
కార్ల తయారీ కంపెనీ అనగానే గుర్తొచ్చే పేర్లలో ‘హ్యుండాయ్’ కచ్చితంగా ఉంటుంది. సుమారు 200 దేశాల్లో బ్రాంచ్‌లు.. లక్షాఇరవై వేలకు పైగా సిబ్బంది.. ఏటా సుమారు కోటి వాహనాల అమ్మకాలు... ఇంకా మరెన్నో ఘనతలు ఈ కంపెనీ సొంతం. అయితే, ఇవన్నీ అంత సులభంగా రాలేదు. ఈ బ్రాండ్ పుట్టుక వెనక ఓ వ్యక్తి అసమాన కృషి ఉంది.. కష్టాల కడగళ్లను అధిగమించిన తీరు ఉంది... పట్టువదలని పోరాటం ఉంది.. ఆయనే షంగ్ జు–యంగ్.
అప్పట్లో ఉత్తర, దక్షిణ కొరియా కలసి కొరియా పేరుతో ఒకే దేశంగా ఉండేవి. ఇది జపాన్ పాలనలో ఉండేది. ఆ టైంలో1915 నవంబర్ 25న టోంగ్చాన్ (ప్రస్తుతం ఉత్తర కొరియాలో ఉంది) గ్రామంలో పుట్టాడు షంగ్ జు–యంగ్. పేదరికం తాండవించే కుటుంబంలో పుట్టిన ఏడుగురు పిల్లల్లో పెద్ద కొడుకు. చిన్నప్పటి నుంచే తండ్రికి ఇంటి పని, పొలం పనుల్లో సాయంగా ఉండేవాడు. కొండల నుంచి కట్టెలు తెచ్చి, దగ్గరలో ఉన్న టౌనుకు తీసుకెళ్లి అమ్మేవాడు. ఖాళీ సమయాల్లో గ్రామానికి ఆనుకొని ఉన్న బౌద్ధారామంలోని స్కూలుకు వెళ్లేవాడు. అక్కడే ఎలాగోలా ఎలిమెంటరీ చదువు పూర్తి చేశాడు.
ఇంటి నుంచి పారిపోయి..
కుటుంబాన్ని పేదరికం నుంచి గట్టెక్కించాలనే కోరిక చిన్నప్పటి నుంచే షంగ్ మనసులో బలంగా నాటుకుపోయింది. కట్టెలు అమ్మడానికి ఎక్కువసార్లు టౌనుకు వెళుతుండేవాడు. అక్కడి పరిస్థితులు చూసి, పేపర్లు చదివి వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం ఇంటి నుంచి పారిపోవాలని డిసైడ్ అయ్యాడు. అదను చూసి, స్నేహితుడితో కలసి దగ్గరలోని కోవోన్ టౌనుకు బయల్దేరాడు. కొండలు, లోయలు, క్రూర జంతువులు ఉండే మార్గంలో సుమారు 15 కిలోమీటర్లు నడిచి టౌనుకు చేరుకున్నారు వాళ్ళిద్దరు. అప్పటికి చుంగ్ వయసు 16 ఏండ్లు. అక్కడ ఓ కాంట్రాక్టర్ దగ్గర పనికి కుదిరారు. ఆ కాంట్రాక్టరు ఎక్కువ పని చేయించుకొని, తక్కువ డబ్బు ఇచ్చేవాడు. అది తన పేదరికాన్ని పోగొట్టుకునేందుకు ఏ మాత్రం సరిపోదని షంగ్కు అర్థమైంది. అయితే, ఇక్కడ ఉండగానే బిల్డింగులు, రోడ్లు, బ్రిడ్జిలు, కెనాల్స్ పనులు చేస్తూ వాటి డిజైన్ల తయారీ, నిర్మాణం, మెయింటెనెన్స్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. రెండు నెలలు గడిచాక షంగ్ జాడ కనిపెట్టిన అతని తండ్రి తిరిగి ఊరికి తీసుకెళ్లాడు.
ఆవులమ్మి సియోల్ చేరి..
