
JP Associates Stock: నేడు ఒకపక్క దేశీయ స్టాక్ మార్కెట్లు చారిత్రాత్మక పతనాలకు నాంది పలకగా మరో పక్క ఒక పెన్నీ స్టాక్స్ అప్పర్ సర్క్యూట్లను తాకటం ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో రూ.3 విలువ కలిగిన చిన్న కంపెనీ షేర్లు చిచ్చరపిడుగులా పేలుతూ 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకటమే. ప్రతికూల మార్కెట్లో పెన్నీ స్టాక్ పెర్ఫామెన్స్ చూసి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది జేపీ అసోసియేట్స్ కంపెనీ షేర్ల గురించే. వాస్తవానికి ఇంట్రాడేలో కంపెనీ షేర్లు ఒక్కోటి రూ.3.48 స్థాయికి పెరిగాయి. దీనివెనుక అసలు కారణాన్ని పరిశీలిస్తే.. దేశంలోని అతిపెద్ద వ్యాపార దిగ్గజాలు కంపెనీని కొనుగోలు చేసేందుకు బిడ్ చేయటమే. ఈ క్రమంలో అదానీ గ్రూప్, వేదాంత, పతంజలి ఆయుర్వేద సహా 26 సంస్థలు అప్పుల ఊబిలో కూరుకుపోయిన జైప్రకాష్ అసోసియేట్స్ కంపెనీని స్వాధీనం చేసుకోవటానికి ప్రయత్నిస్తుండటమే.
Also Read : రూ.16 లక్షల కోట్లు ఆవిరి.. టాటాలకు లక్ష కోట్లు లాస్..
ఈ క్రమంలో జేపీ అసోసియేట్స్ కంపెనీని కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్న ఇతర సంస్థల జాబితాను గమనిస్తే.. అహ్మదాబాద్‌కు చెందిన టొరెంట్ గ్రూప్, జిందాల్ పవర్, దాల్మియా సిమెంట్, జీఆర్ఎం బిజినెస్, ఒబెరాయ్ రియాల్టీ, కోటక్ ఆల్టర్నేట్ అసెట్ మేనేజర్స్ లిమిటెడ్ కూడా ఉన్నాయని వెల్లడైంది. జేపీ అసోసియేట్స్ ఈ వివరాలను దేశీయ స్టాక్ ఎక్స్ఛేంజీలకు అందించటంతో నేడు ఈ పెన్నీ స్టాక్ రాకెట్ వేగంతో పెరుగుదలను చూస్తోంది.
జేపీ అసోసియేట్స్ ప్రధానంగా రియల్ ఎస్టేట్, సిమెంట్ తయారీ, ఇంజనీరింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్, హాస్పిటాలిటీ రంగాల్లో వ్యాపారం చేస్తోంది. కానీ ఆర్థికంగా కుదేలైన కంపెనీ దివాలా ప్రక్రియను చూస్తోంది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అలహాబాద్ బెంచ్ జూన్ 3, 2024 ఇచ్చిన ఉత్తర్వుల ద్వారా దివాలా ప్రక్రియ ప్రారంభించబడింది. కంపెనీకి ప్రస్తుతం చెల్లించాల్సిన మెుత్తం రుణాలు రూ.57వేల 185 కోట్లు ఉండగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణదాల కన్సార్టియాన్ని నిర్వహిస్తోంది.
కంపెనీ ఆస్తులు..
జైప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ గ్రేటర్ నోయిడాలో జేపీ గ్రీన్స్, నోయిడాలోని జేపీ గ్రీన్స్ విష్‌టౌన్‌లో భాగం, జేపీ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ వంటి ప్రధాన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను కలిగి ఉంది. దీనికి తోడు దిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో మూడు వాణిజ్య/పారిశ్రామిక కార్యాలయ స్థలాలు కూడా ఉన్నాయి. కంపెనీకి యూపీలో నాలుగు సిమెంట్ ప్లాంట్లు ఉన్నప్పటికీ ప్రస్తుతం అవి పనిచేయటం లేదు. అలాగే ఎంపీలో జేపీ అసోసియేట్స్ కు లీజుకు తీసుకున్న సున్నపురాయి గనులు ఉన్నాయి. కంపెనీకి జైప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్, యమునా ఎక్స్‌ప్రెస్‌వే టోలింగ్ లిమిటెడ్, జేపీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ లిమిటెడ్ వంటి అనుబంధ సంస్థల్లో కూడా పెట్టుబడులు ఉన్నాయి.
NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.