బండ్లు, కార్ల అమ్మకాల్లో జోష్.. రాష్ట్రంలో కోటిన్నరకు చేరువైన వెహికల్స్

  • బైకులు 1.06 కోట్లు, కార్లు 19లక్షలు
  • గ్రేటర్ జిల్లాలోనే 60 లక్షల బండ్లు
  • మొత్తం 1.43 కోట్ల వెహికల్స్ ఉన్నయ్
  • మరో వైపు పెరుగుతున్న ట్రాఫిక్, పొల్యూషన్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:  రాష్ట్రంలో బైకులు, కార్లు, ఇతర వెహికల్స్ మస్త్ అయితున్నయి. ఏటేటా బండ్ల సేల్స్ పెరుగుతున్నయి. హైదరాబాద్ తో పాటు టైర్ టూ సిటీలు, టౌన్ లు, రూరల్ ఏరియాల్లోనూ సేల్స్ జోరుగ సాగుతున్నయి. దీంతో రాష్ట్రంలో మొత్తం వెహికల్స్ సంఖ్య కోటిన్నరకు చేరువైంది. వాహనాల కొనుగోళ్లు పెరగడంతో ఆ మేరకు రిజిస్ట్రేషన్ ఫీజుల రూపంలో సర్కారుకు కూడా మస్త్ ఆమ్దానీ వస్తున్నది. మరోవైపు వెహికల్స్ సంఖ్య పెరిగినకొద్దీ ట్రాఫిక్ రద్దీ ఎక్కువైతోంది. ఎయిర్, సౌండ్ పొల్యూషన్ కూడా పెరిగిపోతోంది. 
మొత్తం బండ్లు 1.43 కోట్లు  
రాష్ట్రంలో మొత్తం 54 ఆర్టీవో ఆఫీసులు, యూనిట్‌‌‌‌ ఆఫీసులు ఉన్నాయి. అన్ని చోట్లా కలిపి రోజూ వేల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం వాహనాల సంఖ్య 1.43 కోట్లకు చేరింది. ఇందులో బైకులే అత్యధికంగా 1.06 కోట్లు ఉన్నాయి. ఆ తర్వాత అత్యధికంగా కార్లు19 లక్షలు ఉన్నాయి. అలాగే 6.3 లక్షల ట్రాక్టర్స్‌‌‌‌ అండ్‌‌‌‌ ట్రాలీస్​, 5.7 లక్షల గూడ్స్‌‌‌‌ క్యారేజీలు, 4.5 లక్షల ఆటోలు నడుస్తున్నయి. మొత్తం బండ్లలో 60 లక్షల వరకు హైదరాబాద్‌‌‌‌, మేడ్చల్‌‌‌‌ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లోనే ఉన్నాయి.  
నిరుడు 8.9 లక్షల బండ్లు సేల్ 
రాష్ట్రంలో 2015 నాటికి 84 లక్షల బండ్లు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత ఏటా బండ్ల సంఖ్య భారీగా పెరుగుతూ వస్తోంది. 2020లో మొత్తం 9.2 లక్షల వెహికల్స్ సేల్ అయ్యాయి. నిరుడు మాత్రం కొంచెం తక్కువగా 8.9 లక్షల బండ్లు అమ్ముడయ్యాయి. ఇందులో 6.1 లక్షల టూవీలర్లు, 1.2 లక్షల కార్లు ఉన్నాయి. మరోవైపు రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌‌‌‌ వెహికల్స్‌‌‌‌ సేల్స్‌‌‌‌ కూడా ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి.  
సర్కారుకు మస్తు ఇన్‌‌‌‌కం 
వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో సర్కారుకు కూడా మస్తు ఆమ్దానీ వస్తోంది. బండి కొన్నప్పుడు లైఫ్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌, క్వార్టర్లీ ట్యాక్స్‌‌‌‌, రిజిస్ట్రేషన్‌‌‌‌, సర్వీసు చార్జీలు తదితర పేర్లతో బాగానే ఇన్ కం సమకూరుతోంది. సెకండ్‌‌‌‌ రిజిస్ట్రేషన్‌‌‌‌కు కూడా వివిధ చార్జీల పేరిట వసూళ్లు జరుగుతున్నాయి. 2021 జనవరి నుంచి డిసెంబర్‌‌‌‌ వరకు వివిధ ట్యాక్స్‌‌‌‌ల రూపంలో ఆర్టీఏకు రూ. 2,680 కోట్ల ఆమ్దానీ వచ్చింది. 2020లో రూ. 1,989 కోట్లు మాత్రమే వచ్చాయి. నిరుడు సేల్స్ తగ్గినా, కమర్షియల్ వెహికల్స్ పై ట్యాక్స్ రూపంలో రూ. 691 కోట్లు సర్కారుకు అదనంగా వచ్చాయి. ఇక 2019లో రూ. 2,290 కోట్ల ఇన్‌‌‌‌కం ప్రభుత్వానికి సమకూరింది.  
