కాంగ్రెస్, బిఆర్ఎస్ లు నాణానికి ఉన్న బొమ్మలని... అవినీతిలో రెండు పార్టీలు దొందు దొందేనని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అన్నారు. జగిత్యాల బిజెపి అభ్యర్థి బోగ శ్రావణి తరఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా జేపీ నడ్డా రోడ్ షో నిర్వహించారు. ఈ ప్రచారంలో ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా పాల్గొన్నారు. జిల్లా పట్టణంలోని కొత్త బస్టాండ్ నుంచి అంగడి బజార్ చౌరస్తా వరకు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అభివృధ్దితో పాటుగా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా బీజేపీ తనవంతు కృషి చేస్తుందన్నారు.
కాంగ్రెస్, బిఆర్ఎస్ లు రెండూ అవినీతిమయ పార్టీలేనని ఆయన విమర్శించారు. బిఆర్ఎస్ అంటే, భ్రష్టాచార్ రాక్షస సమితి అని, కాంగ్రెస్ అంటే కరప్షన్ అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవిని బీసీలకే కట్టబెడతామనీ....బీసీ బిడ్డగా, అందరి ఆడబిడ్డగా బోగ శ్రావణిని గెలిపించి అసెంబ్లీకి పంపించాలని నడ్డా అభ్యర్థించారు. మహిళలు, యువత సంక్షేమం కోసం బీజేపీ పాటుపడుతుందని చెప్పారు. మోడీ నాయకత్వంలో తెలంగాణ అభివృధ్ది కోసం చేస్తున్న ఈ యుధ్దంలో బీజేపీకి మద్దతు తెలపాలని నడ్డా కోరారు.