ఇంటికి వెళ్లిన కొన్ని రోజులకే ఇద్దరు ఫ్రెండ్స్‌తో కలసి మళ్ళీ పారిపోయాడు షంగ్. అయితే, ఒక స్నేహితుడు మధ్యలోనే తనవాళ్ళకు దొరికిపోయాడు. దాంతో మరో మిత్రుడితో కలసి సియోల్(ప్రస్తుతం దక్షిణ కొరియా రాజధాని)కు వెళ్లాడు. ఉద్యోగం ఇప్పిస్తానన్న ఓ మోసగాడి చేతికి చిక్కి డబ్బు మొత్తం పోగొట్టుకున్నాడు. అప్పుడు తాతగారి ఊరు అసన్ వెళ్ళాడు. అక్కడికి తండ్రి వచ్చి, సొంతూరుకు బలవంతంగా తీసుకెళ్లాడు. ఈసారి దాదాపు ఏడాది పాటు పొలం పనుల్లో తండ్రికి సాయం చేశాడు. ఆ తర్వాత ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఆవులు అమ్మి ఆ సొమ్ముతో మళ్లీ సియోల్ వెళ్ళాడు. ఓ స్కూల్లో అకౌంటెంట్‌గా చేరాడు. అది కూడా మూన్నాళ్ల ముచ్చటే అయింది. తండ్రికి మరోసారి దొరికిపోవడంతో మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చింది.
బియ్యం దుకాణంలో..
మూడుసార్లు పారిపోయి.. మళ్లీ దొరికిపోయి ఇంటికి చేరినా షంగ్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా మరోసారి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. 1933లో ఓ అర్ధరాత్రి సియోల్‌కు చేరాడు. ఏడాది పాటు ఇంచియోన్ హార్బర్, ఓ స్కూల్, సిరప్ ఫ్యాక్టరీల్లో పనిచేశాడు. ఆ తరువాతి ఏడాది బోకెంగ్ రైస్ స్టోర్‌లో డెలీవరీ మ్యాన్‌గా చేరాడు. ఇక్కడ బాగా పనిచేస్తూ కస్టమర్ల మెప్పు పొందాడు. దీంతో ఆరు నెలలకే స్టోర్ అకౌంటెంట్‌గా ప్రమోషన్ వచ్చింది. తీవ్ర అనారోగ్యం వల్ల దుకాణం అమ్మేయాలని1937లో యజమాని అనుకున్నాడు. అప్పటివరకూ దాచుకున్న సొమ్ముతో ఆ షాపును షంగ్ కొన్నాడు. క్యుంగిల్ రైస్ స్టోర్‌గా పేరు మార్చాడు. తన తెలివితేటలతో మంచి లాభాలు పొందాడు. అయితే, 1939లో జపాన్ ప్రభుత్వం రైస్ స్టోర్లపై పన్ను విధించడంతో నష్టాలు వచ్చాయి. అలా షాపును మూసివేసి తిరిగి అసన్‌కు చేరుకున్నాడు. అక్కడ ఏడాది పాటు ఉన్నాడు. 1940లో కొత్త వ్యాపారం వేటలో మళ్ళీ సియోల్‌కు వెళ్ళాడు.
ఆటో మొబైల్ రంగంలోకి...
కేవలం కొన్ని రకాల వ్యాపారాలపై మాత్రమే జపాన్ ప్రభుత్వం ఆంక్షలు పెడుతోందన్న విషయం షంగ్ గుర్తించాడు. ఆంక్షల బారిన పడని వ్యాపారం కోసం వెతికినప్పుడు ఆటోమొబైల్ రిపేర్ బిజినెస్ బెటర్ అనిపించింది. వెంటనే తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బు, బ్యాంకు లోనుతో ఓ సర్వీస్ గ్యారేజ్ కొన్నాడు. 20 మంది మెకానిక్‌లను తీసుకున్నాడు. వ్యాపారం మెల్లగా డెవలప్ అయింది. లాభాలు బాగా వచ్చాయి. పనివాళ్ళ సంఖ్య మూడేండ్లలోనే 70కి చేరింది. అయితే, 1943లో అతని గ్యారేజ్‌ను జపాన్ ప్రభుత్వం బలవంతంగా ఓ స్టీల్ ప్లాంట్‌లోకి కలిపేసింది. మళ్లీ సొంతూరికి వెళ్లాల్సి వచ్చింది. అయితే, ఈసారి షంగ్ ఒట్టి చేతులతో కాకుండా 50వేల వన్స్(కొరియా కరెన్సీ)తో వెళ్లాడు.
హ్యుండాయ్ పుట్టుక
పదేండ్లపాటు సాగిన యుద్ధం కారణంగా 1945 ఆగస్ట్ 15న జపాన్ నుంచి కొరియాకు ఇండిపెండెన్స్ వచ్చింది. వెంటనే ఉత్తర, దక్షిణ కొరియాలుగా విడిపోయింది. యుద్ధంలో దేశం తీవ్రంగా దెబ్బతినడంతో మళ్ళీ అన్ని రంగాలు పుంజుకోవడం కోసం అప్పటి దక్షిణ కొరియా ప్రభుత్వం సిద్ధమైంది. వెంటనే నలుమూలలా ఉన్న బిజినెస్‌మెన్‌కు ఆహ్వానాలు పంపింది. వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు కల్పించింది. ఈ అవకాశాన్ని షంగ్ అందిపుచ్చుకున్నాడు. మళ్ళీ సియోల్ చేరాడు. 1947లో హ్యుండాయ్ ఇంజినీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ మొదలుపెట్టాడు. ప్రభుత్వం నుంచి హార్బర్లు, రోడ్లు, మిలటరీ క్యాంపస్‌లు నిర్మించే కాంట్రాక్టులను హ్యుండాయ్ తెచ్చుకోగలిగింది. దక్షిణ కొరియా ఆర్థికాభివృద్ధికి తోడ్పడింది. అయితే, 1950లో దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా దాడికి దిగింది. ఆ యుద్ధంలో ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు షంగ్. యుద్ధం ముగిశాక మళ్ళీ తన బిజినెస్ పనులు మొదలుపెట్టాడు.
భారీ ప్రాజెక్టులు
దక్షిణ కొరియాలో ఎన్నో భారీ ప్రాజెక్టులు హ్యుండాయ్ సివిల్ ఇండస్ట్రీస్ నిర్మించినవే. ముఖ్యంగా సోయాంగ్ డ్యామ్(1967), గ్వాంగ్బూ ఎక్సెప్రెస్ వే(1970), ఉస్లాన్ షిప్‌యార్డ్(ప్రపంచంలోనే మూడో అతిపెద్దది), కొరి న్యూక్లియర్ పవర్ ప్లాంట్.. హ్యుండాయ్ నిర్మించినవే. మరోవైపు 1965లోనే తన కార్యకలాపాలను విదేశాల్లోనూ విస్తరించడం మొదలుపెట్టింది. అరబ్ షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ యార్డ్ (బహ్రెయిన్–1975), జుబైల్ ఇండస్ట్రియల్ హార్బర్(సౌదీ అరేబియా–1976) హ్యుండాయ్ నిర్మించినవే. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్‌తోపాటు షిప్పింగ్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్స్, డిఫెన్స్, పెట్రోలియం రిఫైనరీ, డిపార్ట్మెంట్ స్టోర్ చైన్, చిప్ మాన్యుఫాక్చరింగ్ తదితర రంగాల్లోకి బిజినెస్ విస్తరించి ఒక మహాసామ్రాజ్యంగా ఎదిగింది. 2000 సంవత్సరంలో హ్యుండాయ్ గ్రూపులన్నీ తన వారసులు, కుటుంబ సభ్యులకు పంచేశాడు షంగ్. 85 ఏండ్ల వయసులో 2001 మార్చి 21న షంగ్ మరణించాడు.
జాంబీ కారు కూడా..
- హ్యుండాయ్ అంటే కొరియన్ భాషలో మోడర్నిటీ అని అర్థం. హ్యుండాయ్ లోగో ఇంగ్లీష్ ‘‘హెచ్” ఇద్దరు వ్యక్తులు షేక్‌హ్యాండ్ ఇచ్చుకుంటున్నట్లు ఉంటుంది. ఇందులో ఒకరు కస్టమర్, మరొకరు కంపెనీ ప్రతినిధి. కస్టమర్ సంతృప్తిని, నమ్మకాన్ని పొందుతున్నట్లు అర్థం వచ్చేలా లోగోను డిజైన్ చేశారు.
- హ్యుండాయ్ మొదట వెహికల్స్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ కాదు. 1967లో మొదటిసారి వాహనాల తయారీలోకి దిగింది.
- ఉల్సాన్‌లోని హ్యుండాయ్ మెయిన్ ఫ్యాక్టరీ ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమోటివ్ ఫ్యాక్టరీల్లో ఒకటి. ఇక్కడ ప్రతి ఏటా సుమారు 16లక్షల వాహనాలు తయారవుతాయి. వీటిలో సుమారు 12 వరకు మోడల్స్ ఉంటాయి. ఇక్కడ 34వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు.
- పొల్యూషన్‌కు కారణమవుతోందని చెప్పి 1986 వరకు హ్యుండాయ్ కంపెనీ కార్లకు అమెరికాలో అనుమతి లభించలేదు.
- కొరియాకే చెందిన కార్ల తయారీ కంపెనీ ‘కియా మోటార్స్’లో ఎక్కువ వాటాను 1998లో హ్యుండాయ్ తీసుకుంది.
- ప్రపంచంలోని చాలా స్పోర్ట్స్ ఈవెంట్స్‌కు హ్యుండాయ్ స్పాన్సరర్. వీటిలో ఫిఫా వరల్డ్ కప్, యూరోపియన్ ఫుట్‌బాల్ కప్(యూరో కప్), నేషనల్ ఫుట్‌బాల్ లీగ్(ఎన్ఎఫ్ఎల్), ది కొరియా ఫుట్‌బాల్ అసోసియేషన్, ది పీజీఏ టూర్, వరల్డ్ ఆర్చరీ ఉన్నాయి.
- యూరప్‌లో దాదాపు 90శాతం మంది హ్యుండాయ్ వెహికల్స్‌ను ఇష్టపడతారని ఓ సర్వే చెప్తోంది.
- జాంబీస్ నుంచి రక్షణకు ఉపయోగపడే కార్‌ను కూడా హ్యుండాయ్ తయారుచేసింది. టీవీలో వచ్చే పాపులర్ జాంబీ సీరియల్ “ది వాకింగ్ డెడ్” మేకర్స్ సాయం తీసుకొంది. నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చే ‘‘డేర్‌డెవిల్’’ సీరియల్లోని కింగ్‌పిన్ క్యారెక్టర్ వాడే కారు ఇదే.
ఆటోమొబైల్సే కాదు..
హ్యుండాయ్ మోటార్ కంపెనీ, కియా మోటార్స్, హ్యుండాయ్ మొబిస్, హ్యుండాయ్ కెఫికో, హ్యుండాయ్ ఎంసీట్, హ్యుండాయ్ వియా, హ్యుండాయ్ ట్రాన్సిస్, హ్యుండాయ్ పార్టెక్స్, హ్యుండాయ్ ఐహెచ్ఎల్, హ్యుండాయ్ స్టీల్, హ్యుండాయ్ బీఎన్‌జీ స్టీల్, హ్యుండాయ్ స్పెషల్ స్టీల్, హ్యుండాయ్ ఇంజినీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్, హ్యుండాయ్ ఆర్కిటెక్చర్స్ అండ్ ఇంజినీరింగ్ అసోసియేట్స్, హ్యుండాయ్ ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్, హ్యుండాయ్ ఇంజినీరింగ్ అండ్ ఇండస్ట్రీస్ కంపెనీ లిమిటెడ్, హ్యుండాయ్ సిటీ కార్పొరేషన్, హ్యుండాయ్ గ్లొవిస్, హ్యుండాయ్ రొటెమ్, హ్యుండాయ్ కార్డ్, హ్యుండాయ్ క్యాపిటల్, హ్యుండాయ్ కమర్షియల్, హ్యుండాయ్ మోటార్ సెక్యూరిటీస్, ఇన్నోసియన్ వరల్డ్‌వైడ్, హైవిచి హోటల్ అండ్ రిసార్ట్, హ్యుండాయ్ ఆటో ఎవర్, హ్యుండాయ్ ఎన్జీవీ, జీఐటీ, జి–మెరైన్ సర్వీసెస్, హ్యుండాయ్ ఫామ్ ల్యాండ్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ.