ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ సరైన సమయంలో ఫామ్ లోకి వచ్చాడు. గత కొద్దికాలంగా ఫామ్ లేక ఇబ్బందిపడుతున్న ఈ ఇంగ్లాండ్ ఓపెనర్ మళ్ళీ తన పునర్వైభవాన్ని ప్రదర్శించాడు. సోమవారం (నవంబర్ 11) వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 45 బంతుల్లో 83 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. బట్లర్ సూపర్ ఇన్నింగ్స్ పక్కన పెడితే ఈ మ్యాచ్ లో అతను కొట్టిన ఒక సిక్సర్ ఏకంగా 115 మీటర్ల దూరం వెళ్ళింది.
ఇన్నింగ్స్ 9 ఓవర్ మూడో బంతిని విండీస్ స్పిన్నర్ మోటీ లెంగ్త్ బాల్ విసిరాడు. ఈ బంతిని బట్లర్ ఫ్రంట్ కు వచ్చి లాంగాన్ దిశగా బలంగా బాదాడు. దీంతో బంతి నేరుగా స్టేడియం రూఫ్ మీద పడి బయట పడింది. 115 మీటర్ల దూరంలో పడిన ఈ బంతి.. కనిపించకుండా పోయింది. దీంతో అంపైర్లు కొత్త బంతిని తీసుకొచ్చారు. ఈ సిక్సర్ మ్యాచ్ మొత్తానికే హైలెట్ గా నిలిచింది. ఐపీఎల్ కు ముందు బట్లర్ ఇలాంటి ఇన్నింగ్స్ ఆడడంతో అతన్ని అన్ని ఫ్రాంచైజీలు టార్గెట్ చేసే అవకాశం కనిపిస్తుంది. 2025 ఐపీఎల్ సీజన్ కోసం రాజస్థాన్ రాయల్స్ ఈ ఇంగ్లీష్ కెప్టెన్ ను రిటైన్ చేసుకొని సంగతి తెలిసిందే.
ALSO READ | SL vs NZ: ధోనీ ఆల్‌టైం రికార్డ్ బ్రేక్ చేసిన న్యూజిలాండ్ క్రికెటర్
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ పావెల్ 43 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. 159 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 14.5 ఓవర్లలోనే ఛేజ్ చేసింది. బట్లర్ 45 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 83 పరుగులు చేశాడు. లియామ్ లివింగ్‌స్టోన్ 11 బంతుల్లోనే 23 పరుగులు చేసి వేగంగా బ్యాటింగ్ చేశాడు. ఈ విజయంతో ఇంగ్లాండ్ 5 టీ20ల సిరీస్ లో 2-0 ఆధిక్యంలో నిలిచింది.
JOS BUTTLER WITH A 115M SIX. 🤯🔥 pic.twitter.com/cfwNjHyWKn
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 11, 2024