ఇదెక్కడి విధ్వంసం: 57 బంతుల్లో 140..శివాలెత్తిన ఆసీస్ బ్యాటర్

ఇదెక్కడి విధ్వంసం: 57 బంతుల్లో 140..శివాలెత్తిన ఆసీస్ బ్యాటర్

జోష్ బ్రౌన్.. క్రికెట్ లో ఈ పేరు పెద్దగా ఎవరికీ పరిచయం లేదు. ఇప్పటివరకు దేశవాళీ లీగ్ లో మాత్రమే ఆడిన ఈ ఓపెనర్ జాతీయ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. దీంతో ఈ ప్లేయర్ ను ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఒక్క ఇన్నింగ్స్ తో అందరి దృష్టిని  తనవైపుకు తిప్పుకున్నాడు  ఈ 30 ఏళ్ళ ఓపెనర్ టీ20ల్లో సెంచరీ చేయడమే గగనమనుకుంటే ఏకంగా 57 బంతుల్లో 140 పరుగులు చేసి పెను విధ్వంసం సృష్టించాడు. బ్రౌన్ ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, 12 సిక్సర్లు ఉన్నాయి. 

బిగ్ బాష్ లీగ్ లో బ్రిస్బేన్ హీట్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రౌన్.. నేడు (జనవరి 22) అడిలైడ్ స్ట్రైకర్స్‌పై జరిగిన మ్యాచ్ లో కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. స్ట్రైకర్స్‌ బౌలర్లను ఊచకోత కోస్తూ బౌండరీల వర్షం కురిపించాడు. ఈ ఇన్నింగ్స్ తో బిగ్ బాష్ లీగ్ లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన మూడో ఆటగాడిగా రికార్డులకెక్కాడు.  2022 లో గ్లెన్ మ్యాక్స్ వెల్ హోబర్ట్ హరికేన్స్ పై 154 పరుగులు చేశాడు.  2021 లో సిడ్నీ థండర్ పై  స్టోయినీస్ 147 పరుగులు చేశాడు.   

41 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న బ్రౌన్.. ఈ లీగ్ లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా మ్యాక్స్ వెల్ తో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. బిగ్ బాష్ లీగ్ లో సిమ్మన్స్ 39 బంతుల్లో సెంచరీ చేసి మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. బ్రౌన్.. విధ్వంసంతో మొదట బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. వీటిలో బ్రౌన్ మాత్రమే 140 పరుగులు చేయడం విశేషం. కెప్టెన్ మెక్ స్వీని 33 పరుగులు చేయగా మిగిలిన వారందరూ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. లక్ష్య ఛేదనలో అడిలైడ్ ప్రస్తుతం 12 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది.