Devara Review: 'దేవర' మూవీ రివ్యూ..ఎన్టీఆర్‌-కొరటాల మాస్ యాక్ష‌న్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

Devara Review: 'దేవర' మూవీ రివ్యూ..ఎన్టీఆర్‌-కొరటాల మాస్ యాక్ష‌న్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

మ్యాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Ntr) అభిమానుల ఆరేళ్ల నిరీక్షణకు తెరపడింది. భారీ అంచనాలతో తెరకెక్కిన మాస్ యాక్ష‌న్ థ్రిల్లర్ దేవర (Devara) ఇవాళ శుక్రవారం (సెప్టెంబర్ 27న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాతో శ్రీదేవి కూతురు జాన్వీకపూర్‌ తెలుగు తెరకు పరిచయం అయింది.

అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన దేవర చిత్రం ఎలా ఉంది..? టీజర్, ట్రైలర్ కట్స్ తో సినిమా మీద అంచనాలను మరింత పెంచిన కొరటాల ఆచార్య జ్ఞాపకాలను దేవరతో తుడిచేసాడా..? తారక్ నమ్మకాన్ని ఈయన నిలబెట్టాడా..? ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను దేవర ఎంతవరకు మెప్పించిందో? పూర్తి రివ్యూలో తెలుసుకుందాం . 

కథేంటంటే::

దేవర మూవీ కథ 1996లో మొదలయ్యి సింగప్ప (ప్రకాష్ రాజ్) ఒక పోలీసాఫీసర్ శివం (అజయ్) కి ఫ్లాష్ బ్యాక్ చెప్పడంతో ప్రారంభం అవుతోంది. నిఘా వర్గాల హెచ్చరికలతో 1996లో యతి అనే ఒక గ్యాంగ్ స్టార్ ను పట్టుకునేందుకు శివం ఏపీ తమిళ నాడు బోర్డర్లో ఉన్న రత్నగిరి వెళ్తాడు. కథ వివరాల్లోకి వెళితే.. 

ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు సరిహద్దు రత్నగిరి ప్రాంతమది. సముద్రానికి ఆనుకుని ఉన్న ఓ కొండ‌పై నాలుగు ఊర్ల‌ని క‌లిపి 'ఎర్ర స‌ముద్రం' అని పిలుస్తుంటారు. ఆ పేరు వెన‌క బ్రిటిష్ కాలం నుంచి చ‌రిత్ర ఉంటుంది. అక్కడ దేవర (ఎన్టీఆర్) తో పాటు భైరవ ( సైఫ్ అలీ ఖాన్), రాయప్ప ( శ్రీకాంత్) , కుంజర(షైన్‌ టామ్‌ చాకో) ఒక్కో గ్రామ పెద్దగా ఉంటారు. ఆ నాలుగు ఊళ్ళ వాళ్లకు సముద్రమే జీవనాధారం. ఆ సముద్రం ద్వారా కొన్ని సరుకులు కోస్ట్ గార్డ్‌కు తెలియకుండా దించుతుంటారు. అలా తన వాళ్ల కోసం ఎంతవరకు అయిన వెళ్లి, ప్రాణాలు ఇచ్చేంత ధైర్యం దేవరకు ఉంటుంది. అదే ఊళ్ళో ఉన్న భైరాకు దేవర చేసే పనులు ఏ మాత్రం నచ్చవు. కానీ దేవర సాయం లేకుండా ఏం చేయలేం అని భైరాకు తెలుసు. అందుకే అదును కోసం చూస్తుంటాడు.

దేవర తన వారైన రాయప్ప, భైరా, కుంజ, కోర తో కలిసి పెద్ద పెద్ద షిప్స్ నుంచి మురుగా (మురళి శర్మ) కోసం దొంగతనాలు చేస్తూ ఉంటాడు. అలాంటి దేవర ఒక దొంగతనం చేస్తున్న సమయంలో మనసు మార్చుకుని ఇక దొంగతనం చేయకూడదని ఫిక్స్ అవుతాడు. 

ఇలా ఓ సమయంలో సంద్రానికే ఎదురెళ్లి ఒడ్డుకు చేరుస్తున్న ఆ ఆయుధాలు త‌మ‌కే ముప్పు తీసుకొస్తున్నాయ‌ని గ్ర‌హించిన దేవ‌ర‌...తాము చేసేది తప్పు అని.. తన వాళ్లను కూడా సముద్రం పైకి వెళ్లొద్దని హెచ్చరిస్తాడు. ఇక‌పై ఆ పనుల్ని చేయకూడ‌ద‌నే నిర్ణ‌యానికొస్తాడు. బత‌క‌డానికి ఎన్నో మార్గాలున్నాయ‌ని, చేప‌లు ప‌ట్ట‌డంపై దృష్టి పెడ‌దామ‌ని చెబుతాడు. కానీ భైర‌ అందుకు ఏ మాత్రం ఒప్పుకోడు. దాంతో దేవర, బైరా మ‌ధ్య మనస్పర్థలు మొదలవుతాయి. ఇక బైరా అప్పట్నుంచి వరుసగా  ఎత్తులు వేయడం మొదలెడతాడు. ఏం చేసి అయిన దేవరని చంపేయాలని  భైరవ ప్లాన్ వేస్తాడు.

ఈ క్రమంలో దేవర మాటను కాదని భైరవ తో పాటు డబ్బులకు అలవాటు పడ్డ ఆ గ్రామ ప్రజలు సముద్రం ఎక్కేందుకు సిద్ధం అవ్వగా...దేవర వాళ్లకి తీవ్రమైన భయాన్ని చూపిస్తాడు. ఆ భయం దెబ్బకు వాళ్ళు మళ్లీ తప్పుడు పని కోసం సముద్రం ఎక్కాలి అంటేనే భయపడతారు. అంతలా భయపెట్టేందుకు దేవర ఒక కీలక నిర్ణయం తీసుకుంటాడు. ఆ కీలక నిర్ణయం ఏమిటి? అలా కొన్నేళ్ల తర్వాత ఊరికి దూరంగా అజ్ఞాతంలోలోకి దేవర ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అతని కొడుకు వర ( ఎన్టీఆర్) ఎందుకు భయస్తుడుగా మారాడు? అటువంటి వరని అంతలా ఇష్టపడుతున్న తంగం (జాన్వీ కపూర్) ఎవరు? దేవర, భైరాల గొడవ చివరికి ఏ పరిస్థితులకి దారి తీస్తుంది. అందులో వర పాత్ర ఏమౌతుంది? చివరికి పోలీసాఫీసర్ శివంకి యతి అనే  గ్యాంగ్ స్టార్ దొరికాడా? లేదా? అనే తదితర విషయాలు తెలియాలంటే థియేటర్లో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 

ఎలా ఉందంటే::

ప‌వ‌ర్‌ఫుల్ యాక్ష‌న్ డ్రామాతో సోషల్ మెసేజ్ ను చెప్పడంలో ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ సిద్ధహస్తుడు. ఆయన సినిమాలలో ఏదో ఒక సోషల్ పాయింట్ తో సినిమాలు తెరకెక్కిస్తుంటాడు. ఈ సినిమాను కూడా ఆ కోవలోనే తెర‌కెక్కించాడు.

అందుకు తగ్గ సముద్రం బ్యాక్ డ్రాప్ కథను, దాన్ని నమ్ముకునే బతికే నాలుగు గ్రామాల ప్రజలు, వారు చేస్తున్నది తప్పని తెలిసిన, డబ్బుకు అలవాటు పడి బతికేయడం.. ఇలా వీరిని నడిపే నాయకుడు తప్పును గ్రహించి.. ఇక ఈ పనులు వద్దని హెచ్చరించడం..వినకపోతే ప్రతీ మనిషికి భయం చూపించడం ఇలా కథనం తీసుకొచ్చాడు కొరటాల.

ప్రతిమనిషికీ భయం అనేది కచ్చితంగా ఉండాలని.. అది లేకపోతే కష్టం అని ఇందులో కొరటాల శివ చెప్పాలనుకున్న దేవర మెసేజ్ ఇది. మనిషికి బ్రతికేంత ధైర్యం ఉంటే చాలు..చంపేంత ధైర్యం అవసరం లేదనేది దేవర కథ. ఒక ఊహాజనిత ప్రాంతాన్ని సృష్టించి తన కథకు కావాల్సిన ఎత్తుగడను చాలా ఆసక్తికరంగా ఎత్తుకున్నాడు డైరెక్టర్ కొరటాల శివ. ఇక ఆ ఎర్ర సముద్రం చుట్టూ తనదైన శైలిలో  భావోద్వేగాలు, గాఢ‌తతో కూడిన క‌థ‌ని చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు శివ. స‌మ ఉజ్జీల్లాంటి ఇద్ద‌రి మ‌ధ్య పోరులో గాఢ‌త ఎలా ఉంటుందో  దేవ‌ర‌, భైర‌ పాత్ర‌ల మ‌ధ్య డ్రామాలో అది ప‌క్కాగా క‌నిపిస్తుంది. ఫియ‌ర్ సాంగ్‌తోపాటు వ‌చ్చే పోరాట ఘ‌ట్టాలు ఆడియన్స్ కు గూస్బంప్స్ వచ్చేలా విజువలైజ్ చేశాడు డైరెక్టర్.  

