![ట్రంప్కు మరో ఎదురుదెబ్బ.. ఆ విషయంలో షాకిచ్చిన జడ్జి](https://static.v6velugu.com/uploads/2025/02/judge-blocks-trump-plan-to-put-thousands-of-usaid-staff-on-leave_CVQfJBuhp2.jpg)
అమెరికా ఇతర దేశాలకు చేస్తున్న సేవలు, సహాయక చర్యలు ఎంత మాత్రం కొనసాగించేది లేదని, టాక్స్ పేయర్స్ మనీతో విదేశాలకు సహాయం చేయడం వలన తమ దేశానికి నష్టం వాటిల్లుతుందని, ఆ సేవలను రద్దు చేయాలని ట్రంప్ ఆర్డర్ చేశారు. అందులో భాగంగా మొత్తం 10 వేల ఉద్యోగులను తిరిగి యూఎస్ రప్పించేందుకు రంగం సిద్ధం చేశారు. ముందుగా 2,200 కార్మికులను 30 రోజుల సెలవుతో యూఎస్ రావాలని ఆదేశించారు. నెల రోజుల తర్వాత వారి ఉద్యోగాలు తొలగిస్తారు.
ఇప్పటికే 500 మంది ఉద్యోగులను అడ్మినిస్ట్రేషన్ లీవ్ లో ఉంచిన ట్రంప్ ప్రభుత్వం.. తాజాగా మరో 2,200 కార్మికుల లీవ్ పై ఆర్డర్ చేసింది. దీనిపై శుక్రవారం కోర్టులో వాదనలు జరిగాయి. ట్రంప్ అమెరికా రాజ్యాంగాన్ని ఉల్లంగిస్తున్నారని, దీని వలన వేల మంది ఉద్యోగులు రోడ్డున పడతారని జడ్జి వ్యాఖ్యానించారు.
ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోకపోతే సరిచేయలేని నష్టం జరుగుతుందని, కోర్టు జోక్యం వలన ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని అన్నారు. ఫిబ్రవరి 14 వరకు ఉద్యోగులకు ఇవ్వాల్సిన సెక్యూరిటీ గ్యారెంటీ, వేతనాలు ఎప్పటిలాగే ఇవ్వాలని, ఒక్క ఉద్యోగిని కూడా అడ్మినిస్ట్రేషన్ లీవ్ లో పంపడానికి వీలు లేదని ఆదేశించింది.
తమ ఉద్యోగాలు పోతే కుటుంబాలు రోడ్లపైన పడతాయని, భవిష్యత్తు అంధకారం అవుతుందని యూఎస్ ఎయిడ్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్న వేళ.. జడ్జ్ ఆర్డర్ ట్రంప్ నిర్ణయానికి చెంపపెట్టులాంటిది.
ఇటీవలే అమెరికా పౌరసత్వం (సిటిజన్ షిప్) పై ట్రంప్ ఇచ్చిన ఉత్తర్వులకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే.