హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డ్రోన్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్టు జేఎస్డబ్ల్యూ సంస్థ ప్రకటించింది. దీన్ని అమెరికాకు చెందిన డిఫెన్స్ టెక్నాలజీ సంస్థ భాగస్వామ్యంతో నెలకొల్పనుంది. ఇందుకోసం దాదాపు రూ.800 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీనికి సంబంధించి దావోస్వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో జేఎస్డబ్ల్యూ డిఫెన్స్ అనుబంధ సంస్థ అయిన జేఎస్డబ్ల్యూ యూఏవీ లిమిటెడ్ కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
దీని ద్వారా దాదాపు 200 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఈ ఒప్పందంతో రక్షణ రంగంలో కీలక ఆవిష్కరణలతో పాటు డ్రోన్ టెక్నాలజీకి తెలంగాణ ప్రధాన కేంద్రంగా మారుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం రక్షణ రంగంలో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.