Jos Buttler: ఛాంపియన్స్ ట్రోఫీలో వరుస ఓటములు.. కెప్టెన్సీకి రాజీనామా చేసిన బట్లర్

Jos Buttler: ఛాంపియన్స్ ట్రోఫీలో వరుస ఓటములు.. కెప్టెన్సీకి రాజీనామా చేసిన బట్లర్

ఇంగ్లాండ్ వైట్ బాల్ కెప్టెన్ జోస్ బట్లర్ తన కెప్టెన్సీ పదవికి రాజీనామా చేశాడు. శుక్రవారం (ఫిబ్రవరి 28) బట్లర్ తన కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నాడని అధికారికంగా ప్రకటించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా పరాజయాలే ఇందుకు కారణమని తెలుస్తుంది. బట్లర్ వన్డే కెప్టెన్సీ పగ్గాలు చేపట్టినప్పటినుంచి ఇంగ్లాండ్ 50 ఓవర్ల ఫార్మాట్ లో ఘోరంగా విఫలమవుతుంది. కెప్టెన్ గా, బ్యాటర్ గా రాణించలేకపోతున్నాడు. దీంతో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు బట్లర్ ను వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి తప్పించాలని వార్తలు వచ్చాయి. అతని స్థానాల్లో హ్యారీ బ్రూక్ ఇంగ్లాండ్ కెప్టెన్ గా ఎంపికయ్యే అవకాశం ఉంది. 

వన్డేల్లో ఇంగ్లాండ్ ప్రదర్శన చూసుకుంటే చివరి 9 వన్డేల్లో 8 మ్యాచ్ ల్లో ఓడిపోయారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ పై 0-3 తేడాతో క్లీన్ స్వీప్ అయ్యారు. ఇక అంతకముందు ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో 3 మ్యాచ్ ల్లో పరాజయం తప్పలేదు. భారత్ వేదికగా జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్ లోనూ ఇంగ్లాండ్ సెమీస్ కు చేరడంలో విఫలమైంది. ఈ టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో పరాభవం సంచలనంగా మారింది. ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ తమ చివరి మ్యాచ్ లో శనివారం (మార్చి 1) సౌతాఫ్రికాతో తలపడుతుంది. కెప్టెన్ గా బట్లర్ కు ఇదే చివరి మ్యాచ్. 

Also Read:-స్టీవ్ స్మిత్ క్రీడా స్ఫూర్తి.. అప్పీల్ వెనక్కి తీసుకున్న ఆసీస్ కెప్టెన్..

బట్లర్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ 2022 టీ20 వరల్డ్  గెలుచుకుంది. 2024 టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ కు చేరినా భారత్ చేతిలో ఓడిపోయింది. ఇక వన్డేల్లో బట్లర్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ అంచనాలను అందుకోలేకపోయింది. భారత్ వేదికగా జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్ లో గ్రూప్  దశలోనే ఇంటిదారి పట్టింది. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ ఆట చూస్తుంటే అసలు వన్డేలు ఎలా ఆడాలో మర్చిపోయారనే సందేహం కలుగుతుంది. ఆడిన తొలి రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయారు. భారీ స్కోర్ కొట్టి ఆస్ట్రేలియా మీద ఓడిపోయిన బట్లర్ సేన బుధవారం(ఫిబ్రవరి 26) ఆఫ్ఘనిస్తాన్ పై ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది.