T20 World Cup 2024: స్కాట్లాండ్ మ్యాచ్‌ను సీరియస్‌గా తీసుకోము: ఇంగ్లాండ్‌ను భయపెడుతున్న ఆసీస్ పేసర్

T20 World Cup 2024: స్కాట్లాండ్ మ్యాచ్‌ను సీరియస్‌గా తీసుకోము: ఇంగ్లాండ్‌ను భయపెడుతున్న ఆసీస్ పేసర్

టీ20 వరల్డ్ కప్ లో ఇప్పుడు ఇంగ్లాండ్ భవితవ్యం ఆస్ట్రేలియా, స్కాట్లాండ్ మ్యాచ్ పై ఆధారపడి ఉంది. ఈ మ్యాచ్ లో ఆసీస్ విజయం సాధిస్తేనే ఇంగ్లాండ్ సూపర్ 8 ఆశలు సజీవంగా ఉంటాయి. గ్రూపు బి లో భాగంగా ఆడిన మూడు మూడు మ్యాచ్ ల్లో ఆస్ట్రేలియా విజయం సాధించి సూపర్ 8 బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. మరోవైపు ఆడిన మూడు మ్యాచ్ ల్లో 5 పాయింట్లతో స్కాట్లాండ్ సూపర్ 8 కు దగ్గరలో ఉంది. 

జూన్ 16 న సెయింట్ లూసియా వేదికగా ఆస్ట్రేలియాతో జరగబోయే మ్యాచ్ స్కాట్లాండ్ గెలిచినా.. లేకపోతే వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయినా ఇంగ్లాండ్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ప్రపంచంలోని అగ్రశ్రేణి జట్లలో ఒకటైన ఆస్ట్రేలియా.. స్కాట్లాండ్ పై విజయం సాధించడం పెద్దకష్టం కాదు. అయితే తాజాగా ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ చేసిన వ్యాఖ్యలు  ఇంగ్లాండ్ కు దడ పుట్టిస్తున్నాయి. 

స్కాట్లాండ్ తో మ్యాచ్ మాకు పెద్ద కీలకం కాదని ఈ మ్యాచ్ ను సీరియస్ గా తీసుకోవట్లేదని ఈ ఆసీస్ పేసర్ అన్నాడు. మా వల్ల ఇంగ్లాండ్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తే మాతో పాటు అన్ని జట్లకు కలిసి వస్తుందని.. ఇంగ్లాండ్ ప్రమాదకరమైన జట్లలో ఒకటని తర్వాత స్టేజ్ లో ఇంగ్లాండ్ ను ఎదుర్కోవాల్సి వస్తే కష్టమని హేజిల్‌వుడ్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఇంగ్లాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించాలని హేజల్ వుడ్ పరోక్షంగా తన మనసులో మాట బయట పెట్టాడు. 

డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ కు ఏదీ కలిసి రావడం లేదు. రెండు మ్యాచ్ లాడితే ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో ఒక పాయింట్ మాత్రమే ఉంది. మరో రెండు మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. ఒమన్, నమీబియాలతో ఇంగ్లాండ్ గెలవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. అయితే ఈ రెండు మ్యాచ్ ల్లో ఒకటి ఓడిపోయినా లేకపోతే వర్షం కారణంగా మ్యాచ్ రద్దయినా ఇంగ్లాండ్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. అదే సమయంలో స్కాట్లాండ్ తమ చివరి మ్యాచ్ లో ఆసీస్ పై ఖచ్చితంగా ఓడిపోవాలి. అంతేకాదు చివరి రెండు మ్యాచ్ ల్లో నెట్ రన్ రేట్ మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉంది.