పట్నా: జన్ సూరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ఐసీయూలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. అయితే, నాలుగు రోజుల తర్వాత దీక్షను భగ్నం చేసి పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.
ఈ నేపథ్యంలో పీకే ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం పట్నాలోని ఆస్పత్రికి తరలించి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స అందిస్తున్నారు. గతేడాది డిసెంబర్‌లో బీపీఎస్సీ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రశాంత్ కిశోర్ ఈ నెల 2 నుంచి పట్నాలో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు.