జేటీసీ రమేశ్​పై ఆటోయూనియన్ నేత దాడి

జేటీసీ రమేశ్​పై ఆటోయూనియన్ నేత దాడి
  • హైదరాబాద్​లోని ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో ఘటన
  • ఇయ్యాల పెన్​డౌన్​కు పిలుపునిచ్చిన రవాణా శాఖ ఉద్యోగ సంఘాలు

హైదరాబాద్, వెలుగు: రవాణా శాఖ ఆర్టీఏ జాయింట్ కమిషనర్ రమేశ్​కుమార్​పై ఆటోయూనియన్​నాయకుడు అమానుల్లాఖాన్ దాడికి పాల్పడ్డాడు. గురువారం ఖైరతాబాద్​లోని ఆర్టీఏ కార్యాలయానికి వచ్చిన అమానుల్లాఖాన్​ జేటీసీ రమేశ్ కుమార్​చాంబర్​కు వెళ్లారు. తను అడిగిన పని చేయడం కుదరదని జేటీసీ రమేశ్​కుమార్ స్పష్టం చేయడంతో.. అమానుల్లాఖాన్ జేటీసీని చెంప దెబ్బ కొట్టినట్టు ఆర్టీఏ ఉద్యోగులు తెలిపారు. దీంతో ఆఫీసులోని సిబ్బంది పెన్​డౌన్​చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయంపై రమేశ్ కుమార్​ను వివరణ కోరేందుకు ఫోన్ చేయగా ఆయన అందుబాటులోకి రాలేదు. మరోవైపు అమానుల్లా ఖాన్ ను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. దాడికి నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీఏ ఆఫీసుల్లో పెన్ డౌన్ చేయనున్నట్టు రవాణా శాఖ ఉద్యోగ సంఘాల నాయకులు రవీంద్ర కుమార్, చంద్ర శేఖర్ గౌడ్, శ్రీనివాస రెడ్డి, రామకృష్ణ, అరుణేంద్ర ప్రసాద్, ఎంజులా రెడ్డి, శ్రీనివాస్ తెలిపారు.

గ్రూప్​–1 ఆఫీసర్స్ అసోసియేషన్ ఖండన

హైదరాబాద్ జేటీసీపై దాడిని తెలంగాణ గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది.  దాడికి పాల్పడిన అమానుల్లాఖాన్ ను వెంటనే అరెస్ట్ చేయాలని అసోసియేషన్ అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్, హన్మంతు నాయక్ డిమాండ్ చేసారు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

దాడిని ఖండిస్తున్నం: బీఎంఎస్​

జేటీసీ రమేశ్​కుమార్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు భారతీయ ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ మజ్దూర్ మహా సంఘ్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి రవిశంకర్ అల్లూరి అన్నారు. అమానుల్లా ఖాన్ లాంటి బ్రోకర్లను ఆటో యూనియన్ నాయకులుగా పరిగణించి, వారితో ప్రతి అంశాన్ని చర్చించడం రవాణా అధికారులు చేస్తున్న పెద్ద తప్పన్నారు. ఆర్టీఏ ఆఫీసుల్లో బ్రోకర్లకు ప్రాధాన్యత ఇవ్వకుండా ట్రేడ్ యూనియన్ లకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.