కొమ్మ చెక్కితే బొమ్మరా.. కొలిసి మొక్కితే అమ్మరా... అని అందెశ్రీ ఓ పాట రాశిండు. తెలంగాణ అమ్మ కోసం చెక్కిన బొమ్మలెన్నో.మా తల్లే గొప్పదంటే, మా తల్లే గొప్పదని. ఎందుకంటే ఒక్క రూపం ఉంటే ఏంగాకపోవు. పార్టీకో తల్లి... తాపకో తల్లి లెక్క తయారైంది కథ. అప్పటికెల్లి ఇప్పటిదాకా ఐదు తీర్ల రూపాలు వచ్చినయి మరి. కిరీటాలు, నగలు, నక్లెసు పెట్టుకునే తల్లి ఒగ దిక్కు... గివ్వేం లేని నలుగురు తల్లులు ఒగ దిక్కు.
శానమంది చెప్తున్నదాన్ని వట్టి సూస్తే.. తొల్సురి తెలంగాణ తల్లి ఇగ్రం పెట్టింది పాత నల్గొండ జిల్లాల రాజాపేట మండలం బేగంపేట్ అనే చిన్న పల్లెటూర్ల. యాదగిరిగుట్టకు దగ్గెర. ఉద్యమకారుడు సుదగాని వెంకటేశం తయారుజేపిస్తే... 2007 జనవరి 25 నాడు తల్లి తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు విజయశాంతి వచ్చి ఓపెన్ జేశింది. జరంత అటిటుగా ఇప్పుడు సచివాలయంల పెట్టిన తల్లి లెక్కనే ఉంది. దీనికి ముందే కేసీఆర్ టేబుల్ ఓ బొమ్మ అగువడుతుండే. ఆమె సుత పల్లెటూర్ల నడీడు మనిషి లెక్క కనవడేది.
ఎడ్మ భుజం మీద బతుకమ్మ... కుడిచేతిల మక్క, వరి కంకులు. ఇగ ఇదే ఫైనల్ ఐతది అన్కున్నరంత. మరేమైందో ఏమో అటెన్క కిరీటాలు, వడ్డాణాలు, నగలతోటున్న కొత్త రూపం తెచ్చిండ్రు. బీఆర్ఎస్ ఆఫీస్ ముంగట తెలంగాణ మీటింగుల్లో చౌరస్తాల కాడ అదే రూపంల తల్లిని పెట్టిండ్రు. ఇగ రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడైనంక 2022ల ఉంకో తెలంగాణ తల్లిని పెట్టిండు గాంధీభవన్ల.
ఆ ఇగ్రానికి సుత కిరీటాలు, నగలు లెవ్వు. బతుకమ్మ గూడ పెట్టలే. కానీ, ఈ రూపాన్ని ఎవ్వలు మెచ్చలే. ఇగిప్పుడు సచివాలయంల పెట్టింది ఐదో రూపం. ఇదెట్లున్నా తెలంగాణ తల్లి ఈమె. ముందటి నాలుగు రూపాలకు అధికారికంగా ఎసొంటి గుర్తింపు లేదు మరి. ఇగ అన్ని కలెక్టరాఫీసులు, ఎస్పీ బంగ్లాలు, సర్కార్ ఆఫీసుల ముంగట పెడుతం, సోషల్ మీడియాలఆ రూపాన్ని తక్వజేస్తే కేసులైతయని వార్నింగ్ ఇచ్చింది గౌర్మెంట్.
భారత రాష్ట్ర సమితి బాధంత... తెలంగాణ తల్లిల బతుకమ్మ గురించే. ఓ చేతిల బతుకమ్మను పెడితే బాగుండే అని శానమంది అంటాండ్రు. దునియాల ఏడ ఆడని ఆట... పువ్వులను ఎవ్వలు కొలువని పండుగాయే. జరంత అటిటుగా తెలంగాణ అంతట పేరుస్తరు... ఆడుతరు. మన పండుగ గొప్పతనం సాటింపేశినట్టు ఉంటదనేది మనోళ్ల మాట. బోనం గూడ ఇంతే మరి. మనకాడ తప్పితే ఏడ అగువడది. యాడాదికోపారి తల్లులకు కల్లు సాక వోశి బోనమెక్కిస్తే పిల్ల జెల్లను సల్లగ సూస్తదని మన నమ్మిక.
