న్యాయమూర్తుల వ్యాఖ్యల పర్యవసానాలు

న్యాయమూర్తుల వ్యాఖ్యల పర్యవసానాలు

11వ శతాబ్దపు రచయిత నియం అల్​ ముల్క్. ఆయన ప్రసిద్ధ గ్రంథం బుక్​ ఆఫ్​ గవర్నమెంట్​లో ఓ మంచిమాట చెప్పారు. ‘దేవుని దృష్టిలో..రాజు చేసిన పాపాన్ని మించిన పాపం లేదు’ అని పేర్కొన్నారు. దీనికి భిన్నమైన రోమన్​ సూత్రం ఒకటి ఉంది. అది ‘రాజు ఏ తప్పూ చేయడు’.  బుక్​ ఆఫ్​​ గవర్నమెంట్​ ప్రకారం  రాజుపై ఫిర్యాదులను ప్రజలు స్వేచ్ఛగా కోర్టుకి విన్నవించుకోవచ్చు.  పర్షియన్​ రాజులు ఈ విధంగా ప్రజలు ఫిర్యాదులు చేయడానికి అవకాశం కల్పించారు.  న్యాయమూర్తులు స్వతంత్రంగా తీర్పులు చెప్పడానికి వీలుగా రాజులు తమ కిరీటాలను తీసివేసి న్యాయప్రక్రియకు వీలుగా ఉండేవాళ్లని, న్యాయమూర్తుల తీర్పులకు బద్ధులై ఉండేవాళ్లని బుక్​ ఆఫ్​ గవర్నమెంట్​ చెబుతున్నది. రాజు చేసిన పాపాన్ని మించిన పాపం అనే పదబంధం రాజుల కన్నా ఎక్కువగా న్యాయమూర్తులకి వర్తిస్తుంది.  ఎందుకంటే  రాజు పాపం చేశాడో  లేదో  నిర్ణయించేవాడు  న్యాయమూర్తి.  రాజు చేసిన పాపం కన్నా పెద్ద పాపం,  న్యాయమూర్తులు చేసే పాపం. ఈ మాటలను అన్నది  ప్రొఫెసర్​  మోహన్ ​గోపాల్. ఆయన  నేషనల్​ జ్యుడీషియల్​ అకాడమీ డైరెక్టర్​గా  పనిచేశారు. 2024వ  సంవత్సరంలో  కొంతమంది న్యాయమూర్తుల  ఉత్తర్వుల మాటలు విన్న తర్వాత  మోహన్​ గోపాల్​ మాటలు గుర్తుకొచ్చాయి.


న్యాయమూర్తులు సాధ్యమైనంతవరకు హుందాగా, నిరాడంబరంగా ఉండాలి. అంతేకాదు, సామాజికంగా, రాజకీయంగా దూరంగా ఉండాలి. బహిరంగంగా కేసులకి సంబంధించిన మాటలు, రాజకీయపరమైన విషయాలు ప్రస్తావించకూడదు. చాలావరకు నిగ్రహంగా ఉండాలి.  తమ తీర్పులు ద్వారా  మాత్రమే మాట్లాడాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో నిరాడంబరత్వం కనిపించడంలేదు. ఎక్కడికి వెళ్లినా పోలీస్​ ఎస్కార్ట్​ కావాలని అంటున్నారు. ఇంట్లో ఎవరైనా చనిపోతే కూడా వాళ్ల స్వగ్రామం వరకు ఎస్కార్టు కోరుతున్నారని వింటున్నాం. ఆధునిక కాలంలో పూర్తిగా సమాజానికి దూరంగా న్యాయమూర్తులు ఉండలేని పరిస్థితులు ఉన్నాయి. యూనివర్సిటీలలో  ప్రసంగాలు,  అదేవిధంగా సంస్మరణ ప్రసంగాలు న్యాయమూర్తులు చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు కూడా  చాలామంది న్యాయమూర్తులు తమ పరిధులని దాటడం లేదు.  కానీ,  అక్కడక్కడా కొంతమంది న్యాయమూర్తులు తమ  పరిధులు దాటి టీవీ ఇంటర్వ్యూలు, మాటలు మాట్లాడుతున్నారు.  కొన్ని అనవసరపు మాటలు దొర్లుతున్న సందర్భాలు ఇటీవల ఎక్కువగా కనిపిస్తున్నాయి.  కోర్టు ప్రక్రియ ప్రత్యక్ష ప్రసారాలు ప్రారంభమైన తరువాత కోర్టుల్లో కూడా న్యాయమూర్తులు జాగ్రత్తగా మాట్లాడే పరిస్థితి ఏర్పడింది. ఏమాత్రం పొరపాటు జరిగినా అది దేశవ్యాప్త  వార్తగా  మారిపోతుంది. 

