- 2 కేసుల్లో రిమాండ్ ఖైదీగా మాజీ డీసీపీ
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు సిటీ టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రిజనర్ ట్రాన్సిట్ (పీటీ) వారెంట్‌పై గురువారం తమ ఆధీనంలోకి తీసుకున్న రాధాకిషన్ రావును.. చంచల్‌గూడ జైలు నుంచి నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లి జడ్జి ముందు హాజరుపర్చారు. కోర్టు ఆదేశాలతో జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. వారం పాటు కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. క్రియా హెల్త్ కేర్ సంస్థ వ్యవస్థాపకుడు చెన్నుపాటి వేణుమాధవ్‌ను కిడ్నాప్ చేసి రూ.40 కోట్లు విలువైన షేర్స్‌ను అక్రమంగా బదిలీ చేయించారని జూబ్లీహిల్స్ పీఎస్‌లో రాధాకిషన్ రావుపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
కిడ్నాప్ చేసి.. షేర్స్ ట్రాన్స్‌ఫర్
హైదరాబాద్‌కు చెందిన వేణుమాధవ్.. వరల్డ్ బ్యాంకులో పనిచేసి, 2011లో ఇండియాకు తిరిగి వచ్చారు. హైదరాబాద్‌లో క్రియా హెల్త్ కేర్ సంస్థను ప్రారంభించి, రూ.250 కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపట్టారు. ఇందులో డైరెక్టర్లుగా వేణు మాధవ్, బాలాజీ, గోపాల్, రాజ్, నవీన్, రవి ఉన్నారు. 2016–-17 నాటికి సంస్థలో వేణుకు 60%, బాలాజీకి 20%, గోపాల్‌కు10%, రాజుకు 10% వాటాలున్నాయి. 2018లో షేర్స్ విషయంలో వేణు మాధవ్‌కు మిగిలిన వారికి గొడవ జరిగింది. 2018 నవంబర్ 22న ఖాజాగూడ దగ్గర వేణు మాధవ్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అడ్డగించి సికింద్రాబాద్‌లోని ఆఫీస్‌కి తీసుకెళ్లి నిర్బంధించారు.
వేణుమాధవ్ కు చెందిన రూ.40 కోట్ల విలువైన షేర్లు మిగిలిన వాళ్లు బదిలీ చేయించుకున్నరు. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని వేణుమాధవ్‌ను రాధాకిషన్ రావు బెదిరించారు. బాధితుడి ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, షేర్ల బదిలీ కేసులో రాధాకిషన్‌తో పాటు టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ గట్టుమల్లు, మల్లికార్జున్, చంద్రశేఖర్ వేగె, కృష్ణ, గోపాల్, రాజ్, రవి, బాలాజీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.