ఐపీఎల్ లో ప్రస్తుతం ప్లే ఆఫ్స్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. మంగళవారం (మే 21) క్వాలిఫయర్ 1 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నేడు (మే 22) ఎలిమినేటర్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో రాజస్థాన్ రాయల్స్ అమీతుమీ తేల్చుకోనుంది. అయితే ఈ ప్లే ఆఫ్స్ మ్యాచ్ లకు ఇంగ్లాండ్ క్రికెటర్లు లేకపోవడంతో ఆయా జట్లు తమ కీలక ప్లేయర్లు లేకుండానే ఆడాల్సి వస్తుంది. ఇదే సమయంలో పాకిస్థాన్ తో ఇంగ్లాండ్ టీ20 సిరీస్ ఉండడంతో ఇంగ్లీష్ ప్లేయర్లు ప్లే ఆఫ్స్ మ్యాచ్ ల నుండి వైదొలిగారు.
లీడ్స్ వేదికగా ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్ల మధ్య బుధవారం (మే 22) తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు ముందు మంగళవారం విలేకరులతో మాట్లాడిన బట్లర్.. ఐపీఎల్ సమయంలో ఎలాంటి అంతర్జాతీయ క్రికెట్ జరగకూడదని అభిప్రాయపడ్డాడు. "ఇంగ్లండ్ కెప్టెన్‌గా నా ప్రధాన ప్రాధాన్యత ఇంగ్లండ్‌కు ఆడటమే. ఐపీఎల్ జరిగే సమయంలో అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ ప్లాన్ చేయకూడదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అంతర్జాతీయ మ్యాచ్ లను సంవత్సరంలో ఎప్పుడైనా నిర్వహించుకోవచ్చు". అని బట్లర్ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ లో బట్లర్ రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నాడు. నేడు బెంగళూరుతో జరగబోయే మ్యాచ్ కు ఈ ఇంగ్లాండ్ కెప్టెన్ లేకపోవడం రాజస్థాన్ కు పెద్ద లోటనే చెప్పాలి. జాక్స్, టోప్లీ లేకుండానే ఆర్సీబీ మ్యాచ్ ఆడబోతుంది. బట్లర్ తో పాటు లియామ్ లివింగ్‌స్టోన్, విల్ జాక్స్, రీస్ టోప్లీ, జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రాన్, ఫిల్ సాల్ట్ స్వదేశానికి వెళ్లిపోయారు. ఇంగ్లాండ్ క్రికెటర్లు ప్రతి సీజన్ లో ఇలా మధ్యలోనే వైదొలగడంతో సునీల్ గవాస్కర్, ఇర్ఫాన్ పఠాన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. టోర్నీ మొత్తానికి అందుబాటులో ఉండండి. లేకపోతే ఐపీఎల్ కు రావద్దు అని పఠాన్ కామెంట్ చేశాడు.