“ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే పొలిమేర దాకా తన్ని తరుముదాం.. మన ప్రాంతం వాడు దోపిడీ చేస్తే ప్రాణంతోనే పాతరేద్దాం.” అని ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు అన్నట్టుగానే తెలంగాణ ప్రజానీకం తాజా అసెంబ్లీ ఎన్నికల్లో తీర్పును ఇచ్చింది. రాజకీయాల్లో ఏ పార్టీకీ అధికారం శాశ్వతం కాదు. ప్రజలు నమ్మితే పాలకులుగా పీఠం ఎక్కిస్తారు. మోసపోయామని తెలిస్తే ఓటు ఆయుధంతో వేటు వేస్తారు. అధికార కుర్చీ నుంచి దింపివేస్తారు. ఇదే ప్రజాస్వామ్య మౌలిక తీర్పు. ప్రజాతీర్పు బీఆర్ఎస్ను గద్దె దింపింది. తెలంగాణ అసెంబ్లీకి మూడోసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సీట్లను గెలుచుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో మంత్రులతో కొత్త ప్రభుత్వం కూడా కొలువుదీరింది. కాంగ్రెస్ పాలన షురూ అయింది. రాష్ట్రంలో గత రెండు ఎన్నికల్లో లేనంతగా బీఆర్ఎస్ ఈ సారి తీవ్ర ప్రజావ్యతిరేకతను ఎదుర్కొని పరాభవం పొందింది. పాలకుల అహంకారానికి, అవినీతికి, తెలంగాణ సమాజ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి మధ్య జరిగిన ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ‘మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లింది. బీఆర్ఎస్ పాలనలోని లోపాలను.. పాలకుల అవినీతిని, మోసాలను ఎత్తిచూపింది. అప్పటికే విసుగు చెందిన ప్రజలు బీఆర్ఎస్ అహంకార, దగాపూరిత పాలనను దింపేందుకు నిర్ణయించుకుని ఓటుతో తీర్పు ఇచ్చారు. బీఆర్ఎస్ను కాదని కాంగ్రెస్ కు పాలక పగ్గాలు అప్పగించారు. తెలంగాణ సమాజం నిర్ణయించుకున్నట్టుగానే పాలక మార్పుకే చెయ్యెత్తి జై కొట్టింది.
అహంకారానికి ప్రజాతీర్పు చెంపపెట్టు
“ఎదుటివారి గుణగణాలు పూర్తిగా తెలుసుకోవాలంటే.. వారికి అధికారం ఇచ్చి చూడాలంటారు’’ ఓ రాజకీయ తత్వవేత్త. ఉమ్మడి పాలనలో దశాబ్దాల పాటు తండ్లాడిన తెలంగాణ ప్రజలు తాము కోల్పోయిన అస్తిత్వం, ఆత్మగౌరవం, అణచివేతలకు స్వరాష్ట్రం వస్తే ఫుల్ స్టాప్ పడుతుందని ఆశించారు. ఏకమై ఉద్యమించి స్వరాష్ట్రం సాధించారు. ఇక స్వయం పాలనలో భాగంగా రెండుసార్లు బీఆర్ఎస్ కు అధికారమిచ్చారు. కానీ.. తొలినాళ్ల నుంచే రాష్ట్ర అభివృద్ధి పునర్నిర్మాణం పేరిట పాలకులు తమ అధికార అహంకార మార్కును చూపడం ప్రారంభించారు. ప్రజాతీర్పును అవహేళన చేశారు. ప్రజాప్రతినిధులను అంగడి సరుకుగా మార్చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభాలతో కొనుగోలు చేయడం, లేదంటే బెదిరింపులతో లొంగదీసుకోవడం వంటి చర్యలకు పాల్పడ్డారు. ఉద్యమ వ్యతిరేకులను పాలనలో భాగస్వాములను చేశారు. పదవుల పందేరంలో పెద్దపీట వేశారు. ఇలా స్వయం పాలన తొలినాళ్ల నుంచే ప్రజల ఆకాంక్షలను, ప్రజాస్వామ్య తీర్పును పరిహాసం చేశారు. అసెంబ్లీలో ప్రజల తరఫున కొట్లాడే గొంతుకను నొక్కివేశారు. ప్రశ్నించే గొంతుక ఉండొద్దు. వినిపించొద్దు. అధికార పక్షం.. ప్రతిపక్షం మేమే. శాశ్వత పాలకులం మేమే అనే ధోరణితో వ్యవహరించారు. ఉద్యమకాలం నాటి బీఆర్ఎస్ అధినేత దళిత సీఎం హామీ నుంచి పాలనలో కుంగిన మేడిగడ్డ బ్యారేజీ లోపాల దాకా అంతా అవినీతిమయం. పాలన లోపాలే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటమిని మూటగట్టి సాగనంపేలా చేశాయి.
