IPL 2025: ఓపెనర్‌గా అవకాశమిచ్చాడు.. అతనికి రుణపడి ఉంటాను: బట్లర్

IPL 2025: ఓపెనర్‌గా అవకాశమిచ్చాడు.. అతనికి రుణపడి ఉంటాను: బట్లర్

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ ప్రపంచ విధ్వంసకర బ్యాటర్లలో ఒకడు. ఈ ఇంగ్లీష్ ఆటగాడు ఓపెనర్ గా కుదురుకుంటే అలవోకగా భారీ స్కోర్లు చేయగలడు. ముఖ్యంగా ఐపీఎల్ లో బట్లర్ ఓపెనింగ్ రికార్డ్ అమోఘం. ఓపెనర్ గా నాలుగు సెంచరీలు చేయడంతో పాటు పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. కెరీర్ ప్రారంభంలో ఇంగ్లాండ్ జట్టుకు ఆడుతున్నప్పుడు బట్లర్ మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసేవాడు. కొన్నిసార్లు లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేస్తూ ఫినిషింగ్ బాధ్యతలు చేపట్టాడు. ఇదిలా ఉంటే.. బట్లర్ ఓపెనర్ గా మారడానికి ఐపీఎల్ కారణమని చెప్పాడు. 

తనకు ఓపెనర్ గా అవకాశం ఇచ్చినందుకు అప్పటి ముంబై హెడ్ కోచ్ మహేల జయవర్ధనేకు రుణపడి ఉంటానని అతను చెప్పాడు.  బట్లర్ మాట్లాడుతూ.. "నేను బ్యాటింగ్ ఆర్డర్ లో లోయర్ ఆర్డర్ నుంచి ఓపెనర్ గా మారడాన్ని చాలా ఆస్వాదించాను. నా కెరీర్ ప్రారంభంలో నేను మిడిల్ ఆర్డర్ లేదా లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసేవాడిని. టీ20 క్రికెట్‌లో ఓపెనర్‌గా అవకాశం ఇచ్చినందుకు మహేల జయవర్ధనేకు నేను చాలా రుణపడి ఉంటాను. పవర్‌ప్లే ఎలా ఆడాలో తెలుసుకున్నాను. పవర్ ప్లే తర్వాత ఎలా బ్యాటింగ్ చేయాలో అప్పటికీ నాకు తెలుసు". అని బట్లర్ చెప్పుకొచ్చాడు. 

బట్లర్‌ తొలిసారిగా ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు తరపున ఆడాడు. 2017 లో సీజన్ ప్రారంభంలో అతను ముంబై తరపున ఇన్నింగ్స్ ఆరంభించాడు. ఆ తర్వాత  రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఓపెనర్ గా ఆడుతూ అద్భుతంగా రాణించాడు. వేగంగా ఆడడంతో పాటు నిలకడగా రాణిస్తూ ప్రపంచ క్రికెట్ లో బెస్ట్ టీ20 ఓపెనర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ తరపున మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నాడు. మూడు మ్యాచ్ ల్లో 166 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్టులో మూడో స్థానంలో ఉన్నాడు.