డీసీపీ బారిపై చర్యలు తీసుకోవాలి ..జర్నలిస్టుల ఆందోళన

హనుమకొండ, వెలుగు : వార్తల కవరేజీలో ఉన్న జర్నలిస్టులను తిట్టిన వరంగల్ సెంట్రల్​జోన్​ డీసీపీ ఎంఏ.బారిపై చర్యలు తీసుకోవాలంటూ వరంగల్ జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. ఆదివారం వరంగల్​లో మంత్రుల పర్యటన సందర్భంగా ఎస్ఎన్ఎం క్లబ్​లో జరిగిన కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు జర్నలిస్టులు వెళ్లారు. వీడియోలు తీసుకునేందుకు వెళ్లగా డీసీపీ బారి వచ్చి వారిని బూతులు తిడుతూ నెట్టేశారు. అనరాని మాటలన్నారు. దీనికి నిరసనగా సోమవారం హనుమకొండ బాలసముద్రంలోని వరంగల్​ ప్రెస్​క్లబ్ ​నుంచి సీపీ ఆఫీస్ ​వరకు ర్యాలీ తీసి కమిషనర్ ​అంబర్ ​కిశోర్ ​ఝాకు వినతిపత్రంఇచ్చారు. డీసీపీపై చర్యలు తీసుకోవడంతో పాటు జర్నలిస్టులను దూషించినందుకు సారీ చెప్పించాలని డిమాండ్​ చేశారు. సీపీ నుంచి సరైన స్పందన రాకపోవడంతో అక్కడి నుంచి నేరుగా ఇంతేజార్ గంజ్  ​పీఎస్​లో డీసీపీ బారిపై ఫిర్యాదు చేశారు. డీసీపీపై చర్యలు తీసుకునేంత వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.