T20 World Cup 2024: 4 ఓవర్లలో 5 పరుగులు.. వార్మప్‌లో నిప్పులు చెరిగిన ఆసీస్ బౌలర్

T20 World Cup 2024: 4 ఓవర్లలో 5 పరుగులు.. వార్మప్‌లో నిప్పులు చెరిగిన ఆసీస్ బౌలర్

వరల్డ్ కప్ లాంటి మెగా ఈవెంట్ అనగానే ఆస్ట్రేలియాకు ఎక్కడ లేని పూనకం వస్తుంది. ద్వైపాక్షిక సిరీస్ లు ఎలా ఆడినా వరల్డ్ లో తమలోని మరో కోణాన్ని చూపిస్తారు. ఐసీసీ ట్రోఫీలంటే ఈజీగా గెలిచే ఆస్ట్రేలియా మరో ట్రోఫీపై కన్నేసింది. జూన్ 2 నుంచి వెస్టిండీస్, అమెరికా గడ్డపై టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఇందులో భాగంగా నేడు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా పసికూన నమీబియాను చిత్తు చిత్తుగా ఓడించింది. 

ఈ మ్యాచ్ లో హైలెట్ ఏదైనా ఉందంటే అది ఆసీస్ ఫాస్ట్ బౌలర్ జోష్ హేజల్ వుడ్ బౌలింగ్ అని చెప్పుకోవాలి. కొంతకాలంగా క్రికెట్ దూరంగా ఉన్న ఈ పేసర్.. వార్మప్ మ్యాచ్ లో చెలరేగి ఆడాడు. చిన్న జట్టని కొంచెం జాలి కూడా లేకుండా బెంబేలెత్తించాడు. నిప్పులు చెరిగే బంతితో నమీబియాను కోలుకోనీయకుండా చేశాడు. తన నాలుగు ఓవర్ల స్పెల్ లో కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి వరల్డ్ కప్ కు ముందు పెద్ద జట్లకు వార్నింగ్ ఇచ్చాడు. 2 వికెట్లు తీయడంతో పాటు 3 మెయిడిన్స్ విసిరాడు. 

ఈ మ్యాచ్ లో ప్రధాన బౌలర్లు కమ్మిన్స్, స్టార్క్ అందుబాటులో లేరు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ ఫైనల్ ఆడడంతో జట్టులో చేరేందుకు ఆలస్యం అవుతుంది. ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా నమీబియాపై 8 వికెట్ల తేడాతో ఈజీ విక్టరీ కొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన నమీబియా.. జోష్ హేజిల్‌వుడ్ (2/5), లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా (3/25) ధాటికి 9 వికెట్ల నష్టానికి 119 పరుగులు మాత్రమే చేసింది. లక్ష్య ఛేదనలో డేవిడ్ వార్నర్ (21 బంతుల్లో 54 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో 10 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేజ్ చేసింది.