- నిందితులను వెంటనే అరెస్ట్‌చేయాలి
హైదరాబాద్, వెలుగు: సీనియర్ జర్నలిస్ట్ కృష్ణారెడ్డిపై జరిగిన దాడిని హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(హెచ్‌యూజే– టీడబ్ల్యూజేఎఫ్) తీవ్రంగా ఖండించింది. దుండగులను అరెస్ట్‌చేసి, కఠినంగా శిక్షంచాలని హెచ్‌యూజే ప్రెసిడెంట్ అరుణ్‌కుమార్, సెక్రెటరీ బి.జగదీశ్వర్ సోమవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. శుక్రవారం రాత్రి విధులు ముగించుకుని, ఆఫీస్నుంచి బైక్‌పై ఇంటికి వెళ్తున్న కృష్ణారెడ్డిపై, కంటోన్మెంట్ బీజేపీ లీడర్ బానుక నర్మద మల్లికార్జున్ కొడుకు సూరజ్, అతని స్నేహితుడు దాడి చేశారని మండిపడ్డారు.
వెహికల్‌కు సైడ్ ఇవ్వలేదన్న సాకుతో మద్యం మత్తులో ఉన్న దుండగులు అటాక్చేశారని చెప్పారు. శనివారం ఉదయం బాధితుడు కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుడికి రాజకీయ నేపథ్యం ఉండడంతో కేసు బుక్ చేయలేదన్నారు. నిందితుడిని కనీసం స్టేషన్‌కు పిలిపించి మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై వెంటనే అటెంప్ట్ టు మర్డర్, తాగి వాహనం నడిపినందుకు సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.