కాంగ్రెస్ పాలన దిక్సూచిగా నిలవాలి
కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ సమాజం పెద్ద బాధ్యతనే పెట్టింది. బీఆర్ఎస్ పాలనలో జరిగిన దుబారాను, అవినీతిని, మోసపు హామీలను వెలికితీయమని అధికార పగ్గాలు చేతికిచ్చింది. ఇప్పటికే ప్రజల నెత్తిన రూ. 5 లక్షల కోట్ల అప్పుల కుప్ప ఉంది. దానిని అలాగే కొనసాగిస్తే భావితరాల నెత్తిపై గుదిబండనే అవుతుంది. సంపదను పెంచాలి.. ప్రజలకు పంచాలి. ముందుగా. విద్య, వైద్యం, ఉపాధి కల్పనపై శ్రద్ధ చూపాలి. నిరుద్యోగం తగ్గించడం, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుపరచడంపై కాంగ్రెస్ సర్కారు దృష్టిపెట్టాలి. పబ్లిక్ పాలసీలు, విధాన నిర్ణయాలు ప్రజాస్వామ్య విలువలు, ఆదర్శాలకు ప్రతిబింబింగా ఉండాలి. పాలకులు, అధికార యంత్రాంగంతో కలిసి జవాబుదారీగా, పారదర్శకంగా సంక్షేమ విధానాలు పాటించాలి. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను కూడా వందకు వందశాతం అర్హులకు అందేలా పాలకులు నిజాయతీని చూపాలి. అర్హులెవరో గుర్తించి సంక్షేమ ఫలాలు పంచాలి. తెలంగాణ బాగుండాలి.. అందులో మేముండాలి అనేలా ప్రజా పాలనకు ప్రాధాన్యం ఇవ్వాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమ, ఆత్మగౌరవ తెలంగాణగా మార్చాలి. భవిష్యత్ తరాలకు కాంగ్రెస్ పాలన దిక్సూచిగా నిలవాలి. ‘మేం పాలకులం కాదు. ప్రజా సేవకులం’ అని చెప్పినట్టుగానే కాంగ్రెస్ పాలకులు పాలనలో మార్పు చూపాలి.
ప్రజాపాలన దిశగా రేవంత్ సర్కార్
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజు నుంచే ప్రజాపాలన దిశగా సీఎం రేవంత్దూకుడు మొదలైంది. సామాన్యుడు కూడా వెళ్లేందుకు సాహసించని ఆధునిక పాలక రాజ భవంతి ప్రగతిభవన్ పేరును మహాత్మా జ్యోతిబా పూలేగా మార్పు చేశారు. దాని చుట్టూ ప్రజలకు అడ్డుగా నిర్మించిన కంచెను కూల్చివేశారు. ప్రజాభవన్‌లోకి సామాన్యులు కూడా స్వేచ్ఛగా వెళ్లి సమస్యలను చెప్పుకునేలా కాంగ్రెస్ సర్కార్ ప్రజాదర్బార్‌ను చేపట్టింది. బంగారు తెలంగాణ పేరిట గత పాలకులు చేసిన లక్షల కోట్ల అప్పులను, అవినీతి అక్రమాలను వెలికితీసే పనిలో పడింది. ఇందుకు శ్వేతపత్రం రూపకల్పనకు నిర్ణయం తీసుకుంది. స్వరాష్ట్రంలో 2014 డిసెంబర్ నుంచి 2023 డిసెంబర్ 7వ తేదీ వరకు ఆర్థిక లెక్కల చిట్టాను, అందులోని అవినీతి గుట్టును బట్టబయలు చేసే చర్యలను చేపట్టింది. గత పాలనలో పాలకుల అసమర్థ విధానాలు, ఆర్థిక వ్యయాలను లెక్కలతో సహ ప్రజల ముందు ఉంచడం. ఆపై ప్రజల అభిప్రాయాలను కోరడం. ఇలా శ్వేత పత్రం నిర్ణయం తీసుకోవడం కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వానిది సాహసమనే చెప్పాలి.
- వేల్పుల సురేష్, సీనియర్ జర్నలిస్ట్