మాంద్యం ముంగిట అమెరికా.. జేపీ మోర్గన్ సంచలన రిపోర్ట్, పెద్దన్న పతనం స్టార్ట్..!

మాంద్యం ముంగిట అమెరికా.. జేపీ మోర్గన్ సంచలన రిపోర్ట్, పెద్దన్న పతనం స్టార్ట్..!

US Recession: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న పనులు ప్రపంచంతో పాటు యూఎస్ ప్రజలు, అక్కడి ఆర్థిక వ్యవస్థకు సైతం పెద్ద నష్టాన్ని కలిగించనున్నాయని ఆర్థిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ట్రంప్ టారిఫ్స్ అమెరికా ఆర్థిక వ్యవస్థను సమస్యల సుడిగుండంలోకి నెట్టేస్తోందని తాజాగా దిగ్గజ బ్యాంకర్ జేపీ మోర్గన్ వార్నింగ్ బెల్ మోగించింది. 2025 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ కుచించికుంటుందని పెద్ద బాంబు పేల్చింది. దిగజారనున్న ఆమెరికా ఆర్థిక పరిస్థితులపై ముందుగా రిపోర్ట్ ఇచ్చిన తొలి వాల్‌స్ట్రీట్ బ్యాంకర్ జేపీ మోర్గన్.

టారిఫ్స్ ప్రభావంతో జీడీపీ వృద్ధి -0.3 శాతంగా ఉంటుందని పేర్కొంది. ఇది గతంలో 1.3 శాతం ఉందని నిపుణులు చెబుతున్నారు. 2025 సంవత్సరం రెండవ అర్థ భాగంలో ఆర్థిక మాంద్యం రావొచ్చని జేపీ మోర్గన్ నిపుణులు మైఖేల్ ఫెరోలీ వెల్లడించారు. ఇప్పటికే ప్రపంచ దేశాలపై కనీసం 10 శాతం బేస్ టారిఫ్స్ ప్రకటించటంతో మెుదలైన ట్రంప్ దూకుడు అమెరికా కీలక వ్యాపార భాగస్వాములైన మెక్సికో, కెనడాలపై కూడా కనికరం చూపకుండా అత్యధికంగా సుంకాలను పెంచారు. దీంతో అమెరికా స్టాక్ మార్కెట్లు మార్చి 2020 కరోనా కాలం తర్వాత ఒక్కరోజులో భారీగా పతనాన్ని నమోదు చేశాయి. బెంచ్ మార్క్ సూచీలు ఎస్ అండ్ పి 500 దాదాపు 6 శాతం పడిపోగా.. నాస్‌డాక్ 5.8 శాతం క్షీణతను నమోదు చేసింది. ఈ రెండు రోజుల ట్రేడింగ్ సమయంలో అమెరికా మార్కెట్లలో పెట్టుబడిదారుల సంపద 5.4 ట్రిలియన్ డాలర్ల మేర ఆవిరైపోయింది. 

Also Read : ఈ వీకెండ్‌లో బంగారమే కాదు

అయితే ఈ భారీ సుంకాలు ముందుగా అమెరికాలో నివసిస్తున్న ప్రజల ఆర్థిక జీవితాన్ని అతలాకుతలం చేస్తాయని జేపీ మోర్గన్ పేర్కొంది. ఈ చర్యలతో ఆర్థిక పనితీరు మందగించి ఉద్యోగాల కల్పన, కొత్త నియామకాలు తగ్గుముఖం పట్టి దీర్ఘకాలంలో నిరుద్యోగిత రేటును అమెరికాలో 5.3 శాతానికి పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. మార్చిలో నిరుద్యోగిత 4.2 శాతం కంటే ఇది అధికం. కరోనా తర్వాత ఏర్పడిన ద్రవ్యోల్బణం కంటే కూడా ప్రస్తుత టారిఫ్స్ వల్ల పెరిగే రేట్లు అమెరికన్ల జేబులపై భారాన్ని పెంచున్నట్లు ఫెరోలీ పేర్కొన్నారు. పెరిగిన ఖర్చులతో ప్రజల వద్ద సేవింగ్స్ తగ్గే అవకాశం ఉందని ఆయన అన్నారు. 

ఈ పరిస్థితులు మెుత్తానికి అమెరికా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణాన్ని ప్రేరేపించటంతో పాటు రానున్న కాలంలో యూఎస్ స్టాగ్ఫ్లేషన్ రిస్క్ లోకి జారుకోవచ్చని జేపీ మోర్గన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందులో పెరుగుతున్న ధరలతో పాటు మందగిస్తు్న్న ఆర్థిక వ్యవస్థ కలయిక ప్రమాదకరమైన పరిస్థితులతో ఆర్థిక మాంద్యాన్ని ప్రేరేపించొచ్చని వారు చెబుతున్నారు. జేపీ మోర్గన్ తో పాటు ఇతర అమెరికా దిగ్గజ బ్యాంకర్లు సిటి గ్రూప్, బార్క్లేస్, యూబీఎస్ కూడా ఆర్థిక వ్యవస్థలో వృద్ధి మందగమనాన్ని అంచనా వేస్తున్నారు. దీంతో ట్రంప్ టారిఫ్స్ అమెరికా వృద్ధికి కాకుండా తిరోగమనానికి దారితీయవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.