
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ నందమూరి కుటుంబంలో విబేధాలు భగ్గుమన్నాయి. దివంగత మాజీ నేత, టీడీపీ వ్యవస్థాపకుడు సీనియర్ ఎన్‌టీఆర్ మనవడిగా జూ.ఎన్‌టీఆర్ తెలుగుదేశం పార్టీని నడిపించాలని ఆయన అభిమానులు కోరుకుంటుండగా.. చంద్రబాబు, బాలకృష్ణతోపాటు మరికొందరు పార్టీ తమ అధీనంలోనే ఉండేలా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎన్‌టీఆర్ ఘాట్ సాక్షిగా నందమూరి కుటుంబంలో విబేధాలు బయటపడ్డాయి.
జనవరి 18వ తేదీ.. సీనియర్ ఎన్‌టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్‌టీఆర్ ఘాట్ దగ్గర ఆయన కుమారులు, మనవళ్లు, ఇతర కుటుంబసభ్యులు నివాళులర్పించారు. ముందుగా జూనియర్ ఎన్‌టీఆర్, కల్యాణ్‌రామ్ నివాళులర్పించగా.. ఆ తరువాత బాలకృష్ణ, రామకృష్ణ తదితరులు ఘాట్ దగ్గర నివాళులర్పించారు. ఈ క్రమంలో బాలయ్య కాస్త హడావిడి చేశారు. ఎన్‌టీఆర్ ఘాట్ దగ్గరకు చేరుకున్న వెంటనే ఆ పరిసరాల్లో ఉన్న జూనియర్ ఎన్‌టీఆర్ ఫ్లెక్సీలను తొలగించాలని అనుచరులను ఆదేశించారు. ఆయన చెప్పినట్లుగానే అనుచరులు వాటిని అక్కడి నుంచి తొలగించారు. ఈ చర్యలు తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారుతున్నాయి.
జూనియర్ ఎన్‌టీఆర్ ఫ్లెక్సీలను తొలగించడం అతని అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు. ఫ్లెక్సీలను తొలగించాలని ఆదేశాలిచ్చిన బాలకృష్ణపై.. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ మేరకు బాలకృష్ణను, తెలుగుదేశం పార్టీ పెద్దలను హెచ్చరిస్తూ ఓ లేఖను విడుదల చేశారు. ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది..
లేఖలోని సారాంశం ఇదే..
"తారక్ అన్న కోసం మేమంతా
అందరికీ నమస్కారం...
తమ అభిమానుల కోసం తపన పడే నటుల్లో మన తారక్ అన్న ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు... కానీ ఆయన ప్రతీ నిమిషం అవమానాలకు గురౌతుంటే ఆయన అభిమానులుగా మాకు గుండెల్లో నిప్పుల కొలిమిగా రగులుతోంది.. అయినా సరే ఆయన గత నెలలో మమ్మల్ని ఉద్దేశించి చెప్పిన మాటలు...కొద్దిగా సంయమనం పాటించండి అని... ఇన్నాళ్ళు మేము అదే సంయమనం తో ఉన్నాం...కానీ ఇప్పుడు కుదరదు..
"దేవర ఇన్నాళ్ళు నీ మీద జరిగిన మానసిక దాడి చాలు...ఇక వాళ్ళకి తెలియాలి దేవర అభిమానుల సత్తా... మేమెంతో అభిమానంతో మా దేవర కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లను బహిరంగంగా బాలయ్య తీసేయండి.. ఇప్పుడే తీసేయండి అని అక్కడున్న తెలుగుదేశం వాళ్ళకి చెప్తుంటే తారక్ అన్న ని ఎంతలా ద్వేషిస్తున్నారో తలచుకొని బరువెక్కిన హృదయంతో కళ్ళు కన్నీటితో కారు మబ్బులు కమ్మేసాయ్..
బావ కళ్ళల్లో ఆనందం కోసం ఆ నాడు దివంగత సీనియర్ ఎన్టీఆర్ గారిని, దివంగత నందమూరి హరికృష్ణ గారిని మరణం అంచుల్లో ఉన్నా వెంటాడారు... ఇదే బాలయ్య అప్పట్లో చంద్రబాబు చెప్పులు మోస్తూ వీర విహారం చేశాడు.. ఇప్పుడు తారక్ అన్నని భారీగా టార్గెట్
చేస్తూనే ఉన్నారు. మీ అందరికీ ఒకటే చెప్తున్నాం... ఇన్నాళ్ళు సహించాం.... త్వరలో మీ అహంకారం అణచి.. మీలోని మదాన్ని వెంటాడబోతున్నాం... ఈసారి బ్యాలెట్ బాక్సులు భయంతో భీతేక్కుతాయి.. ఆంధ్ర రాష్ట్రం తారక రాముడి అడ్డా అని చాటి చెప్పకపోతే
దీంతల్లి... ఈసారి మీకు మాత్రం రాజకీయ బిచ్చగాళ్ళను చేయడం నిశ్చయం.. అందుకు ప్రతీ ఎన్టీఆర్ అభిమాని ప్రతిన పూనుతున్నాడు.. మా అందరిలో ఇప్పుడు అగ్రహించిన ఉగ్ర నరసింహుడు ఆవహించి ఉన్నాడు.. మీ అందరినీ వేటాడి వేటాడి మీ పతనం చూస్తాం..
జై ఎన్టీఆర్ ! జై జై ఎన్టీఆర్!!"
అని అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం పేరిట ప్రచురించిన ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాటుచేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీయించిన నందమూరి బాలకృష్ణ..#cbnkilledntr #JuniorNTR#IndraSenaReddy #NTR pic.twitter.com/2fkVGpQ7f3
— M.INDRASENAREDDY (@indrasena9966) January 18, 2024