అంతర్జాతీయ క్రికెట్ లో కొత్త సంఘటన ఒకటి ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సౌతాఫ్రికా బ్యాటింగ్ కోచ్ జెపి డుమిని అంతర్జాతీయ క్రికెట్ లో తన ఫీల్డింగ్ తో మెప్పించాడు. ఒక కోచ్ ఫీల్డింగ్ చేయడం ఆశ్చర్యంగా అనిపించినా.. దానికి కారణం లేకపోలేదు. ఐర్లాండ్ తో మూడో వన్డే మ్యాచ్ సందర్భంగా దక్షిణాఫ్రికా ఫీల్డర్లు అందుబాటులో లేరు. అబుదాబిలో విపరీతమైన అలసట కారణంగా కొంతమంది ఫీల్డర్లు మైదానం వీడాల్సి వచ్చింది.
ఐర్లాండ్ ఇన్నింగ్స్ చివరి ఓవర్ కు ముందు దక్షిణాఫ్రికాలో ఒక ఆటగాడు తక్కువయ్యాడు. దీంతో బ్యాటింగ్ కోచ్ జెపి డుమిని సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా మైదానంలో అడుగుపెట్టాడు. ఇదంతా ఒక ఎత్తయితే డుమిని ఫీల్డింగ్ లో అదరగొట్టాడు. షార్ట్ థర్డ్ మ్యాన్‌లో అతడు డైవ్ చేసిన ఫీల్డింగ్ కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. డుమిని ఫీల్డింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐదేళ్ల తర్వాత అతని ఫీల్డింగ్ విన్యాసాలు ఔరా అనిపించేలా ఉన్నాయి. 2008 నుంచి 2018 వరకు దక్షిణాఫ్రికా జట్టు తరపున ఆడాడు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 284 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ స్టిర్లింగ్ 88 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. అతను తొలి వికెట్ కు బాల్ బిర్నీ (45) తో కలిసి 101 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. మిడిల్ ఆర్డర్ లో హ్యారీ టెక్టార్ 60 పరుగులు చేసి రాణించాడు. చివర్లో దక్షిణాఫ్రికా బౌలర్లు విజృంభించడంతో లోయర్ ఆర్డర్ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. లిజార్డ్ విలియమ్స్ 4 వికెట్లు పడగొట్టాడు. బార్ట్ మాన్,పెహ్లుక్వాయో తలో రెండు వికెట్లు తీశారు.
285 పరుగుల లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 215 పరుగులకు ఆలౌట్టయింది. ఐర్లాండ్ బౌలర్లు సమిష్టిగా రాణించడంతో సఫారీలు ఏ దశలోనూ లక్ష్యం దిశగా వెళ్ళలేదు. 91 పరుగులు చేసి జేసన్ స్మిత్ ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ మ్యాచ్ ఓడిపోయినా దక్షిణాఫ్రికా 2-1 తేడాతో సిరీస్ గెలుచుకుంది. పాల్ స్టిర్లింగ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. లిజార్డ్ విలియమ్స్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి.
JP Duminy walks in for fielding!🥳https://t.co/Ew7Pgr5joq
— SportsCafe (@IndiaSportscafe) October 7, 2024