ఇండ్ల స్థలాల కోసం అంబేద్కర్​ విగ్రహానికి జర్నలిస్టుల వినతి

ఇండ్ల స్థలాల కోసం అంబేద్కర్​ విగ్రహానికి జర్నలిస్టుల వినతి

ఖమ్మం, వెలుగు : ఖమ్మం నియోజకవర్గ జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను అమలు చేసేలా చూడాలని రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్​ కు జర్నలిస్టులు మొరపెట్టుకున్నారు. ఆదివారం ఖమ్మంలో టీయూడబ్ల్యూజే ఐజేయూ, టీజేఎఫ్, స్థంభాద్రి హౌసింగ్​ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జర్నలిస్ట్ ఫెడరేషన్​మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఖమ్మం జిల్లాలోనే జర్నలిస్టుల హౌజింగ్ సొసైటీకి గత ప్రభుత్వం  23.3 ఎకరాల స్ధలాన్ని కేటాయించిందని చెప్పారు. 

మార్కెట్ విలువ ప్రకారం ప్రభుత్వానికి డబ్బులు చెల్లించి స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలనే అనుమతి పత్రాన్ని కూడా జారీ చేసిన తరువాత ఈ ప్రక్రియను అర్ధాంతరంగా నిలిపివేయడం బాధాకరమన్నారు. అంబేద్కర్​ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను, మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి ఇళ్ల స్థలాలు ఇప్పించేందుకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ప్లాట్లు ఇప్పించి రాష్ట్రానికి రోల్ మోడల్ గా ఖమ్మాన్ని నిలుపుతామని భట్టి హామీనివ్వగా, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించడం స్థానిక ఎమ్మెల్యేగా తన బాధ్యత అని తుమ్మల చెప్పారు. 

ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజేయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంనారాయణ, జిల్లా అధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, టీజేఎఫ్​ జిల్లా అధ్యక్షుడు ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి చిర్రా రవి, స్థంభాద్రి హౌజింగ్ సొసైటీ అధ్యక్షుడు కనకం సైదులు, కార్యదర్శి బొల్లం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.