రివ్యూ: ఆర్.ఆర్.ఆర్
రన్ టైమ్ : 3 గంటల 6 నిమిషాలు.
నటీనటులు: ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియా భట్, అజయ్ దేవగణ్, శ్రియా సరణ్, సముద్రఖని, ఒలివియా మోరిస్, రాజీవ్ కనకాల తదితరులు.
సినిమాటోగ్రఫీ: సెంథిల్
మ్యూజిక్: కీరవాణి
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
యాక్షన్: పీటర్ హెయిన్స్
కథ: విజయేంద్ర ప్రసాద్
నిర్మాత: డి.వి.వి దానయ్య
రచన, దర్శకత్వం: ఎస్.ఎస్ రాజమౌళి
రిలీజ్ డేట్: మార్చి 25, 2022
కథేంటి?
బ్రిటీష్ పాలన భారతదేశంలో సాగుతున్న రోజుల్లో ఈ కథ జరుగుతుంది. ఆంగ్లేయ అధికారి స్కాట్ నిజాంను కలుసుకునేందుకు వచ్చి ఆదిలాబాద్ లో మల్లి అనే గోండు పాపను తనతో పాటు తీసుకెళ్తాడు. ఈ పాపను కాపాడేందుకు భీమ్ (ఎన్టీఆర్) ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. మరోవైపు పోలీసు అధికారి సీతారామరాజు (రామ్ చరణ్) భీమ్ ప్రయత్నాలకు అడ్డుపడతాడు. అతనికి సీత (ఆలియా భట్)తో ప్రేమ కథ ఉంటుంది. భీమ్, రామ్ మధ్య వైరం.. తర్వాత వారి మధ్య చిగురించిన స్నేహం నేపథ్యంగా కథ సాగుతుంది. గోండు పాప మల్లిని భీమ్ ఎలా రక్షించాడు, సీతారామరాజు అందించిన తోడ్పాటు ఎలాంటిది, వీళ్లిద్దరు కలిసి బ్రిటీష్ సామ్రాజ్యం మీద ఎలాంటి తిరుగుపాటు చేశారనేది మిగిలిన కథ.
నటీనటుల పర్ఫార్మెన్స్:
అమాయకుడైన భీమ్ పాత్రలో ఎన్టీఆర్, కండతో పాటు బుద్ధిని ఉపయోగించే సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ ఆకట్టుకున్నారు. ప్రతి సన్నివేశంలో వీళ్ల నటన మెప్పిస్తుంది. ఎమోషన్, యాక్షన్ సీన్స్ లో పూర్తిగా క్యారెక్టర్స్ లా మారిపోయారు. భీమ్ పాత్రలో ఎన్టీఆర్ యాస, హావభావాలు ఎంతో సహజంగా ఉన్నాయి. పులితో ఫైట్ లో భీమ్ గా ఎన్టీఆర్ పర్మార్మెన్స్, అల్లూరిగా మారి విల్లుతో చేసే యాక్షన్ సీన్స్ లో చరణ్ నటన వైబ్రంట్ గా ఉంది. బ్రిటీష్ పోలీస్ అధికారిగా రామ్ చరణ్ టఫ్ గా కనిపిస్తారు. రామ్ ప్రేమ కోసం నిరీక్షించే సీత పాత్రలో ఆలియా భట్ కనిపించింది. అజయ్ దేవగణ్, శ్రియా సరన్.. ఒలీవియా మోరిస్ ఇలా ప్రతి ప్రధాన పాత్రకూ కథలో ప్రాధాన్యత ఉంది.
ఎలా ఉందంటే..
బ్రిటీష్ అంటే ప్రతి భారతీయుడిలో పౌరుషం రగుల్కుంటుంది. ఈ భావోద్వేగ అంశాన్ని ఆధారంగా చేసుకుని దర్శకుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కించాడు. గోండు పిల్లను బ్రిటీషర్ల నుంచి కాపాడే అంశం కూడా పూర్తిగా ఎమోషన్ తో కూడుకున్నదే. ఓ పాపను రక్షించేందుకు హీరో ఎన్ని సాహసాలు చేసినా ప్రేక్షకులు చూస్తారు. ఈ నమ్మకంతోనే రాజమౌళి హీరోయిజం ఎలివేట్ చేశాడు. ఈ క్రమంలో కథలో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. ఈ థ్రిల్లింగ్ కథకు అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు కలిపి ఆర్ఆర్ఆర్ ను తెరకెక్కించారు. ఇద్దరు హీరోల మధ్య వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకే హైలైట్. అదే విధంగా క్లైమాక్స్ కూడా అదిరిపోయింది. తన విజన్ కు సాంకేతిక బలాన్ని జోడించడం జక్కన్నకు అలవాటు. ఈ చిత్రంలోనూ సాబూ సిరిల్ ప్రొడక్షన్ డిజైన్, బ్రిటీష్ కాలం నాటి సెట్స్, శ్రీనివాస మోహన్ విజువల్ ఎఫెక్టులు, కీరవాణి పాటలు, నేపథ్య సంగీతంతోపాటు సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ...ఇలా టెక్నికల్ గా ప్రతి క్రాఫ్ట్ సినిమాను మరింత ఉన్నతంగా నిలబెట్టింది.
మరిన్ని వార్తల కోసం: