ది హండ్రెడ్ లీగ్ నాలుగో ఎడిషన్ మంగళవారం (జూలై 23) నుండి ప్రారంభం కానుంది. ఈ లీగ్ నుంచి ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ గాయం కారణంగా తప్పుకున్నాడు. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బట్లర్ కు గాయం అయినట్టు తెలుస్తోంది. ఈ లీగ్ లో మాంచెస్టర్ ఒరిజినల్స్ తరపున బట్లర్ ఆడుతున్నాడు. మాంచెస్టర్ ఒరిజినల్స్ గురువారం (జూలై 25) వెల్ష్ ఫైర్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.
రిపోర్ట్స్ ప్రకారం బట్లర్ ఆరు నెలల పాటు క్రికెట్ కు దూరం కానున్నాడు. అతను లేకపోవడంతో మాంచెస్టర్ కు పెద్ద ఎదురు దెబ్బ తగలనుంది. బట్లర్ మాంచెస్టర్ ఒరిజినల్స్‌కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అతను దూరమవడంతో ఓపెనర్ పిల్ సాల్ట్ ఈ జట్టుకు కెప్టెన్ గా ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇంగ్లాండ్ కెప్టెన్ గా బట్లర్ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read:-కోహ్లీ అలా చేయడంతో ద్రవిడ్ ఏడ్చాడు.. టీ20 వరల్డ్ కప్‌పై అశ్విన్
సెప్టెంబర్ లో ఇంగ్లాండ్ వైట్ బాల్ సిరీస్ కోసం ఆస్ట్రేలియాకు ఆతిథ్యం ఇవ్వనుంది. సెప్టెంబర్ 4 నుండి 7 వరకు స్కాట్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో ఆస్ట్రేలియా యూకే పర్యటనను ప్రారంభించనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 11 నుండి 15 వరకు ఇంగ్లాండ్‌తో మూడు టీ20లు.. సెప్టెంబర్ 19 నుండి 29 వరకు ఇంగ్లాండ్ తో ఐదు వన్డేల్లో కంగారూల జట్టు తలపడుతుంది. ఈ సిరీస్ సమయానికి బట్లర్ అందుబాటులో ఉండడం అనుమానంగా మారింది.
బట్లర్ గాయం.. కెప్టెన్సీ వైఫల్యంతో ఇంగ్లాండ్ వన్డే, టీ20 ఫార్మాట్ కు కొత్త కెప్టెన్ ను నియంనించాలని చూస్తోందట. 2023 వన్డే వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ ఆరో స్థానంలో నిలిచింది. ఇటీవలే ముగిసిన టీ20 వరల్డ్ కప్ లోనూ సెమీస్ లో నిష్క్రమించింది. దీంతో ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డ్ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ.. బట్లర్, ప్రధాన కోచ్ మాథ్యూ మోట్‌తో చర్చలు జరపాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఇంగ్లాండ్ వన్డే, టీ20 జట్టుకు బట్లర్.. టెస్ట్ జట్టుకు స్టోక్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.