే నిన్న కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో ఇన్నింగ్స్ మొదటి బంతి నుంచి మ్యాచ్ గెలిపించేవరకు క్రీజ్ లో పాతుకుపోయాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు ఒంటరి పోరాటం చేస్తూ వారియర్ లా పోరాడాడు. లోయర్ ఆర్డర్ తో కలిసి ఓడిపోయే మ్యాచ్ ను గెలిపించాడు. మ్యాచ్ తర్వాత ఈ ఇన్నింగ్స్ గురించి బట్లర్ మాట్లాడుతూ తన ఇన్నింగ్స్ కు భారత స్టార్ క్రికెటర్లు ధోనీ, కోహ్లీనే  కారణమని చెప్పాడు. 

"నేను ఫామ్ లోకి రావడానికి చాలా కష్టపడ్డాను. మీరు కొన్నిసార్లు నిరాశకు గురై ఉంటారు. కానీ నేను నన్ను నమ్మాను. ఫామ్ లోకి రాగలనని ,మళ్ళీ నా లయను అందుకోగలనని భావించాను. ఈ ఇన్నింగ్స్ క్రెడిట్ ధోనీ, కోహ్లిలకు వెళ్తుంది. జట్టు కోసం వారు చివర వరకు క్రీజ్ లో ఉంటారు. ఇదే విషయం నన్ను ప్రభావితం చేసింది. మ్యాచ్ చివరి వరకు క్రీజ్ లో ఉండాలని నిర్ణయించుకున్నాను. సెంచరీతో జట్టును గెలిపించడం చాలా సంతోషంగా ఉంది". అని బట్లర్ చెప్పుకొచ్చాడు.