కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల జీవితాల్లో వెలుగులు రాలేదని, కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందిందని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు కేసీఆర్ కుటుంబ పాలనకు.. రాష్ట్ర ప్రజలకు మధ్య జరుగుతున్న పోటీ అని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం డబ్బులు పంపిస్తే.. ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం కేవలం కమీషన్ల కోసం పని చేస్తోందని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ధరలు తెలంగాణలోనే అత్యధికంగా ఉన్నాయన్నారు.
బీఆర్ఎస్ అంటే భ్రష్టచర్య రాష్ట్ర సర్కారు... ఇది తెలంగాణ ప్రజలను లూటీ చేస్తోంది అని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కు ATM వంటిందన్నారు. దీనికి 38 వేల కోట్లు ఖర్చు అవుతోందని, కానీ... లక్ష కోట్లకుపైగా ఖర్చు పెట్టి కమీషన్లు దోచుకున్నారని ఆరోపించారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే కాళేశ్వరం నిర్మాణంపై విచారణ చేపడుతామన్నారు.
అన్నింటిలో 30 శాతం కమీషన్ తీసుకునే సర్కార్ పోవాలి... బీజేపీ పాలన రావాలి అని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ పాలనలో దేశం ముందుకు వెళ్తోందన్నారు. 2024లో మోదీ అధికారంలోకి వస్తే భారత్ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశంగా మారుతుందని చెప్పారు. కర్ణాటకలో కరెంట్ లేక చీకట్లు ఉన్నాయని, ఇక్కడ కూడా అది కావాలా..? అని ప్రశ్నించారు.