జనం గొంతుక..రవీశ్ కుమార్

జనాల జీవితాలకు అద్దం పట్టేవాడే జర్నలిస్ట్​. సామాన్యుల సమస్యలు కావొచ్చు. పేదల బాధలు కావొచ్చు. మా కష్టాలివి మహాప్రభో అని గొంతు విప్పి చెప్పుకోలేని ప్రజలకు మాట సాయం చేస్తే చాలు. వాళ్లకు కొండంత అండగా నిలిచినట్టే. ఈ పనిని నిజాయితీగా, ధైర్యంగా చేసిన ఎన్​డీటీవీ న్యూస్​ ప్రజెంటర్​ రవీశ్​ కుమార్​ను ఈ ఏడాది రామన్​ మెగసెసె అవార్డు వరించింది. ఈ రోజుల్లో మెజారిటీ రెగ్యులర్​ మీడియా వ్యవహరించాల్సిన సరైన విధానాన్ని ఆయన పనితీరు చెప్పకనే చెప్పింది.

జర్నలిజం​ సాహసం లాంటిది. శాలరీతోపాటు శాటిసిఫ్యాక్షన్​ కూడా ఇస్తుంది. పబ్లిక్​ ఎదుర్కొనే ఇబ్బందులు చాలా వరకు ప్రభుత్వాలకు తెలుసు. కానీ అవి అన్నింటినీ పరిష్కరించవు. కొన్నింటిని కావాలనే వదిలేస్తాయి. అలా పట్టింపు లేకుండా వ్యవహరించే సర్కార్​లను ప్రశ్నించే ధైర్యం, తెలివితేటలు, అవగాహన సామాన్యులకు ఉండకపోవచ్చు. ఆ లోటును ముందుగా ప్రతిపక్ష​ పార్టీల లీడర్లు భర్తీ చేయాలి. కానీ వాళ్లు రాజకీయ కారణాల వల్ల రాజీపడితే అట్లాంటి స్వార్థాలకు అతీతుడిగా ఆ పని చేయాల్సిన బాధ్యత వంద శాతం జర్నలిస్ట్​దే. ఎన్​డీటీవీ యాంకర్​ రవీశ్​ కుమార్​ సరిగ్గా అదే చేశారు.సాధారణ ప్రజలకు నిజ జీవితంలో చుక్కలు చూపిస్తున్న చిక్కులను, వెలుగులోకి రాని చీకటి వెతలను సమాజం దృష్టికి తెచ్చారు. దీనికోసం జర్నలిజాన్ని పదునైన టూల్​గా వాడుకున్నారు. చాలా కమిట్​మెంట్​తో పనిచేశారు.నీతిగా, నిజాయితీగా వ్యవహరిస్తున్నందువల్ల  ఎదురైన ఎన్నో బెదిరింపులనుసైతం లెక్కచేయకుండా ధైర్యంగా ముందడుగు వేశారు. ఈ రంగంలోకి రావాలనుకునే కొత్తవారికి విలువలు పాటిస్తూ

ఆదర్శంగా నిలిచారు. ఈ రోజుల్లో రెగ్యులర్​ మీడియాకు ఎన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా రియల్​ న్యూస్​ని టెలికాస్ట్​ చేసే విషయంలో ఇంటా బయట అనేక శక్తుల జోక్యం ఎక్కువైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమకు మేలు చేసే పాలకులకు వ్యతిరేకంగా వార్తలు రాకుండా తొక్కేస్తున్నారని, అదే సమయంలో ప్రొ–ఎస్టాబ్లిష్​మెంట్​కి పెద్ద పీట వేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. రేటింగ్​ల కోసం బ్రేకింగ్​ న్యూస్​లకు పట్టం కడుతున్నారని, కక్షసాధింపు కోసం తప్పుడు వార్తలకు ప్రచారం కల్పిస్తున్నారనే వాదనలూ ఉన్నాయి.

