రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ స్కీం అమలు చేయాలి

రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ స్కీం అమలు చేయాలి
  • కిషన్ రెడ్డికి జర్నలిస్టు సంఘాల విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: మీడియా రంగంలో పనిచేసి పదవీ విరమణ పొందిన జర్నలిస్టులకు జాతీయ పెన్షన్ స్కీం అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలు జర్నలిస్టు సంఘాలు విజ్ఞప్తి చేశాయి. శనివారం ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఐఎఫ్ డబ్ల్యూజే)జాతీయ కార్యదర్శి పులిపలుపుల ఆనందం, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ఉపాధ్యక్షుడు ఎల్గొయి ప్రభాకర్ కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. 

రిటైర్డ్ జర్నలిస్టులు వృద్ధాప్యంలో ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి జర్నలిస్టుల కోసం పెన్షన్ స్కీం అమలు చేస్తామని గతంలో కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి స్వర్గీయ సుష్మాస్వరాజ్ హామీ ఇచ్చారని నేతలు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. జర్నలిస్టులకు ఒకే విధమైన జాతీయ పెన్షన్ స్కీం అమలు చేయాలన్న డిమాండ్ దేశవ్యాప్తంగా జర్నలిస్టు సంఘాల నుంచి వస్తున్నదన్నారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం పరిధిలో పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల రైల్వే పాస్​లు, ప్రత్యేక రక్షణ చట్టం, జాతీయ మీడియా కమిషన్ ఏర్పాటు వంటి పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.