సుప్రీంకోర్టు  జోక్యం

2024వ  సంవత్సరంలో  న్యాయమూర్తులు కొంతమంది ఆలోచనారహితంగా, మరికొంతమంది ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు న్యాయవ్యవస్థకి చెడ్డపేరును తీసుకువచ్చాయి.  సుప్రీంకోర్టు నాలుగుసార్లు న్యాయపరంగా, మరోసారి  పరిపాలనాపరంగా జోక్యం చేసుకుని చక్కదిద్దాల్సిన పరిస్థితి ఏర్పడింది. న్యాయమూర్తులు తమ ప్రవర్తనకుగాను ఎటువంటి పరిణామాలు ఎదుర్కొనే అవకాశం లేదు. ఎందుకంటే వారిమీద రాజకీయ నాయకులకు ఉండేవిధంగా ప్రజల నుంచి  నైతిక ఒత్తిడి ఉండదు. వాళ్లు అభిశంసనకు గురయ్యే అవకాశాలు చాలా తక్కువ.  సుప్రీంకోర్టు చర్యలు తీసుకునే అవకాశాలూ అతి తక్కువ.  అలహాబాద్​ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ శేఖర్​ కుమార్​ యాదవ్​  ఆ మధ్య  విశ్వహిందూ పరిషత్​  కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. మెజారిటీనిజమ్​ సూత్రాన్ని సమర్థించాడు.  హిందూ ఆధిపత్య గొంతుతో మాట్లాడినారు. కరిముల్లా లేదా మతోన్మాద పెద్దలు దేశానికి హానికరమని ఆరోపించారు. గోసంరక్షణని హిందువుల ప్రాథమిక హక్కుగా పొందుపరచాలని 2021వ సంవత్సరంలో  ఆయన కోరాడు.  దేశానికి ఉచిత కొవిడ్​ వ్యాక్సినేషన్​ అందించినందుకు ప్రధానిని ఆయన ప్రశంసించారు. 

అభిజిత్​ గంగోపాధ్యాయ ఉదంతం

కలకత్తా  హైకోర్టుకి చెందిన న్యాయమూర్తి జస్టిస్ ​ గంగోపాధ్యాయ మార్చి 2024లో భారతీయ జనతాపార్టీలో చేరేందుకు తమ న్యాయమూర్తి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి అందరినీ విస్మయానికి గురిచేశారు. అక్కడితో ఆయన ఊరుకోలేదు.  విలేకరుల  సమావేశంలో  ఇలా అన్నారు..‘నేను బీజేపీని సంప్రదించాను. బీజేపీ కూడా నన్ను సంప్రదించింది అని ప్రధాని మీద ప్రశంసల జల్లు కురిపించాడు. దీనివల్ల అతని న్యాయ స్వాతంత్ర్యంపై సందేహాలు ఏర్పడ్డాయి. అది సహజం కూడా. ఆయనకు వివాదాలు కొత్తేమీ కాదు. రాజకీయంగా, సెన్సిటివ్​ కేసులో మీడియా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆయనను మందలించింది.  ఆ కేసును వేరే బెంచికి బదిలీ చేసింది. కలకత్తా హైకోర్టు డివిజన్​ బెంచ్​ ఆదేశాలను నిలిపివేసి, ఆ డివిజన్​ బెంచ్​ న్యాయమూర్తులకు రాజకీయ పక్షపాతం ఉందని ఆరోపించారు. ఈ అసాధారణ పరిస్థితిని సరిదిద్దడానికి సుప్రీంకోర్టులోని ఐదుగురు సీనియర్​ న్యాయమూర్తులు ప్రత్యేకంగా కోర్టును నిర్వ హించి అభిజిత్​ఉత్తర్వులను జనవరి 2024లో స్టే చేయాల్సి వచ్చింది. గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో వెస్ట్​ బెంగాల్ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా స్త్రీ విద్వేషపూరితంగా మాట్లాడినందుకు ఎన్నికల సంఘం నుంచి మందలింపును  కూడా ఆయన ఎదుర్కొన్నాడు.

