IPL 2024: దేశం కంటే ఐపీఎల్‌కే ప్రాధాన్యత.. పాకిస్థాన్ సిరీస్ నుంచి తప్పుకున్న ఐర్లాండ్ పేసర్

IPL 2024: దేశం కంటే ఐపీఎల్‌కే ప్రాధాన్యత.. పాకిస్థాన్ సిరీస్ నుంచి తప్పుకున్న ఐర్లాండ్ పేసర్

ఐర్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోష్ లిటిల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ స్టార్ పేసర్ అంతర్జాతీయ మ్యాచ్ లకంటే ఐపీఎల్ ఆడడానికే ఆసక్తి చూపిస్తున్నాడు. ఇందులో భాగంగా పాకిస్థాన్ తో జరగబోయే మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ నుంచి తప్పుకున్నాడు. జూన్ 1 నుంచి టీ20 వరల్డ్ కప్ జరగనుంది. వెస్టిండీస్, అమెరికా ఈ మెగా టోర్నీకి సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్నాయి. ఈ పొట్టి సమరానికి మంగళవారం (మే 7) ఐర్లాండ్ తమ 15 మందితో కూడిన ప్రాబబుల్స్ ను ప్రకటించింది.

పాల్ స్టిర్లింగ్ ఈ జట్టుకు కెప్టెన్సీ చేయనున్నాడు. ఈ స్క్వాడ్ లో జోష్ లిటిల్ కు స్థానం దక్కింది. ప్రస్తుతం లిటిల్ ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతూ బిజీగా ఉన్నాడు. వరల్డ్ కప్ కు ముందు ఐర్లాండ్ పాకిస్థాన్, నెదర్లాండ్స్ తో టీ20 సిరీస్ ఆడనుంది. పాకిస్థాన్‌తో మూడు టీ20 మ్యాచ్ లు మే 10 నుంచి 14 వరకు జరగనుంది. ఈ సిరీస్ తర్వాత మే 19 నుంచి 24 వరకు నెదర్లాండ్, స్కాట్‌లాండ్‌లతో సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ రెండు సిరీస్ లకు లిటిల్ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.

ప్రపంచ కప్ సమయానికి లిటిల్ ఐర్లాండ్ జట్టులో చేరతాడు.   ఒకవేళ గుజరాత్ ప్లే ఆఫ్ కు అర్హత సాధించకుంటే ట్రై సిరీస్ కు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. 2023 సీజన్ లో 10 మ్యాచ్ ల్లో 7 వికెట్లు తీసి సత్తా చాటిన ఈ ఐరీష్ పేసర్.. ఈ సీజన్ లో మాత్రం ఒకటే మ్యాచ్ ఆడాడు. మే 4న రాయల్ ఛాలెంజర్స్ తో జరిగిన మ్యాచ్ లో లిటిల్ 4 ఓవర్లలో 45 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. 

ప్రపంచ కప్ కు ఐర్లాండ్ జట్టు:

పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), మార్క్ అడైర్, రాస్ అడైర్, ఆండ్రూ బల్బిర్నీ, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, గ్రాహం హ్యూమ్, జోష్ లిటిల్, బారీ మెక్‌కార్తీ, నీల్ రాక్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్.