ఒకవిధంగా RRR మూవీ తర్వాత ఎన్టీఆర్ పాత్రను మరింత పవర్ ఫుల్ గా దేవర క్యారెక్టర్ తో చూపించడంలో కొరటాల సక్సెస్ అయ్యాడు. సంద్రంలో ఉవ్వెత్తున ఎగ‌సే కెర‌టంలాగే ఎన్టీఆర్ పాత్ర ప‌రిచ‌యం చేసే ఆ ఎలివేష‌న్స్‌, ఇలా స‌ముద్రం నేప‌థ్యం అభిమానులకే కాదు, సినిమా చూస్తున్న స‌గ‌టు ప్రేక్ష‌కుడికీ కూడా గొప్ప థియేట్రిక‌ల్ ఫీలింగ్ ను  పంచుతుంది. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ మాత్రం బాగా ప్లాన్‌ చేశాడు డైరెక్టర్.

ఫస్టాఫ్‌ అంతా దేవర చుట్టు తిరిగితే..సెకండాప్‌ వర చుట్టూ తిరుగుతుంది. రెండో ఎన్టీఆర్‌ ఎంట్రీ వరకు బాగానే ఉన్నా..ఆ తర్వాత కథ సాగదీతగా అనిపిస్తుంది. ఆడియన్ సినిమా చూస్తున్నంత సేపు కథలో వేగం తగ్గిన ఫీలింగ్ కలుగుతుంది. దానికి తోడు హీరోయిన్ జాన్వీ కపూర్ లవ్ ట్రాక్ కొంత క్రింజ్ అనిపించేలా ఉంది. ఆమె కాంబినేషన్ లో ఉన్న సాంగ్ ని మాత్రం ఆడియన్స్ ఫుల్ ఎంజాయ్ చేసేలా డిజైన్ చేశారు కొరటాల.

అయితే ఫస్ట్ ఆఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఫీలింగ్ కలుగుతుంది. అయితే, సెకండాఫ్ ఎక్కువగా కామెడీపై ఫోకస్ చేసాడు అనిపిస్తుంది. ఎందుకంటే, రెండో ఎన్టీఆర్ పాత్ర అంతా అలాగే రాసుకున్నాడు. ఇక గెటప్ సీను కనిపించడంతో కాస్త కామెడీ పండుతుందేమో అనుకున్న అది కనిపించదు.  మొత్తానికి దేవ‌ర‌ విజువ‌ల్స్‌, యాక్ష‌న్ ఎపిసోడ్స్‌, ప‌ర్ఫార్మెన్స్,  ప్రీ క్లైమాక్స్‌లో సముద్రం లోపల ఎన్టీఆర్‌తో వచ్చే సీన్లు అన్ని టాప్ నాచ్ అనేలా ఉంది.  దేవ‌ర‌, భైర‌ పాత్ర‌ల ముగింపు ఏమిట‌నేది పార్ట్‌ 2కి లీడ్‌ ఇస్తూ కథను ముగించడం చూస్తే.. బాహుబ‌లి వ‌న్ స్ఫూర్తితో క్లైమాక్స్‌ను కొర‌టాల శివ రాసుకున్నట్లు అర్ధం అవుతోంది. దేవర పాత్ర ఎలా ఉన్నా, వర పాత్రని ఇంకాస్త వినోదంగా మలచి ఉండాల్సింది.

ఎవ‌రెలా చేశారంటే::

దేవ‌ర‌, వ‌ర పాత్ర‌ల్లో ఎన్టీఆర్ చ‌క్క‌టి వేరియేష‌న్ చూపించాడు. యాక్ష‌న్ ఎపిసోడ్స్‌, అండర్ వాటర్ సీన్స్ లో ఎన్టీఆర్ ప‌ర్ఫార్మెన్స్  టాప్ నాచ్ అనేలా చేశాడు. దేవరగా, వరగా భిన్నమైన వాయిస్ మాడ్యులేషన్ బాడీ లాంగ్వేజ్ కనబరిచాడు. దేవర పాత్ర ఎలా ఉన్నా, వర పాత్రని ఇంకాస్త వినోదంగా మలచి ఉండాల్సింది. ఎన్టీఆర్ వ‌న్ మెన్ షోతో అదరగొట్టాడు.

