- పుట్ట మధును దించడానికి జడ్పీటీసీల ప్రయత్నాలు
- స్టాండింగ్ కమిటీ సమావేశానికి మెజారిటీ సభ్యులు గైర్హాజరు
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాపరిషత్‌లో ముసలం పుట్టింది. మెజారిటీ బీఆర్ఎస్ జడ్పీటీసీలు జడ్పీ చైర్మన్ పుట్ట మధుపై అవిశ్వాసం పెట్టడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. బుధవారం స్టాండింగ్కమిటీ సమావేశం ఉన్నప్పటికీ ఇద్దరు సభ్యులు మినహా మెజారిటీ జడ్పీటీసీలు హాజరుకాలేదు. జడ్పీటీసీలు అందుబాటులో లేకుండా పోవడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.
అసంతృప్త జడ్పీటీసీలు ఇద్దరిద్దరుగా వేర్వేరు చోట్లలో క్యాంపు ఏర్పాటు చేసుకొని ఉన్నట్లు సమాచారం. అవిశ్వాసం నోటీసు ఇవ్వడానికి మెజారిటీ జడ్పీటీసీలు సంతకాలు చేసినట్లు తెలిసింది. గత నెల 28న జరగాల్సిన జడ్పీ జనరల్‌బాడీ మీటింగ్సడెన్గా వాయిదా పడింది. ఆరోజు నుంచే మెజారిటీ బీఆర్ఎస్ సభ్యులు అవిశ్వాసానికి రంగం సిద్దం చేసుకున్నట్లు తెలిసింది. ఆ సమావేశాన్ని జనవరి 11కు మార్చారు. కానీ ముందు రోజు జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశానికి హాజరు కాని జడ్పీటీసీలు.. జనరల్‌బాడీ మీటింగ్ హాజరు అవుతారో లేదోనన్న అనే అనుమానాలు మొదలయ్యాయి.
2019లో జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో పెద్దపల్లి జిల్లాలో 13 మండలాలకు గానూ బీఆర్ఎస్ 11 స్థానాలు గెలుచుకోగా కాంగ్రెస్ నుంచి ఇద్దరి గెలిచారు. కాగా ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓదెల కాంగ్రెస్ జడ్పీటీసీ గంట రాములు బీఆర్ఎస్లో చేరారు. పాలకుర్తి జడ్పీటీసీ కందుల సంధ్యారాణి(బీఆర్ఎస్) బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఉన్న 13 మంది జడ్పీటీసీల్లో మెజారిటీ సభ్యులు పుట్ట మధుకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానానికి ఓటు వేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే మెజారిటీ సభ్యులు క్యాంపునకు తరలిపోయినట్లు తెలిసింది. మరో రెండు రోజుల్లో ఈ ఎపిసోడ్‌కు తెరపడే చాన్స్ ఉంది.