![దేవర ద లార్డ్ ఆప్ ఫియర్](https://static.v6velugu.com/uploads/2023/05/Devara,-actor-looks-fierce-in-first-look-poster_UBWzFJiwTd.jpg)
‘ఆర్ఆర్ఆర్’ లాంటి ఆస్కార్ విన్నింగ్ మూవీ తర్వాత ఎన్టీఆర్ నుండి రాబోతున్న చిత్రం కావడంతో.. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న సినిమాపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. శరవేగంగా షూటింగ్ జరగుతున్న ఈ మూవీ నుండి ఫస్ట్ లుక్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందుగానే ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను లాంచ్ చేశారు. గత కొద్దిరోజులుగా ప్రచారంలో ఉన్న ‘దేవర’ అనే టైటిల్‌నే ఖరారు చేశారు.
సముద్రపు ఒడ్డున ఎగిసిపడుతున్న అలలు, తను చంపి పడేసిన శవాల మధ్య, చేతిలో ఆయుధం, నల్లని బట్టలపై రక్తపు మరకలతో ఫెరోషియస్‌గా కనిపిస్తున్నాడు ఎన్టీఆర్. ఇక జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఎన్టీఆర్ కెరీర్‌లో ఇది 30వ సినిమా. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. రత్నవేలు సినిమాటోగ్రాఫర్. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.