సొంత బండ్లకే ప్రయారిటీ 
జీహెచ్‌‌‌‌ఎంసీ పరిధితోపాటు ఇతర ముఖ్య పట్టణాల్లో చిన్నచిన్న కంపెనీలు, పరిశ్రమలు ఏటా పెరుగుతున్నయి. కొన్ని ప్రాంతాల్లో ఐటీ కంపెనీల ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. వీరు ఏదో ఒక వాహనాన్ని కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సొంత వాహనాలపై మొగ్గు చూపుతున్నారు. చిరు ఉద్యోగులు, వ్యాపారులు కూడా కార్లతోపాటు బైకులను వాడుతున్నారు. మరికొందరు ప్రిస్టేజీ కోసం ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని వెహికల్స్ వాడుతున్నారు. ఇక కరోనా భయంతో కూడా బండ్లు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కన్నా జనం సొంత వెహికల్స్ లో ప్రయాణాలకే ప్రయారిటీ ఇస్తున్నారు.   
ట్రాఫిక్ రద్దీ.. పొల్యూషన్ కూడా.. 
రాష్ట్ర వ్యాప్తంగా వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో ట్రాఫిక్ రద్దీ, ఎయిర్, సౌండ్ పొల్యూషన్ కూడా పెరుగుతున్నయి. బండ్లు ఎక్కువ కావడంతో ట్రాఫిక్ ఆటోమేటిక్ గా పెరుగుతోంది. సిటీలో అనేక చోట్ల రోజూ గంటల తరబడి ట్రాఫిక్ జాంలలో చిక్కుకుని, జనం అవస్థలు పడుతున్నరు. హైదరాబాద్ లో ఇప్పటికే వెహికల్స్ పొగతో పొల్యూషన్ కూడా భారీగా పెరిగింది. అటు ట్రాఫిక్, ఇటు పొల్యూషన్ తో జనం ఇబ్బందులు పడుతున్నరు. కొన్నాళ్ల క్రితం వరకూ ప్రధాన నగరాలకే పరిమితమైన పొల్యూషన్.. ఇప్పుడు టైర్ 2 సిటీలకు కూడా పాకుతోంది. వెహికల్స్ మరింతగా పెరుగుతూ పోతే.. భవిష్యత్తులో మరింత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.  

సెకండ్ హ్యాండ్ బండ్లకూ డిమాండ్   
రాష్ట్రంలో కొత్త బండ్లతో పాటు సెకండ్‌‌‌‌ హ్యాండ్‌‌‌‌ వెహికల్స్‌‌‌‌ కూడా పెద్ద ఎత్తున అమ్ముడవుతున్నయి. యూజ్డ్‌‌‌‌ కార్లకు రీజనబుల్‌‌‌‌ రేట్లు, ఫీచర్లు కూడా బాగుంటుండడంతో ఎక్కువ శాతం మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నరు. నెలకు యావరేజ్ గా 50 వేల నుంచి 60 వేల వెహికల్స్ కు సెకండ్‌‌‌‌ రిజిస్ట్రేషన్‌‌‌‌లు అవుతున్నయి. ఇటీవల ఓఎల్‌‌‌‌ఎక్స్‌‌‌‌, క్వికర్‌‌‌‌, డ్రూమ్‌‌‌‌, కార్‌‌‌‌ దేఖో, కార్‌‌‌‌ 24, కార్‌‌‌‌వాలే వెబ్‌‌‌‌సైట్లలో ఎక్కువగా యూజ్డ్‌‌‌‌ వెహికల్స్‌‌‌‌ అమ్ముడవుతున్నయి. డీలర్లు, ఏజెంట్లు, తెలిసిన వ్యక్తుల వద్ద కూడా వాహనాలు కొంటున్నరు. హైదరాబాద్‌‌‌‌తోపాటు, వరంగల్‌‌‌‌, కరీంనగర్‌‌‌‌లాంటి నగరాల్లోనూ సెకండ్ హ్యాండ్ బండ్లను సేల్ చేసే ఏజన్సీలు బాగా పెరిగాయి.