ఉద్యోగం ఇవ్వం.. పొండి!

ఉద్యోగం ఇవ్వం.. పొండి!
  • జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టుల్లో గందరగోళం
  • సెలక్టయినా దక్కని పోస్టింగ్
  • వెయ్యి మందికి అందని ఆఫర్​ లెటర్లు

వాళ్లు అన్ని పరీక్షల్లో పాసయ్యారు. అన్నిట్లో సెలెక్టయ్యారు. ఇక ఆఫర్​ లెటర్​ చేతిలో పడటం.. జాబ్​లో చేరడమే తరువాయి. కానీ.. చివరి నిమిషంలో నాన్ లోకల్ అంటూ అధికారులు పక్కన పెట్టేశారు.ఏమన్నా అంటే.. అది పరీక్ష నిర్వహించిన సంస్థది తప్పని చెప్తున్నారు. ఎన్నో ఆశలతో జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు పోటీ పడిన సుమారు వెయ్యి మంది అభ్యర్థుల పరిస్థితి ఇది. ఈ పోస్టుల భర్తీకి ఆరంభం నుంచి బాలారిష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఫలితాలు వచ్చిన తర్వాత క్రీడల కోటా, వికలాంగుల కోటా వంటి సమస్యలపై అధికారుల చుట్టూ తిరిగిన అభ్యర్థులు.. ఇప్పుడు ఉద్యోగానికి ఎంపికైన తర్వాత కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోం ది. రాష్ట్రవ్యాప్తంగా 9355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులు కాంట్రాక్టు పద్ధతిన భర్తీకి గత ఏడాది అక్టోబర్ లో పరీక్షలు నిర్వహించారు. అదే ఏడాది డిసెంబర్ లో ఫలితాలు వచ్చినప్పటికీ కోర్టు కేసులు, స్టే కారణంగా ఇంత కాలం అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వలేదు. ఇటీవల రాష్ట్రంలో లోక్ సభ ఎన్ని కలు పూర్తి కావటంతో ఈసీ అనుమతితో నియామక పత్రాలు ఇవ్వడం మొదలుపెట్టారు .అయితే నాన్ లోకల్ కారణం చెప్పి రాష్ట్రవ్యాప్తంగా సుమారు వెయ్యి మంది అభ్యర్థులకు అధికారులు ఆఫర్​ లెటర్​ ఇవ్వలేదు. పోస్టింగ్ లేదని చెప్పేశారు.దీంతో ఆ అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

అన్నీ ఓకే చేసి.. ఇప్పుడు ఇలా..

ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు ఎక్కడ చదివితే ఆ జిల్లా ను పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు అంటున్నారు. అయితే అప్లై సమయంలోమాత్రం ప్రస్తుతం నివాసం ఉంటున్న జిల్లాను లోకల్ గా పరిగణిస్తూ అప్లికేషన్ ను ఒకే చేశారు. పరీక్షకు అప్లై చేసే సమయంలో కొత్త జిల్లాల ప్రకారం ఆప్షన్లు నమోదయ్యాయని అభ్యర్థులు చెప్తున్నారు. ఉద్యోగానికి ఎంపికైన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన జిల్లా అధికారులు కూడా ఎటువంటి సమస్య లేదని ఆఫర్ లెటర్ వస్తుందని చెప్పా రని వాళ్లు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు ఆఫర్ లెటర్ల కోసం డీపీవోల దగ్గరకు వెళ్తే లిస్ట్ లో పేరు లేదని చెబుతున్నారని అంటున్నారు.

కమిషనరేట్ ఎదుట ఆందోళన

తమకు జరిగిన అన్యాయంపై సోమవారం పంచాయతీ రాజ్ కమిషనరేట్ దగ్గర అభ్యర్థులు కాసేపు ఆందోళనకు దిగారు. విషయాన్ని కమిషనర్ నీతూ ప్రసాద్ దృష్టికి తీసుకెళదామని వస్తే ఆమె జడ్పీటీసీ ఎన్నికల సమీక్షలతో తీరిక లేకుండా ఉండటంతో కలవలేకపోయారు. మరో అధికారిని కలిస్తే పోస్టింగ్ ఇవ్వబోమని చెప్పా రని అభ్యర్థులు వాపోయారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కలిసే ప్రయత్నం చేయగా ఆయన అందుబాటులో లేరని, ఆయన పేషీలో వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు.

వేరే జాబ్ చూసుకొమ్మంటున్నరు

నేను భూపాలపల్లిలో 1 నుంచి 7వ తరగతివరకు చదివాను. ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాలో ఉంటున్నాను. పోస్టుకు అప్లై చేసేసమయంలో సొంత జిల్లా అంటే మహబూబాబాద్ అని ఆప్షన్ ఇచ్చాం . అలాంటప్పుడు అదే జిల్లా లో పోస్టింగ్ ఇవ్వాలి. కాని భూపాలపల్లి జిల్లా లో చదువుకున్నందున నాన్ లోకల్ అవుతారని అంటూ అధికారులు ఆఫర్ లెటర్ ఇవ్వలేదు. మీ పేరు రిజెక్ట్ అయింది వేరే జాబ్ చూసుకొమ్మని చెప్తున్నారు. పంచాయతీ రాజ్ కమిషనరేట్ లో అడిగితే పరీక్ష నిర్వహించిన జేఎన్టీయూది తప్పు అని అంటున్నారు. నాతో పాటు మా జిల్లా లో ఏడుగురు, ఖమ్మం జిల్లాలో 49 మంది, మహబూబ్ నగర్ జిల్లాలో 56 మంది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి మందికి అధికారులు ఆఫర్ లెటర్లు ఇవ్వలేదు. ట్విట్టర్ లో కేటీఆర్ కు ఫిర్యాదు చేసినా స్పందన లేదు.- లతా ప్రియదర్శిని, మహబూబాబాద్

కేటీఆర్​ జోక్యం చేసుకోవాలి

నేను వరంగల్ జిల్లాలో చదువుకున్నా. ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో ఉంటున్నా. అప్లై చేసే సమయంలో ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే లోకల్ మహబూబాబాద్ అని వచ్చింది.ఇప్పుడు నాన్ లోకల్ అని పోస్టింగ్ ఇవ్వలేమంటున్నారు. ఎంపికైన లిస్ట్ లో మీ పేరు లేదని చెప్తున్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో అంతా బాగుందని క్లీయర్ ​ఇచ్చిన అధికారులు..ఇప్పుడు నియామక పత్రాలు ఇవ్వకపోవడంఏమిటి?  మంత్రి ఎర్రబెల్లి, కేటీఆర్ జోక్యం చేసుకోవాలి.  ప్రభుత్వం సమస్య పరిష్కరిం చకపోతే కోర్టుకు వెళ్తాం .- దేవయ్య, మహబూబాబాద్