- మండుటెండను లెక్కచేయకుండా తరలివచ్చిన జనం
- ఫలించిన మంత్రి సీతక్క జన సమీకరణ వ్యూహం
- కాంగ్రెస్ ప్రచారానికి అనుకూల ప్రభావం
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన రాహుల్ గాంధీ సభ సక్సెస్ కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నిండింది. వారం రోజులుగా పార్టీ శ్రేణులు రాహుల్ సభ కోసం పెద్ద ఎత్తున చేపట్టిన ఏర్పాట్లు ఫలించాయి. ముఖ్యంగా జిల్లా ఇన్ చార్జి మంత్రి సీతక్క సభ కోసం విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. ఓవైపు లోక్ సభ అభ్యర్థి సుగుణ తరఫున జోరుగా ప్రచారం చేస్తూనే మరోవైపు రాహుల్ సభకు అవసరమైన ఏర్పాట్లపై ప్రతిరోజూ సమీక్షలు నిర్వహించారు. ఎండ తీవ్రత కారణంగా జన సమీకరణ నేతలకు సవాల్‌గా మారిన నేపథ్యంలో మండలాల వారీగా నాయకులకు బాధ్యతలు అప్పజెప్పి, అవసరమైన మేరకు వెహికల్స్ సమకూర్చడంతో మండుటెండను సైతం లెక్కచేయకుండా జనం సభకు తరలివచ్చారు.
బోథ్, ముథోల్, ఖానాపూర్, నిర్మల్ సెగ్మెంట్ల నుంచి మాత్రమే జనాన్ని తరలించాలని భావించినప్పటికీ అదిలాబాద్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల నుంచి కూడా జనం హాజరయ్యా రు. ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు, మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సైతం జనసమీకరణకు కసరత్తు చేశారు. ఊహించిన దాని కన్నా రెట్టింపు జనం హాజరుకావడంతో కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
రెట్టింపైన ‘గెలుపు’ ఆశలు
ఉదయం 11 గంటలకే సభ ప్రారంభం కావాల్సి ఉండగా రాహుల్ గాంధీ రాక ఆలస్యం కావడంతో మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రారంభమైంది. రాహుల్ వేదికపైకి సీఎం రేవంత్ రెడ్డితో కలిసి రాగానే జనం ఉత్సాహంగా చప్పట్లతో స్వాగతం పలికారు. ఇప్పటివరకు నిర్మల్ జిల్లాలో బీజేపీ, బీఆర్ఎస్కు చెందిన ఏ ఒక్క అగ్రనేత కూడా పర్యటించలేదు. కాంగ్రెస్ నుంచి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించడం, సభ సక్సెస్ కావడంతో లోక్‌సభ ఎన్నికల్లో గెలుపుపై కాంగ్రెస్ ఆశలు రెట్టింపయ్యాయి. ఈ జోష్ ఎన్నికల ప్రచారంపైనా ప్రభావం చూపనుంది.
ఆకట్టుకున్న నేతల ప్రసంగాలు
రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాలతో పాటు మంత్రి సీతక్క, అద్దంకి దయాకర్, ప్రొఫెసర్కోదండరామ్ తదితరుల ప్రసంగాలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకొని ప్రసంగించారు. ఆదివాసీల సమస్యలపైనా, రాజ్యాంగంపై మాట్లాడి జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. స్థానిక సెంటిమెంట్‌ను సైతం తెరపైకి తీసుకొచ్చారు. పీసీసీ అధ్యక్షుడిగా, సీఎంగా ఉమ్మడి ఆదిలాబాద్ తనకు బాగా కలిసి వచ్చిందన్న సీఎం.. ఈ జిల్లాను దత్తత తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది గాడిద గుడ్డు అంటూ బొమ్మ గుడ్లను చూపిస్తూ ప్రజలతో నినాదాలు చేయించారు.