పీపుల్స్​ న్యూస్​ రూమ్​

‘ప్రైమ్​ టైమ్​’ పేరుతో ఎన్​డీటీవీలో ప్రసారమయ్యే న్యూస్​ ప్రోగ్రామ్​ను తెర ముందుండి సక్సెస్​ఫుల్​గా నడిపే రవీశ్​ కుమార్​.. స్క్రీన్​ వెనక ఉన్న తన న్యూస్​ రూమ్​ని ‘ద పీపుల్స్​ న్యూస్​ రూమ్​’ అంటుంటారు. దీన్నిబట్టి ఆయన జనమే తన జర్నలిజానికి ముఖ్యమని చెప్పకనే చెప్పారు. ప్రజల ప్రయోజనాల విషయంలో​ అంత ఉన్నతంగా ఆలోచించిన రవీశ్​ కుమార్​ని ‘రామన్​ మెగసెసె అవార్డు–2019’ వరించింది. ఈ పురస్కారం ‘ఆసియా నోబెల్​’గా పాపులరైంది​. బీహార్​లోని జిత్వార్​పూర్​కి చెందిన రవీశ్​కుమార్​ ఢిల్లీ యూనివర్సిటీలో హిస్టరీ అండ్​ పబ్లిక్​ అఫైర్స్​ చదివారు. 1996 నుంచి ఎన్​డీటీవీలో పనిచేస్తున్నారు. నిర్భయంగా, ఉన్నది ఉన్నట్లు మాట్లాడే వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు.తప్పు చేసిన ఉన్నతాధికారులను కూడా బాధ్యత వహించాలని నిలదీయటంలో, వ్యవస్థలోని లోటుపాట్లను పట్టిచూపటంలో రవీశ్​ కుమార్​ ఎప్పుడూ ముందుండేవారు. దీనివల్ల ఆయనకు ఎన్నోసార్లు  బెదిరింపులు వచ్చాయి. అయినా ఆయన లెక్కచేయలేదు.

అట్టడుగు జనాల సమస్యలే ఎజెండా

సమాజంపై ప్రభావం చూపగల ‘మోస్ట్​ ఇన్​ఫ్లూయెన్షియల్​ ఇండియన్స్​–2016’ లిస్టులో రవీష్​ కుమార్​ని ఇండియన్​ ఎక్స్​ ప్రెస్​ చేర్చింది. ఎన్​డి టీవీలో 20 ఏళ్లుగా రవీష్​ పనిచేస్తున్నారు. సొంతంగా నయాసడక్​ డాట్​ ఆర్డ్​ అనే బ్లాగ్​నికూడా నిర్వహిస్తున్నారు. .హిందీ న్యూస్​ రిపోర్టింగ్​లో రవీష్ మంచి పేరు గడించారు. ఆయన అట్టడుగు స్థాయి జనాల సమస్యలను తీసుకుని చాలా పకడ్బందీగా ప్రెజెంట్​ చేస్తారని జర్నలిజం సర్కిల్​లో అందరూ చెప్పుకుంటారు. తన దృష్టికి వచ్చిన సమస్యను ముందుగా స్టడీ చేసి, దాని తీవ్రతను అటు ప్రజలు, ఇటు ప్రభుత్వం గుర్తించే రీతిలో వ్యూయర్స్​కి అందిస్తారు.

డెమొక్రటిక్​ రిపోర్టింగ్​

దేశంలో ఆర్థిక సంస్కరణలు, లిబరల్​ పాలసీ ప్రవేశించిన సమయంలోనే ఆయన జర్నలిజంలో అడుగుపెట్టారు. ఈ పరిస్థితుల్లో మార్కెట్​లోని ఇతర ఛానల్స్​ నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోవటానికి రవీశ్​కుమార్​ ఎప్పుడూ తప్పుడు మార్గాలు అనుసరించలేదు. ట్రోల్స్​ జోలికి పోలేదు. సెన్సేషన్స్​ను నమ్ముకోలేదు. ప్రజల తరఫున తప్ప ఎవరి పట్లా పక్షపాతం చూపలేదు. ఫేక్​ బేస్డ్​ రిపోర్టింగ్​కి బదులు ఫ్యాక్ట్​ బేస్డ్​ రిపోర్టింగ్​కి ప్రాధాన్యత ఇచ్చారు. వార్తల ప్రస్తారంలో తెలివిగా, బ్యాలెన్స్​డ్​గా, ఇండిపెండెంట్​గా సమన్వయంతో వ్యవహరించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ‘వాయిస్​ ఆఫ్​ ద పీపుల్​’గా నిలిచారు. డెమొక్రసీని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

పుస్తక రచయిత కూడా…

రవీష్​ కుమార్ పాండే​ కేవలం టీవీ జర్నలిస్టు మాత్రమే కాదు. మంచి రచయిత. ఇండియన్​ పొలిటికల్​ డైమెన్షన్స్​ తెలిసిన వ్యాఖ్యాత. సమాజంపై అవగాహన మస్తుగా ఉన్న ప్రెజెంటర్​. ప్రస్తుతం ఎన్​డి టీవీ ఇండియాకి మేనేజింగ్​ ఎడిటర్. ఎన్​డి టీవీ న్యూస్​ నెట్​వర్క్​లో భాగమైన హిందీ న్యూస్​ చానల్​లో వందలాది ప్రోగ్రామ్​లను చాకచక్యంగా నడిపారు. ఇంకా, ప్రైమ్​ టైమ్​, హమ్​ లోగ్​, రవీష్​ కి రిపోర్ట్​ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రచయితగా ఆయన ఇష్క్​ మే షహర్​ హోనా, దిఖాతే రహియే, రవీస్​పంతి పుస్తకాలను హిందీలో, ది ఫ్రీ వాయిస్​: ఆన్​ డెమొక్రసీ, కల్చర్​ అండ్​ ది నేషన్​ని ఇంగ్లిష్​లో రాశారు.

