మోహన్​బాబును అరెస్ట్​ చేయాలి

మోహన్​బాబును అరెస్ట్​ చేయాలి
  • ఆయనపై హత్యాయత్నం కేసు పెట్టాలి
  • జర్నలిస్టులపై దాడి దారుణం.. మండిపడ్డ జర్నలిస్టు సంఘాలు
  • ఫిల్మ్​ చాంబర్​, రాచకొండ సీపీ ఆఫీసు ముందు నిరసన

జూబ్లీహిల్స్/ ఉప్పల్/సికింద్రాబాద్/ఓయూ, వెలుగు: జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్​బాబు దాడి చేయడాన్ని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేసి, అరెస్ట్​ చేయాలని డిమాండ్​ చేశారు. బుధవారం ఫిల్మ్​ చాంబర్​ ఎదుట జర్నలిస్టు సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. ఇందులో పాల్గొన్న సీనియర్​ జర్నలిస్టు దేవులపల్లి అమర్​ మాట్లాడుతూ.. జర్నలిస్టుల రక్షణకోసం ప్రత్యేక చట్టం తేవాలన్నారు.

దీనికోసం ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నామని తెలిపారు. జర్నలిస్టులపై మోహన్​బాబు దాడి చేయడం దారుణమన్నారు. ప్రభుత్వ విధుల్లో ఉన్న అధికారులపై ఎవరైనా దాడి చేస్తే ఏ చర్యలు తీసుకుంటారో.. జర్నలిస్టులపై  దాడులు చేసిన వారిపైనా అటువంటి చర్యలే తీసుకునేలా చట్టాలు చేయాలని డిమాండ్​ చేశారు. ‘‘ప్రతి ఇంటిలోనూ సమస్యలు వస్తాయి. అయితే సెలబ్రిటీలుగా ఉన్నవారు ఘర్షణలతో రోడ్డుపైకి వస్తే మీడియా తన పాత్ర పోషిస్తుంది.

రోడ్డుపైకి వస్తే మీడియా రోల్​ఉంటుంది”అని ఆయన  అన్నారు. మోహన్​బాబును వెంటనే అరెస్ట్​ చేసి, హత్యాయత్నం కేసు నమోదు చేయాలని మీడియా​అకాడమీ మాజీ చైర్మన్​ అల్లం నారాయణ డిమాండ్​చేశారు. దాడి జరిగి 24 గంటలు గడుస్తున్నా మోహన్​బాబు కనీసం క్షమాపణ చెప్పలేదన్నారు. మోహన్​బాబు కుటుంబాన్ని మా అసోసియేషన్​ నుంచి తొలగించాలని  జర్నలిస్టులు మారుతీ సాగర్​, సూరజ్​, ఎన్​.మల్లేష్​ బాబు,  ఫిలిం జర్నలిస్టు యూనియన్​ నేత లక్ష్మీనారాయణ డిమాండ్​ చేశారు. కాగా.. మల్కాజిగిరి ప్రెస్​క్లబ్​ ఆధ్వర్యంలో జర్నలిస్టులు రాచకొండ సీపీ ఆఫీసు ఎదుట నిరసన తెలిపారు. మోహన్​బాబుపై  కేసు నమోదు చేయాలని, దాడులు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలని డిమాండ్​చేశారు. ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద కూడా జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు.  

అయ్యప్ప స్వాముల నిరసన

ఇబ్రహీంపట్నం/జీడిమెట్ల: అయ్యప్ప మాలలో ఉన్న వ్యక్తులపై మోహన్​బాబు దాడి చేయడం ఏమిటని అయ్యప్పస్వాములు మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని అయ్యప్పస్వామి దేవాలయం వద్ద సాగర్ రహదారిపై ధర్నా  చేపట్టారు. స్వాములపై దాడి చేసిన మోహన్​బాబును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్​చేశారు.

కుత్బుల్లాపూర్​ చెందిన అయ్యప్పస్వామి భక్తులు పేట్​బషీరాబాద్​ పోలీసులకు మోహన్​బాబుపై ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ఫిర్యాదు చేసినవారిలో సూదుల సంపత్​గౌడ్​, సమ్మయ్య, చక్రధర్​, రాధా కృష్ణమూర్తి, వంశీధర్​, అనీల్, కరుణాకర్​రెడ్డి ఉన్నారు.