ఫ్యూచర్ సిటీని విజిట్ చేసిన జర్నలిస్టులు

ఫ్యూచర్ సిటీని విజిట్ చేసిన జర్నలిస్టులు
  • డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ప్రతినిధుల ప్రత్యేక సందర్శన 
  • ఇంటి స్థలాలకు ఆసక్తి చూపిన పాత్రికేయులు 
  • సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు
  • ఆరు నెలల్లో ఇవ్వాలని విన్నపం

హైదరాబాద్: డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ (DJHS) సభ్యులు వందలాదిమంది ఆదివారం(నవంబర్ 10) ఫ్యూచర్ సిటీ (ఫోర్త్ సిటీ)ని ప్రత్యేకంగా సందర్శించారు. ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన క్రమంలో డీజేహెచ్ఎస్ సభ్యులు అక్కడ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఫోర్త్ సిటీలో ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అందుకోసం చొరవ చూపిన సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఫోర్త్ సిటీని సందర్శించిన జర్నలిస్టులు అక్కడి వాతావరణం పట్ల ఆసక్తి చూపించారు. 

సమావేశంలో డీజేహెచ్ఎస్  అధ్యక్షులు బొల్లోజు రవి, ఉపాధ్యక్షులు మరిపాల శ్రీనివాస్, కోశాధికారి చిలుకూరి అయ్యప్ప, డైరెక్టర్లు దండ రామకృష్ణ, డేగ కుమార్, నాగరాజు మాట్లాడారు. ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వీలైనంత త్వరగా ఇవ్వాలని కోరారు. సీఎం నిర్ణయం తమకు ఆమోదయోగ్యమన్నారు. ఆరు నెలల్లోగా ఇచ్చేలా కసరత్తు చేయాలని సీఎంకు డీజేహెచ్ఎస్  అధ్యక్షులు బొల్లోజు రవి సూచించారు. హైదరాబాద్ కు ఇది నాలుగో సిటీగా అభివృద్ధి అవుతుందని ఆయన తెలిపారు.

ఇప్పటికే ఈ ప్రాంతంలో అమెజాన్ డేటా సెంటర్ ఉంది.. స్కిల్ యూనివర్సిటీ, వరల్డ్ ట్రేడ్ సెంటర్ రాబోతున్నాయన్నారు వక్తలు. నెట్ జీరో వల్ల కాలుష్య రహిత ప్రాంతంగా ఉంటుందన్నారు.హైటెక్ సిటీ, గచ్చిబౌలి తదితర ప్రాంతాలకు ధీటుగా ఇది అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తుందన్నారు. ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు మార్గం కూడా రానున్నందున ప్రయోజనం ఉంటుందన్నారు. 

ఇన్ని వసతులు ఉండటంతో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అక్కడ ఇస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని స్పష్టం చేశారు. ఇళ్ల స్థలాల విషయంలో జర్నలిస్టులంతా ఐకమత్యంతో ఉండాలని కోరారు. ప్రభుత్వం సానుకూలంగా ఉన్నందున దాన్ని సాధించుకునేందుకు కృషి చేయాలని పిలుపు నిచ్చారు.