హైదరాబాద్ : అమ్నీషియా పబ్ రేప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఐదుగురు మైనర్లుగా మేజర్లుగా పరిగణించాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఐదుగురు నిందితుల మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయని , మేజర్లకు ఉండాల్సిన లక్షణాలన్నీ వారికి ఉన్నాయని అందులో పేర్కొన్నారు. పోలీసుల పిటిషన్పై కోర్టు త్వరలోనే విచారణ జరపనుంది.
ఈ ఏడాది మే 28న కొందరు మైనర్లు జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్‌లో పార్టీ చేసుకున్నారు. ఈ క్రమంలోనే తన స్నేహితుడితో కలిసి ఓ బాలిక పబ్‌కు వెళ్లగా అక్కడ ఐదుగురు మైనర్లు తనతో మాట కలిపారు. పార్టీ అనంతరం ఇంటి దగ్గర దింపుతామంటూ కారు ఎక్కించుకున్నారు. అనంతరం ఒకరి తర్వాత ఒకరు అఘాయిత్యానికి పాల్పడి తిరిగి పబ్ వద్ద వదిలేసి వెళ్లారు.
ఇంటికి వెళ్లిన బాలిక ముభావంగా ఉండటంతో తల్లిదండ్రులు నిలదీయగా.. తనను కొందరు వేధించారని చెప్పడంతో 31న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదట వేధింపుల కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలికను ‘భరోసా’ కేంద్రానికి తీసుకెళ్లారు. మహిళా అధికారులు, నిపుణులు సేకరించిన వాంగ్మూలం, వైద్య పరీక్షల్లో ఆమెపై అఘాయిత్యం జరిగినట్టుగా తేలింది. దీంతో ఐదుగురు మైనర్లను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు ఉత్తర్వుల మేరకు జువైనల్ హోంకు పంపారు. అనంతరం వారు బెయిల్పై విడుదలయ్యారు.