హైకోర్టులో జూనియర్ ఎన్టీఆర్​కు ఊరట

హైకోర్టులో జూనియర్ ఎన్టీఆర్​కు ఊరట
  • ఆయన ఇంటిపై డీఆర్‌‌‌‌టీ ఇచ్చిన ఉత్తర్వులు రద్దు 

హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్‌‌‌‌ హౌసింగ్‌‌‌‌ సొసైటీలోని సినీ హీరో నందమూరి తారక రామారావు (జూనియర్‌‌‌‌ ఎన్టీఆర్‌‌‌‌) ఇంటిపై బ్యాంకులకు హక్కులున్నాయని రుణ వసూళ్ల ట్రైబ్యునల్‌‌‌‌ (డీఆర్‌‌‌‌టీ) గతంలో ఇచ్చిన తీర్పును హైకోర్టు రద్దు చేసింది. ఈ వివాదానికి సంబంధించి ఇరుపక్షాల వాదనలను తిరిగి విచారించి ఉత్తర్వులు జారీ చేయాలని డీఆర్‌‌‌‌టీని ఆదేశించింది. 

డీఆర్‌‌‌‌టీ ఉత్తర్వులను సవాల్‌‌‌‌ చేస్తూ  ఎన్టీఆర్‌‌‌‌ దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌ను చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ అలోక్‌‌‌‌ అరాధే, జస్టిస్‌‌‌‌ జే.అనిల్‌‌‌‌ కుమార్ తో  కూడిన డివిజ్‌‌‌‌ బెంచ్‌‌‌‌ ఇటీవల విచారణ చేపట్టింది. జూబ్లీహిల్స్‌‌‌‌ హౌసింగ్‌‌‌‌ సొసైటీలో 681 చదరపు గజాల స్థలాన్ని సుంకు గీత అనే మహిళ నుంచి 2007లో ఎన్టీఆర్‌‌‌‌ కొనుగోలు చేశారు. అన్ని అనుమతులు పొంది ఇంటి నిర్మాణం చేపట్టినట్లు కోర్టుకు లాయర్‌‌‌‌ చెప్పారు. 1996లోనే ఈ స్థలాన్ని తాకట్టు పెట్టిన యజమాని రుణం పొందారని, అందువల్ల వాటిపై హక్కులు తమకూ ఉన్నాయంటూ ఎస్బీఐ, ఓబీసీ, ఇండస్, బ్యాంక్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ బరోడాలు సర్ఫేసీ చట్టం కింద నోటీసులు జారీ చేశాయన్నారు. 

ఈ వ్యవహారం డీఆర్‌‌‌‌టీకి చేరిందన్నారు. పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఉత్తర్వులు జారీ చేయడం సహజ న్యాయసూత్రాలకు వ్యతిరేకమన్నారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. డీఆర్‌‌‌‌టీ ఆర్డర్‌‌‌‌ను సవాల్‌‌‌‌ చేసేందుకు వేరే ప్రత్యామ్నాయం ఉందని.. అప్పీలెట్‌‌‌‌ ట్రైబ్యునల్‌‌‌‌ను ఆశ్రయించాలని తెలిపింది. అయితే, సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా డీఆర్‌‌‌‌టీ ఆదేశాలు జారీ చేసిన కారణంగా ఆ ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ వివాదానికి సంబంధించి ఇరుపక్షాల వాదనలను తాజాగా విని నిర్ణయం తీసుకోవాలని డీఆర్‌‌‌‌టీని ఆదేశించింది. వివాదాన్ని డీఆర్‌‌‌‌టీకే పంపింది. పిటిషన్‌‌‌‌పై విచారణను మూసివేసింది.