న్యూఢిల్లీ, వెలుగు : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు లో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై సోమవారం రౌస్ ఎవె న్యూలోని స్పెషల్ కోర్టు తీర్పు వెలువరిం చనుంది. తన చిన్న కొడుకు ఎగ్జామ్స్ నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత ఇటీవల కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై ఈ నెల 4న విచారణ చేపట్టిన జడ్జి కావేరి బవేజా ఇరువైపు వాదనలు ముగిసినట్లు స్పష్టం చేశారు.
అనంతరం తీర్పును సోమవారానికి రిజర్వ్ చేశారు. సాధారణ బెయిల్ పిటిషన్ పై మాత్రం ఈ నెల 20న ఇరుపక్షాల వాదనలు వింటా మని స్పష్టం చేశారు. కాగా, కవితకు కోర్టు విధించిన 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ మంగళవారంతో ముగియనుంది. దీంతో కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ తీర్పులో ఏం ఉంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ కోర్టు కవితకు బెయిల్ నిరాకరిస్తే.. మంగళవారం మళ్లీ ఆమెను కోర్టు ముందు హాజరుపరుస్తారు.