కేసీఆర్​కు కాళేశ్వరం ఏటీఎం  .. పేదల భూములను లాక్కున్నరంటూ ఫైర్  

నిజామాబాద్/సంగారెడ్డి టౌన్, వెలుగు:  కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ఏటీఎంగా మార్చుకున్నారని, అవినీతికి పాల్పడేందుకే ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.38 వేల కోట్ల నుంచి రూ.1.20 లక్షల కోట్లకు పెంచారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా  ఆరోపించారు. డబ్బు కావాలనుకున్నప్పుడల్లా కాళేశ్వరం ఖర్చు పెంచారని విమర్శించారు. గురువారం నిజామాబాద్, సంగారెడ్డిలో జరిగిన సకల జనుల విజయ సంకల్ప సభల్లో నడ్డా మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కేసీఆర్, ​ఆయన కుటుంబసభ్యుల అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి కఠినంగా శిక్షిస్తామన్నారు. 

రికార్డులను మార్చి, అక్రమాలకు పాల్పడుతూ సొంత ప్రయోజనాలను నెరవేర్చుకుంటున్నందుకే ధరణి పోర్టల్ ను ఆకాశానికి ఎత్తుతున్నారని అన్నారు. హైదరాబాద్​లోని మియాపూర్​లో 692 ఎకరాల గవర్నమెంట్​భూమికి కొత్త యజమానులు ఎలా పుట్టుకొచ్చారని నడ్డా ప్రశ్నించారు. ధరణి ద్వారా పేదల భూములను బలవంతంగా లాగేసుకున్నారని, బీజేపీ అధికారంలోకి వస్తే వాటిని తిరిగి లబ్ధిదారులకు అప్పగిస్తామన్నారు.

ప్రధాని మోదీ 5జీ టెక్నాలజీతో దేశాన్ని పరుగులు పెట్టిస్తున్నారని.. కేసీఆర్ 5జీ మాత్రం వేరేలా ఉందన్నారు. కేసీఆర్ పాలనలో గప్లాబాజీ, గూస్ కోర్, గొటాలా, గూండారాజ్, గరీబీ (5జీ) పెరిగిందన్నారు. దళితబంధులో ఎమ్మెల్యేలు 30 శాతం కమీషన్ తీసుకుంటున్నారని కేసీఆరే మందలించారని అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డులో వెయ్యి కోట్ల అవినీతి జరిగిందన్నారు.