గతంలో ఐదుగురికి..

ఇప్పుడు మరో నలుగురికి..

రామన్ ​మెగసెసె అవార్డు మన దేశంలో గతంలో ఐదుగురికి వచ్చింది. కార్టూనిస్ట్​ ఆర్కే లక్ష్మణ్​, తెలుగు జర్నలిస్ట్ పాలగుమ్మి సాయినాథ్​, ఎకనమిస్ట్​–పొలిటీషియన్​ అరుణ్​ శౌరీ, తొలి ఐపీఎస్​ కిరణ్​బేడీ, మాజీ బ్యూరోక్రాట్​ అరవింద్​ కేజ్రీవాల్ ఇంతకుముందు ఈ పురస్కారాన్ని అందుకున్నారు.ఇప్పుడు 2019కి రవీశ్​ కుమార్​తోపాటు మరో నలుగురు ఎంపికయ్యారు. వాళ్లు.. కొ స్వె విన్​ (మయన్మార్​), అంగ్​ఖానా నీలాపాయ్​జిత్​ (థాయ్​ల్యాండ్​), రేముండో పుజంటే కయబ్​యాబ్​ (ఫిలిప్పీన్స్​), కిమ్​ జాంగ్​ (సౌత్​ కొరియా).

విషం వెదజల్లని వార్తలు

వార్తల్లో తాజాదనం, విశ్లేషణలో పక్షపాతం ఉండకూడదు. జర్నలిస్టులు విషం వెదజల్లని వార్తలు అందించాలి. వ్యూయర్స్​లో ఆత్రుత పెంచేలా వార్తలకు రంగులు పులమొద్దు. సమస్యను అదే పనిగా ఊదుతూ వ్యాపించే ప్రయత్నం చేయకూడదు. నామీద, నేను నిర్వహించే ‘ప్రైమ్​ టైమ్​’ ప్రొగ్రాంమీద  రైవల్​ చానల్​వాళ్లు అనేక హోర్డింగ్​లు కట్టి మరీ దుష్ర్పచారం చేస్తుంటారు. నేను అవేమీ పట్టించుకోను.. జర్నలిజంలో ప్రతి ఒక్క సామాన్యుడు రవీష్​ని చూడాలను కుంటాడు. ఎందుకంటే, తనకు సరైన స్నేహితుడు రవీషే.కొత్తగా ఈ ఫీల్డ్​లో ప్రవేశించేవాళ్లకు నేను చెప్పేదొకటే. మీ ఉద్దేశాల్లో నిజాయితీ ఉన్నట్లయితే దేనికీ జంకవద్దు. పారామిలిటరీ ఫోర్స్​ హక్కుల కోసం ఫైట్​ చేయండి. ప్రభుత్వాన్ని నిలదీయండి. వాళ్లకు పించన్​ ఇవ్వాల్సిన అవసరంపై స్టోరీలు చేయండి. మీ డ్యూటీయే అది. అంతేతప్ప, నా హోర్డింగ్​లు పెట్టడం కాదు.

– రవీష్​ కుమార్​, ప్రైమ్​ టైమ్​ హోస్ట్​,  ఎన్​డి టీవీ హిందీ చానెల్

ఆసియాలోని అన్ని దేశాల్లో గవర్నమెంట్​ సర్వీస్​, పబ్లిక్​ సర్వీస్, జర్నలిజం–లిటరేచర్ అండ్​ క్రియేటివ్​ కమ్యూనికేషన్, ఆర్ట్స్​, పీస్​ అండ్​ ఇంటర్నేషనల్​ అండర్​స్టాండింగ్​, ఎమర్జింగ్​​ లీడర్​షిప్​ వంటి రంగాల్లో ఔట్​ స్టాండింగ్​ కంట్రిబ్యూషన్​ అందించినవారికి ఈ అవార్డును 1958 నుంచి ఏటా ప్రకటిస్తున్నారు. ఫిలిప్పీన్స్​ మాజీ ప్రెసిడెంట్​ రామన్​ మెగసెసె పేరిట ఏర్పాటుచేసిన ఫౌండేషన్​ ఈ పురస్కారాన్ని బహూకరిస్తోంది.