అగో బతుకమ్మ... బోనమేనా? పొలిమేరను కాపాడే పోతరాజునెందుకు పెట్టరు? అనేటోళ్లు గూడుంటరు. మేడారం సమ్మక్క, సారక్కను సుత యాజ్జయ్యవట్టిరి కొందరు. ఏది పెట్టినా ఉంకోటి లోటే. బంగారి నగలు, కిరీటాలు, వడ్డాణాలుంటే తప్పేంది? మనకు లేకున్నా మన తల్లికి ఉండొద్దా? గరీబుతనంగా ఎందుకు సూపియ్యాలె? మేం తెచ్చిన రూపమే కరెక్ట్ అని తల్లి మీద లొల్లి మోపు జేశింది బీఆర్ఎస్. మరి పదేండ్లు ఏలినోళ్లు అప్పుడే ఈ రూపం ఎందుకు ఫైనల్ జెయ్యలేదనే ప్రశ్నకు ఆ పార్టీ ఫస్ట్ జవాబు చెప్పాల్సుంటది.
‘జయ జయహే తెలంగాణ’కు పదేండ్ల తర్వాత గుర్తింపు దొర్కింది
జయ జయహే తెలంగాణ పాట పాడకుంట లేకుంట ఉద్యమ యాల్ల చిన్న మీటింగ్ సుత చాల్ గాక వోతుండే. నేను గడ్డం గీక్కుంటుంటే కొన్ని పదాలు యాదొచ్చి బాత్రూంలకెల్లి ఉర్కొచ్చి నేనే మార్శినానని గొప్పగా చెప్తుండే కేసీఆర్. అంత గొప్పపాట గావట్టే ఇస్కూల్ల ప్రార్థన గీతం లెక్క పాడుకున్నం. అదే సారు సీఎం సీట్ల కూకున్నంక ఏమైందో ఏమో రాష్ట్ర గీతం కావాల్సిన పాట పత్తాకు లేకుంటైంది. పోని... కొత్తది రాపిచ్చిండ్రంటే అదీ లేదు. పదేండ్లు రాష్ట్ర గీతం లేకుంటనే రాష్ట్ర అవతరణ పండుగలు సంబురంగా జేస్కున్న రాష్ట్రమైంది తెలంగాణ. ఈ గౌర్మెంట్ రాంగనే అదే పాటకు పబ్బతి వడితే... సర్కారోళ్లు ఏ మీటింగ్ పెట్టినా ఇయ్యాల మల్ల మార్మోగుతాంది.
వందల కోట్లు పెట్టి కొత్త సచివాలయం కట్టిన్నాడు అండ్ల అదే తల్లిని నిలవడితే ఇప్పుడు తీసి ఉంకోటి పెట్టే సాహసం జెయ్యకవోదురు. పెట్టిన ఇగ్రం తీస్తే పబ్లిక్ సుత మెచ్చరు. ముంగట అమరుల స్మారక బంగ్లా కట్టిండ్రు. దానికి దీనికి నడ్మ బొచ్చెడు జాగంది. ఆడ పెట్టినా ఐపోవు. ఖాళీగుందని కాంగ్రెస్ గౌర్మెంట్ రాజీవ్ గాంధీ బొమ్మను పెట్టిరి. 10 జిల్లాల తెలంగాణను 33 జిల్లాలు జేశి 20కి మీద కొత్త కలెక్టరేట్లు కట్టిన్నాడే ఆ తల్లిని గూడ నిలవెడితె నిండుగుండు. బీఆర్ఎస్ మీటింగుల్లోనో పార్టీ ఆఫీసుల్లోనో, ఉద్యమ టైంలో పెట్టిన చౌరస్తాల కాడ తప్పితే కొత్తది ఒక్కటి గూడ పెట్టలేదట. ఆఖర్ల అమరుల స్మారక బంగ్లా ముంగట ఒకటి పెట్టినా అధికారిక గుర్తింపైతే ఇయ్యలే దానికి.
దేవుళ్లంత కాంగ్రెస్ పార్టేనా?
హన్మాన్ నుంచి అమ్మవారు దాకా... బుద్ధుడి నుంచి గురునానక్ దాకా.. సాయిబాబా నుంచి ఏసుక్రీస్తు దాకా అందరు దేవుళ్లు కుడిచేత్తో దీవెనార్తి పెడుతరు. ఇప్పుడు తెలంగాణ తల్లి గూడ అట్లనే ఉన్నది. కాంగ్రెస్ అభయ హస్తం అనుకున్నా.. ప్రజలకు ఆపన్న హస్తం అనుకున్నా.. భరత మాతకు సుత సేమ్ అట్లనే ఉంటది.
అట్లంటే తెలంగాణ లడాయిల ఏడ ఏపీ అగువడ్డ ఎమ్మటే కర్రె రంగువూశి టీజీ అని రాస్కున్నం. బండ్లు, బస్సుల నెంబర్లు పిలేట్లు మొత్తం మార్శివడేశినం. కాని రాష్ట్రం వచ్చినంక ఏమైందో తెల్వద్.. టీజీ వోయింది టీఎస్ వచ్చింది. నడ్మిట్ల ఆర్ పెడితే పార్టీ పేరైతదనే లొల్లి నడ్శింది. ఎందుకు మారిందో ఎవ్వలూ జెప్పలే.
ఇగ జాతిపిత ఎవరు?
రాష్ట్ర గీతం, రాష్ట్ర తల్లి ఓకే ఐనయి. ఇగ మిగిలింది తెలంగాణ జాతిపిత ఎవరు? తొలిదశ పోరాటంకెల్లి మలిదశ పోరాటం కాదా ఉద్యమ జెండాను మోశిన కవులు, కళాకారులు, మేధావులు, ప్రొఫెసర్లు, విప్లవకారులు, ఉద్యమకారులు బొచ్చెడు మంది. ఎవలకు శాతనైన కాడికి ఆళ్లు తండ్లాడిండ్రు. కొందరు అందరికి తెల్సు.. తెల్వనోళ్లు అంతకు మించి. ఏడనో ఒగకాడ ఆగాలంటే... అది జయశంకర్ సార్ కాడనే. గల్లీకెల్లి ఢిల్లీదాకా కొట్లాడినోడు. జెండాలు, ఎజెండాలు సూడకుంట ఎవలు జైతెలంగాణ అంటే ఆళ్లను కల్పుకవోయినోడు.
తెలంగాణ తండ్లాటల పడి పెండ్లి చేసుకోలే. ఏ పదవులు తీసుకోలే. పాణం ఉన్నన్ని రోజులు ప్రాంతం కోసమే తిప్పలు పడి తెలంగాణ పొద్దు చూడకుండానే కాలంజేసిండు. ఆ పెద్దమనిషిని ఇట్ల బతికిచ్చుకున్నట్లయితది గదా. పదేండ్ల తర్వాతైనా తెలంగాణ కోసం రాశిన, ఆడి పాడిన కవులు, కళాకారులను గుర్తించుడు తారీఫ్ జెయ్యల్సిన ముచ్చటే. కాని 9 మందేగాదు... శానామందున్నరు. ఏ ఆత్మగౌరవం కోసమైతే కొట్లాడినమో అది ఏలువడిల సాలు సాలుకు మొలకెత్తి... తెలంగాణ తల్లికి బంతి పూల దండ కావాలె.
- రఘు, భువనగిరి