కార్యకర్తలను నిలువరించే ప్రయత్నం చేస్తున్నరు

బీజేపీ నిర్వహిస్తున్న భారీ బహిరంగసభకు అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తెలిపారు. కార్యకర్తలను నిలువరించే ప్రయత్నం చేస్తుండడం సబబు కాదన్నారు. హైకోర్టు అనుమతితో ప్రశాంత వాతవరణంలో సభ నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. బండి సంజయ్ నిర్వహిస్తున్న మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర వరంగల్ లో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలిసి.. భద్రకాళీ టెంపుల్ లో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. 

అంతకంటే ముందు మీడియాతో బండి సంజయ్ మాట్లాడారు. తాము నిర్వహించిన పాదయాత్రలో టీఆర్ఎస్ పార్టీ అనేక అడ్డంకులు సృష్టించిందని విమర్శించారు. అనేక అంశాలు తమ దృష్టికి వచ్చాయని.. సమస్యలు పరిష్కరించేవి ఉన్నా.. వాటిని పరిష్కరించలేదన్నారు. బీజేపీ పార్టీకి అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారని తెలిపారు. బీజేపీ నిర్వహించే బహిరంగసభకు లక్షలాది మంది కార్యకర్తలు తరలివస్తున్నట్లు వెల్లడించారు. 

  • మొదటి విడత పాదయాత్ర భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రారంభమైంది. అక్టోబర్ 02వ తేదీన హుస్నాబాద్ లో పాదయాత్ర ముగిసింది. 
  • రెండో విడత పాదయాత్ర బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న ఆలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమైంది. మే 14న రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ముగిసింది. 
  • మూడో విడత పాదయాత్ర యాదాద్రి నుంచి ప్రారంభమైంది. వరంగల్ జిల్లాలోని భద్రకాళీ టెంపుల్ వద్ద పాదయాత్ర ముగిసింది.