సుప్రీంకోర్టు మీద హైకోర్టు న్యాయమూర్తి దాడి

పంజాబ్​ అండ్​ హర్యానా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ రజ్​బీర్​ సెహ్రవత్​ సుప్రీంకోర్టు మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. ఆ న్యాయమూర్తి ప్రారంభించిన కోర్టు ధిక్కార కేసు విచారణపై స్టే విధించినందుకు ఆయన అనేక ధర్మరహిత వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు వాస్తవంగా ఉన్నదానికన్నా ఎక్కువ సుప్రీం అని భావించే ధోరణిలో ఉందని ఆయన తన ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఈ ఆదేశానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తమకు తాముగా కేసుని స్వీకరించి ఆ వ్యాఖ్యలని అప్పటి ప్రధాన న్యాయమూర్తి బెంచ్​ తొలగించింది. ఆ సింగిల్​ జడ్జి చేసిన పరిశీలనలు తమకు బాధ కలిగించాయని ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్​కి అధ్యక్షత వహించిన ప్రధాన న్యాయమూర్తి అన్నారు. న్యాయ క్రమశిక్షణ గురించి కోర్టు మరోసారి చెప్పింది.

జస్టిస్​ శ్రీశానంద వ్యాఖ్యలు

సెప్టెంబర్​ 2024లో కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ వేదవ్యాసాచార్​ శ్రీశానంద వ్యాఖ్యలు వైరల్​గా మారిపోయాయి. బెంగళూరులోని మైనారిటీల ప్రాబల్యం ఉన్న ప్రాంతాన్ని ఆయన పాకిస్తాన్​లాగ ఒకరోజు అభివర్ణించారు. మరోరోజు ఓ మహిళా న్యాయవాదితో అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు విషయాలు సంచలనంగా మారిన తర్వాత సుప్రీంకోర్టు తమకు తాముగా కేసుని స్వీకరించింది. ఆ తర్వాత ఆ వ్యాఖ్యలకుగాను ఆ న్యాయమూర్తి బహిరంగ కోర్టులో విచారం వ్యక్తం చేశారు. న్యాయమూర్తి క్షమాపణ చెప్పిన నేపథ్యంలో సుప్రీంకోర్టు తన విచారణను ముగించింది. న్యాయపరమైన నిగ్రహం ప్రాముఖ్యతను సుప్రీంకోర్టు మరోసారి పునరుద్ఘాటించింది. 

 కోర్టు ప్రక్రియ ప్రత్యక్ష ప్రసారాల వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని వాటిని నిలిపి వేయాలన్న డిమాండ్​ను  సుప్రీంకోర్టు తిరస్కరించడం విశేషం. ప్రత్యక్ష ప్రసారాల వల్ల ప్రజలకు కోర్టులు దగ్గర అవుతున్నాయి. ఇది నిలిపివేయడం అంటే సూర్యకాంతిని ఆపడమే. ఇప్పుడు కావాల్సింది ఇంకా ఎక్కువ సూర్యకాంతిని అందించడం. ఇలాంటి సంఘటనలు గత సంవత్సరం మాత్రమే జరగలేదు. చాలాకాలం నుంచి జరుగుతూనే ఉన్నాయి. 

2019వ సంవత్సరంలో కేరళ హైకోర్టు న్యాయమూర్తి చిదంబరేష్ మాట్లాడుతూ బ్రాహ్మణులు వ్యవహారాలకు సారథ్యం వహించాలని, అన్ని ధర్మాలు వారిలో కనిపిస్తాయని అన్నారు. ఇలా అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇవి తగ్గాలంటే హైకోర్టు, సుప్రీంకోర్టులలో అన్ని వర్గాలకు, అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం ఉండాలి. ఈ మధ్యే సుప్రీంకోర్టు న్యాయమూర్తి.. కొందరు ట్రయల్​ కోర్టు న్యాయమూర్తులు సాంఘిక మాధ్యమాల్లో చురుకుగా ఉండి వ్యాఖ్యానాలను గమనించి తన అసంతృప్తిని వెలిబుచ్చారు. న్యాయమూర్తులు ఫేస్​బుక్​లాంటి సాంఘిక మాధ్యమాల్లో చర్చలు చేయకూడదని సూచించారు. సాధారణ ప్రజలు అనుభవిస్తున్న స్వేచ్ఛలను న్యాయమూర్తి త్యాగం చేయవలసి వస్తుందని నొక్కి చెప్పారు. ఇది అందరూ గమనించాల్సిన విషయమే.

- మంగారి
రాజేందర్​