రాఘవాచారి ఎడిటోరియల్స్ రిఫరెన్స్​ బుక్స్​!

రాఘవాచారి ఎడిటోరియల్స్ రిఫరెన్స్​ బుక్స్​!

చక్రవర్తుల రాఘవాచారి సాహితీ వేత్త, సిద్దాంత వేత్త, న్యాయ నిపుణులు ఇలా అన్ని రంగాల్లో బహుముఖ ప్రజ్జాశాలి. విశాలాంధ్ర ఎడిటర్​గా ఎందరో జర్నలిస్టులను తీర్చి దిద్దారు. తెలుగు భాషకు చక్కని ఒరవడి తెచ్చిన ఎడిటర్లలో ఆయనొకరు.సోమవారం కన్నుమూసిన రాఘవాచారికి అక్షర నివాళి.

చక్రవర్తుల రాఘవాచారి సాహితీ వేత్త, సిద్దాంత వేత్త, న్యాయ నిపుణులు ఇలా అన్ని రంగాల్లో బహుముఖ ప్రజ్జాశాలి. తమిళనాడుకు చెందిన పూర్వీకులు ఎప్పుడో జనగామ తాలుకాలో  స్థిరపడ్డారు. భూస్వామి కుటుంబానికి చెందిన రాఘవాచారి కమ్యూనిస్టుగా మారారు. తెలంగాణ నిజాం నిరంకుశ పాలన, వెట్టి చాకిరి, దొరల, దేశ్​ముఖ్​ల దౌర్జన్యాలు, నిరక్షరాస్యత కళ్లారా చూశారు. ముఖ్యంగా విస్నూర్ దేశ్​ముఖ్, రాపాక రాంచంద్రారెడ్డి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సాగిన పోరాటాలను రాఘవాచారి ప్రత్యక్షంగా చూశారు. వారి కుటుంబం వందల ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్న పేదలకు పంచిపెట్టింది. వరంగల్​లో చదువుతున్నప్పుడు ఆ ఉద్యమ నాయకులు పెండ్యాల రాఘవరావు, సర్వదేవభట్ల రామనాథం మొదలైన వారి జీవితాలను ఆదర్శంగా నిలిచాయి. ఆనాడు వరంగల్ జిల్లా ఎంతోమందికి విప్లవ కేంద్రంగా ఉండేది. అభ్యుదయ రచయితలు, ప్రజాకవులు కాళోజీ,  దాశరథి రచనలు ఆయన చదివారు. పదేళ్ల వయస్సులోనే వారి కుటుంబ సంప్రదాయ ప్రకారం వేదాలు, సంస్కృతం కంఠతా పట్టారు. ఆ తర్వాత ఉర్దూ, తెలుగు భాషలలో ప్రావీణ్యం సంపాదించారు. రాఘవాచారికి సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ భాషలతో పాటు వారి పూర్వీకులు మాట్లాడుకునే తమిళ భాష కూడా తెలుసు. అభ్యుదయ సాహిత్య పఠన,  ఉద్యమనేపథ్యం ఆయనను మార్క్సిస్టు  సిద్దాంతం వైపు ఆకర్షించింది.

1962 నాటికి కమ్యూనిస్టు పార్టీ సిద్దాంత విభేదాలతో రెండు గ్రూపులుగా ఉండేది. ముఖ్యంగా విద్యార్థి రంగంలో అవి ఎక్కువగా ఉండేవి. ఆల్  హైదరాబాద్  స్టూడెంట్ యూనియన్ మహాసభలో కొత్త కమిటీని ఎన్నుకోవాల్సి ఉంది. ఆ సందర్భంలో పువ్వాడ నాగేశ్వరరావు  ‘రాఘవాచారి అని ఓ గొప్ప మేధావి, కార్యకర్త ఉన్నారు. అతన్ని మనం అధ్యక్షుడిగా చేద్దాం’ అని ప్రతిపాదించారు. అతన్ని చూడకుండానే మేము రాఘవాచారిగారిని అధ్యక్షులుగా ఎన్నుకున్నాం. రాఘవాచారి  ఎల్ఎల్ఎం ఫస్ట్ క్లాస్​లో పాసయి, ప్రాక్టీసు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. ఇంతలో కమ్యూనిస్టు పార్టీ చీలింది. వివిధ రంగాల్లో కార్యకర్తలను అందించే బాధ్యత విద్యార్థి, యువజన సంఘాలపై పడింది. విశాలాంధ్ర విలేకరులుగా పనిచేస్తున్న వి.హన్మంతరావు, డి.నర్సింహం విశాలాంధ్ర నుండి బయటకొచ్చేశారు. హైదరాబాద్​లో ఈ పత్రికకు విలేకరి కావలసి వచ్చింది. అప్పుడు మొహిత్ సేన్, నేను రాఘవాచారిని ఒప్పించి ఈ పత్రికకు విలేకరిగా చేరమన్నాం. విశాలాంధ్ర సంపాదకులు యేటుకూరి బలరామ్మూర్తి చనిపోవడంతో ఆ బాధ్యతలు తీసుకున్నారు. తన మకాం హైదరాబాద్ నుండి విజయవాడకు మార్చారు. పాతికేళ్ల పాటు విశాలాంధ్రకు ఎడిటర్​గా పనిచేశారు. ఆయన రాసిన ఎడిటోరియల్​ ఒక్కోటి ఒక్కో రిఫరెన్స్ బుక్​లా ఉండేది. కనపర్తి నాగయ్య కుమార్తె జ్యోత్స్నను ఆయన ఆదర్శ వివాహం చేసుకున్నారు. ఆయనతో కలిసి 58 ఏళ్లు ఉద్యమ పార్టీలో  కలసి పనిచేశాం.

– కందిమల్ల ప్రతాపరెడ్డి,

సాయుధ పోరాట నాయకులు.