ఇకపోతే జాన్వీక‌పూర్ పాత్ర‌కు పెద్ద‌గా ఇంపార్టెన్స్ లేదు. తంగం పాత్ర‌లో జాన్వీ క‌పూర్ అందంగా క‌నిపించింది. కాకపోతే కేవలం 15 నుంచి ఇర‌వై నిమిషాలు మాత్ర‌మే జాన్వీ ఉంటుంది. అయితే, ఉన్నంతలో ఆమె పరవాలేదు అనిపించింది. విలన్ పాత్రలో నటించిన సైఫ్ అలీ ఖాన్ మాత్రం ఎన్టీఆర్ ఢీకొట్టే పాత్రలో అదరగొట్టాడు. ఇక ముఖ్య పాత్రలలో నటించిన ప్రకాష్ రాజ్, కళయరసన్, షేన్ చాం టాకో, శ్రీకాంత్, శృతి మరాఠీ, మురళీ శర్మ, అభిమన్యు సింగ్ వంటి వాళ్ళు తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

కానీ, పాత్రలన్నీ ఒకేతాటి మీద నడుస్తున్నప్పుడు అన్నేసి పాత్రలక్కర్లేదని అనిపిస్తుంటుంది. వీరందరికి సింగిల్ సింగిల్ డైలాగ్స్ మాత్రమే ఉండటంతో కాస్తా  మైనస్ అనిపిస్తుంది. గెటప్ శ్రీను ఉన్నది ఒకట్రెండు సీన్స్ మాత్రమే ఉండడం కూడా హుషారు ఇవ్వదు.

సాంకేతిక అంశాలు::

ఈ సినిమాకు అనిరుధ్ మ‌రో హీరోగా నిలిచాడ‌ని చెప్పొచ్చు. అత‌డి బీజీఎమ్ థియేట‌ర్ల‌లో గూస్‌బంప్స్‌ను తెప్పిస్తోంది. సాంగ్స్ అదరగొట్టేశాడు.  చుట్టంమల్లే పాటకు థియేటర్స్‌లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈళలు వేయడం కన్ఫమ్. కెమెరా, గ్రాఫిక్స్ బాగున్నాయి.ఎడిటింగ్ పర్లేదు.. కానీ మూడు గంటల నిడివి కాస్త ఇబ్బంది పెట్టే విషయమే. నీటిలో ఫైట్స్ తో పాటు సముద్రపు ఒడ్డున డిజైన్ చేసిన ఫైట్స్ ఒక రేంజ్ లో పేలాయి.

ఇక సినిమాటోగ్రఫీ రత్నవేలు సినిమా అందాన్ని మరింత పెంచేలా చేశాడు. ఇకపోతే లాస్ట్ బట్ నాట్ లాస్ట్ డైరెక్టర్ కొరటాల ఆచార్య వంటి భారీ డిజాస్టర్ తర్వాత దేవరతో మెప్పించాడు. తనదైన శైలిలో కొర‌టాల ప్రతిదీ ప‌క్కాగా కచూపించాడు. ఆయ‌న డైలాగ్స్ లో ఎన్టీఆర్ విశ్వరూపం చూపించాడు.

‘దేవ‌ర అడిగినాడంటే సెప్పినాడ‌ని, సెప్పినాడంటే..’ 'ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్లల్లో మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి',  ‘భ‌యం పోవాలంటే దేవుడి క‌థ వినాల‌, భ‌యం అంటే ఏంటో తెలియాలంటే దేవ‌ర క‌థ వినాల‌..’, ‘సంద్రం ఎక్కాల‌, ఏలాల‌..’ 'మనిషికి బతికేంత ధైర్యం చాలు.. చంపేంత దైర్యం కాదు', 'దేవరను చంపాలంటే సరైన సమయం కాదు.. సరైన ఆయుధం దొరకాలి', 'పని మీదు పోయినోడు అయితే పనవ్వగానే వస్తాడు.. పంతం పట్టిపోయాడు నీ కొడుకు'   ఇలా చాలా డైలాగ్స్ తో ఆడియన్స్ ను మెప్పించాడు. కాకపోతే, రైటర్‌గా అదరగొట్టిన శివ.. డైరెక్టర్‌గా ఇంకాస్త పదును పెట్టాల్సి ఉండేది.